ఏపీ కేపిటల్ అమరాతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
Publish Date:Apr 6, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతిని రాజధానిగా ధ్రువీకరిస్తూ చేసిన సవరణ బిల్లును పార్లమెంటుకు పంపిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఉభయ సభలలో కూడా ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ ప్రక్రియలో భాగంగా, 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని కీలక అంశాలకు సవరణలు చేశారు. ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ 5, సబ్-సెక్షన్ (2)లో ఉన్న మార్పులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో పునర్వ్యవస్థీకరణ చట్టంలో "కొత్త రాజధాని ఉండేది. ఇప్పుడు ఆ పదాన్ని తొలగించి, దాని స్థానంలో అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది అని స్పష్టంగా పొందుపరిచారు. ఈ మార్పు ద్వారా 'అమరావతి' అనే పదానికి చట్టపరమైన నిర్వచనాన్ని కూడా ఇచ్చారు. సీఆర్డీయే చట్టం 2014 నిబంధనల ప్రకారం నోటిఫై చేయబడిన ప్రాంతాలన్నీ అమరావతి కిందకు వస్తాయని గెజిట్లో స్పష్టం చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సవరణ చట్టం 2024 జూన్ 2వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లుగా కేంద్రం పేర్కొంది. అంటే, సాంకేతికంగా 2024 జూన్ 2 నుంచే అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టపరమైన గుర్తింపు పొందింది. ఈ గెజిట్ ప్రచురణతో ఇకపై రాజధాని విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది. గత కొన్నేళ్లుగా రాజధాని అంశంపై నెలకొన్న రాజకీయ మరియు న్యాయ పోరాటాలకు ఈ గెజిట్ ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపింది. అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి చట్టబద్ధత లభించడంతో, రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధుల సమీకరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనకు ఈ గెజిట్ పునాదిగా నిలవనుంది. అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు ఆకర్షించడానికి, కేంద్ర సహాయ సహకారాలు పొందడానికి ఈ చట్టబద్ధత ఎంతో దోహదపడనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం రాజధాని అభివృద్ధికి ఎటువంటి కార్యాచరణను రూపొందిస్తుందో చూడాలి.
http://www.teluguone.com/news/content/amaravati-as-capital-25-216801.html





