ఏపీ ప్రజలకు ఉద్యోగుల గుణపాఠం
Publish Date:Nov 3, 2015
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరూ చెప్పనంత పెద్ద గుణపాఠాన్ని నేర్పించారు. సహజంగా ప్రభుత్వోద్యోగులు అంటే ప్రజల్లో వ్యతిరేకత వుంటుంది. ఏ పని చేయాలన్నా చేయి తడపాల్సి రావడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఈ వ్యతిరేకతకు కారణం. అయితే సమైక్య ఉద్యమ సమయంలో ప్రభుత్వోద్యోగులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ భారీ స్థాయిలో ఉద్యమం చేశారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ఉద్యోగులు ఎంత గొప్ప ఉద్యమం చేశారో అని అప్పట్లో ప్రజలు మురిసిపోయారు. అయితే అప్పట్లో ప్రభుత్వోద్యోగులు సమైక్య ఉద్యమం చేసిన తమకోసమే తప్ప ప్రజల కోసం కాదనే చేదు వాస్తవం ఇప్పుడు ప్రజలకు మింగుడు పడకుండా వుంది. ఎక్కడ ఉద్యోగం చేసేవారు అక్కడే స్థిరపడిపోవాలని, ఇప్పుడు అకస్మాత్తుగా కొత్త ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళడం ఎందుకనే ఉద్దేశంతోనే ఉద్యోగులు అప్పట్లో సమైక్య ఉద్యమం చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి ఇంతకాలమైనా చాలామంది ప్రభుత్వోద్యోగులు హైదరాబాద్‌ని విడిచి విజయవాడకు వెళ్ళడానికి ఇష్టపడటం లేదు.
విభజన సందర్భంగా అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన మరింత సులభతరం చేసి, అభివృద్ధిని వేగవంతం చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వోద్యోగులలో కనిపించడం లేదు. విజయవాడకు వెళ్ళి ఎక్కడ వుండాలి.. చెట్ల కింద వుండాలా అని వెటకారపు మాటలు మాట్లాడడానికి కూడా ఉద్యోగ సంఘాల నాయకులు ఎంతమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పుడున్నది పాత చంద్రబాబు కాదు.. కాస్తంత మెత్తబడిన చంద్రబాబు. ఆ మెతకతనాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు అలుసుగా తీసుకుంటున్నారు. విజయవాడకి రావాలనంటే అవి కావాలి... ఇవికావాలి అని కోరికల చిట్టా విప్పుతున్నారు. ఇళ్ళస్థలాలు కూడా ఇవ్వాలని ఓ భారీ డిమాండ్‌ని ప్రభుత్వం ముందు పెట్టారు. ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్న జీతాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టార్జితం. మరి వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళకుండా వుండటానికి ఏవేవో సాకులు వెతుకుతున్నారు. ఇలాంటి ప్రవర్తన ద్వారా ప్రభుత్వోద్యోగులను నమ్మి తప్పు చేశాం.. మరోసారి వీళ్ళను నమ్మకూడదని వీళ్ళే ప్రజలకు గుణపాఠం నేర్పుతున్నారు.
http://www.teluguone.com/news/content/andhra-pradesh-45-51940.html





