ఆంధ్రా ప్రజలపట్ల ఇంత వివక్ష అవసరమా?
Publish Date:Jul 16, 2014
Advertisement
ఆంధ్రా, తెలంగాణా ప్రజలపట్ల ఇంత వివక్ష అవసరమా? తెరాస పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన చాలా హామీలను అమలు చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకొంది. దీనివల్ల తెలంగాణాలో అన్ని వర్గాల ప్రజలకు లబ్దికలుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ, బంగారు, పవర్ లూమ్ కార్మికుల రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం ఎటువంటి సందిగ్దత కనబరచకుండా చాలా స్పష్టంగా నిర్ణయం ప్రకటించడం హర్షణీయం. అదేవిధంగా తాత్కాలిక కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, మళ్ళీ వారిలోవయసు మీరినవారి పట్ల సానుభూతిగా వ్యవహరిస్తూ వారి కోసం నిబంధనలు సడలించాలని నిర్ణయించడం ప్రభుత్వం యొక్క మానవీయ కోణాన్ని చాటిచెపుతోంది. సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల తెలంగాణా ప్రభుత్వం చూపిన ఆదరణ కూడా చాలా అభినందనీయం. తెలంగాణాలో జనాభాలో అత్యధికంగా ఉన్న యస్సీ, ఎస్టీ, ముస్లిం, గిరిజన, ఆదివాసీలకు పెన్షన్లు, భూములు, ఇళ్ళు, విద్యావకాశాలు కల్పించాలనుకోవడం కూడా చాలా హర్షణీయం. తెలంగాణా కోసం అమరులయిన వీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలనుకోవడం గొప్ప విషయమే. కానీ 1969నుండి పోరాడి అమరులయిన వీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలనుకోవడం ఇంకా గొప్ప విషయం. తెలంగాణా ప్రజల పట్ల అవ్యాజమయిన ప్రేమాభిమానాలు, కరుణ చూపించిన తెరాస ప్రభుత్వం ప్రతీచోట కూడా ఆంధ్రా, తెలంగాణా అనే భేదం ఖచ్చితంగా పాటించాలని అనుకోవడం చాలా బాధాకరం. విద్యార్ధుల విషయంలో కూడా ఖచ్చితంగా ఈ వివక్ష పాటిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం మరింత బాధాకరం. ఏదో ఒకరోజు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందని ఎవరూ ఎన్నడూ ఊహించలేదు. అందుకే రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. హైదరాబాదునే తమ స్వస్థలంగా భావిస్తూ అక్కడే చాలా మంది స్థిరపడ్డారు. వారిలో అనేకమంది వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఎన్నో ఏళ్లబట్టి పనిచేస్తున్నారు. వారి పిల్లలు అక్కడే పుట్టి అక్కడే చదువుకొని తాము తెలంగాణావాసులమనే అనే భావనతో ఉన్నారు. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే వారి పట్ల వివక్ష చూపుతామని ప్రకటించడంతో వారందరి జీవితాలు, భవిష్యత్తు అయోమయంగా మారబోతోంది. అనేక దశాబ్దాలుగా తెలంగాణాలో స్థిరపడి, అక్కడే పుట్టిపెరిగిన వారు ఇప్పుడు అటు తెలంగాణాకు, ఇటు ఆంధ్రాకు చెందని కాందీశీకులయిపోయారు. వారందరినీ తెలంగాణా ప్రభుత్వమే ఆదుకోవలసిన అవసరం లేదు. ఆంధ్రా ప్రభుత్వంతో మాట్లాడి వారి సంక్షేమం కోసం రెండు ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక వ్యవస్థలు, నిధులు, పధకాలు ఏర్పాటు చేసి మానవత్వంతో వ్యవహరించాలి. ప్రాంతీయవాదాన్ని పక్కనబెట్టి జాతీయ దృక్పధంతో వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేయాలి తప్ప ప్రభుత్వాలే ప్రజల పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం సబబు కాదు.
http://www.teluguone.com/news/content/andhra-people-45-36008.html





