అమరావతి ఊపిరి పీల్చుకో.. జగన్‌రెడ్డీ ఇప్పటికైనా మేలుకో.. చంద్రబాబును చూసి నేర్చుకో..
Publish Date:Mar 3, 2022
Advertisement
అమరావతి. అది చంద్రబాబు కాంక్షించిన సుందర స్వప్నం. నవ్యాంధ్ర సగౌరవంగా తలెత్తుకు నిలిచే రాజధాని నిర్మాణం. ఆంధ్రుల అంతర్జాతీయ స్థాయి నగరం. జయహో అమరావతి.. జయజయహో తెలుగుజాతి. ఇంతవరకూ దేశం ఎరుగని.. అద్భుత రాజధాని ప్రణాళిక. థింక్ గ్లోబల్.. యాక్ట్ లోకల్ స్పూర్తితో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అమరావతిని అత్యద్భుతంగా రూపొందించే ప్రయత్నం చేశారు. చంద్రబాబును, ఆయన విజన్‌ను నమ్మి.. 33 గ్రామాల రైతులు వేల ఎకరాలు దారదత్తం చేశారు. సీఆర్‌డీఏ ఏర్పాటు చేసి.. అంతర్జాతీయ సంస్థలతో రాజధాని నమూనాలు సిద్ధం చేయించి.. అనేక నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వకున్నా.. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్‌లో అమరావతి వైభవానికి వడివడిగా అడుగులు వేశారు. తాత్కాలిక భవనాలతో ఓ రూపు తీసుకొచ్చారు. శాశ్వత భవనాలకు పునాదులు వేశారు. ఆకాశ హర్మాలకు కాంక్రీట్ వేస్తుండగా.. ఒక్క ఛాన్స్ అంటూ సునామీలా ముంచుకొచ్చి.. అమరావతిని ముంచేసి.. రాజధానిని సర్వనాశనం చేసేశారు జగన్మోహన్‌రెడ్డి. ఆంధ్రుల కలల రాజధానిని.. జగనన్న చిదిమేశారు. అంతర్జాతీయ స్థాయి కేపిటల్‌ను కాల రాశారు. అమరావతిని స్మశానంగా మార్చేశారు. మూడు రాజధానులంటూ.. మూడు ముక్కలాట ఆడారు. నవ్యాంధ్రకు రాజధానే లేకుండా చేశారు. అమరావతి రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించారు. ఉద్యమిస్తే.. లాఠీలతో కొట్టారు. కేసులతో బెదిరించారు. ఇనుప కంచెలతో కట్టడి చేయాలని చూశారు. అయినా.. తగ్గేదేలే అంటూ 800 రోజులకు పైగా రాజధాని రైతులు, మహిళలు అమరావతి కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఎంతగా ఫైట్ చేస్తున్నా.. జగమొండి జగన్‌లో ఉలుకూ పలుకూ లేదు. అందుకే, అమరావతిలో న్యాయం ఉందని.. ఆ న్యాయాన్ని కాపాడాల్సింది.. ఉన్నత న్యాయస్థానమేనని భావించారు. హైకోర్టులో పలు పిటిషన్లు వేశారు. ఆ కేసులను విచారించిన ధర్మాసనం తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. అమరావతికి మళ్లీ ప్రాణం పోసింది. 6 నెలలు గడువు పెట్టి మరీ.. రాజధాని పూర్తి చేయాల్సిందేనని ఆదేశించింది. 3 నెలల్లో రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. అమరావతికి ఇది పండుగ సమయం. ఆంధ్రులకు నిండుగౌరవం. మీ రాజధాని ఏది? అంటే ఇన్నాళ్లూ చెప్పుకోలేక, తలొంచుకుని ఉండేవారు ఆంధ్రులు. ఇప్పుడు తలెత్తుకొని.. సగౌరవంగా, సగర్వంగా.. మా రాజధాని అమరావతి అని ఘనంగా చెప్పుకునే రోజు వచ్చేసింది. మాది అల్లాటప్పా రాజధాని కాదు.. అంతర్జాతీయ స్థాయి నగరమని చెప్పుకునే రోజు కోసం మరింత కాలం ఆగాల్సి ఉంది. జగన్‌రెడ్డి వల్ల ఆ ఘనకార్యం సాధ్యం కాదని ఇప్పటికే తేలిపోయింది. మళ్లీ చంద్రన్న రావాలి.. మన అమరావతి సంపూర్ణం కావాలి.. గత ఎన్నికల్లో చేసిన తప్పును ఈసారి సరిదిద్దుకోవాలి.. జై అమరావతి.. జైజై అమరావతి.. అంటున్నారు ఆంధ్రులు.
http://www.teluguone.com/news/content/amaravati-as-ap-dream-capital-39-132496.html





