రాజధాని పేరు వెనుక సీక్రెట్ బయటపెట్టిన చంద్రబాబు.!
Publish Date:Aug 13, 2026
Advertisement
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరు వెనుక ఉన్న వ్యక్తి ఎవరన్న సీక్రెట్ బయటపెట్టారు. అమరాతి ప్రగతికి, పురోగతికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానికి అమరావతి అని పేరు పెట్టాలనే ప్రతిపాదన వెనుక ఉన్న వ్యక్తి ఈనాడు అధినేత రామోజీరావు అని వెల్లడించారు. రాజధాని నిర్మాణం చేపడుతున్న ప్రారంభ సమయంలో రామోజీరావు తనకు స్వయంగా ఫోన్ చేశారని గుర్తు చేసుకున్న చంద్రబాబు.. గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న ఆ ప్రాంతానికి ఉన్న ప్రాచీన విశిష్టత, చారిత్రక నేపథ్యంపై తన మీడియా బృందంతో ప్రత్యేకంగా రీసెర్చ్ చేయించి ఒక సమగ్ర నివేదికను రూపొందించినట్లు చెప్పారనీ, ఆ సదర్భంగానే ఆయన రాజధానికి అమరావతిపేరు సూచించారనీ చంద్రబాబు వెల్లడించారు. ఆ తరువాత రామోజీరావు తనకు ఆ పరిశోధనా పత్రాన్నిపంపారనీ, దాని ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ రాజధానికి 'అమరావతి' అనే పేరు పెట్టాననీ అన్నారు. రామోజీ నోట వెంట అమరావతి పేరు వినగానే తనకు పవిత్ర భావన కలిగిందనీ, ఒక్కసారిగా ఒళ్లు పులకరించిందనీ చంద్రబాబు చెప్పారు. శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి' పేరు ప్రకటించినప్పుడు రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడి నుంచి ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రాలేదన్న ఆయన అమరావతికి ఎవరూ ప్రత్యామ్నాయ పేరును కూడా సూచించలేకపోయారన్నారు. అమరావతి అనే పదంలో ఉన్న మహత్తర శక్తే అందుకు కారణమన్నారు. జగన్ హయాంలో మూడు రాజధానుల నిర్ణయం వల్ల అమరావతి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. ఆ సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు పార్టీ ఖాతాలో నిధులు లేకపోయినా, స్వయంగా జోలె పట్టి నిధులు సేకరించి సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయపోరాటానికి సహకరించిన సందర్భాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు.. దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని ఉద్యమ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముళ్ల కంపలను సైతం లెక్కచేయకుండా రైతులకు మద్దతుగా నిలిచారని ప్రశంసించారు. అలాగే తన సతీమణి నారా భువనేశ్వరి కూడా రైతుల ఉద్యమానికి తన చేతి గాజులను విరాళంగా ఇచ్చి మద్దతు పలికారని గుర్తు చేసుకున్నారు. అమరావతి నిర్మణంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, భవిష్యత్తులో ఎక్కడా విద్యుత్ స్తంభాలు లేదా పదేపదే రోడ్లు తవ్వే పరిస్థితి లేని విధంగా భూగర్భ డక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో సైబరాబాద్, ఓఆర్ఆర్ నిర్మించిన అనుభవంతో అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజలందరూ ఆరోగ్యం, సంపద, ఆనందంతో ఉండాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్న చంద్రబాబు అమరావతి ప్రజా రాజధానిగా.. రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని భరోసా ఇచ్చారు. Amaravati Capital Name Story, Chandrababu Naidu, Ramoji Rao, Amaravati Research Paper, AP Capital Amaravati History, TeluguOne
http://www.teluguone.com/news/content/amaravati-capital-name-story-25-228870.html





