అమరావతి రైతుల పాదాలకు బొబ్బలు, పుండ్లు.. పాలతో కడిగిన నెల్లూరు ప్రజలు
Publish Date:Nov 25, 2021
Advertisement
అమరావతి రైతుల మహా పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రాజధాని రైతులు సాగిస్తున్న యాత్రకు అడుగడుగునా జనం ఘన స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సున్నంబట్టి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర.. రాచర్లపాడు, రేగడిచెలిక, పెయ్యలపాళెం, చంద్రశేఖరపురం, పైడేరు, కమ్మపాళెం, బొడ్డువారిపాళెం, నాయుడుపాళెం, గండవరం రోడ్డు మీదుగా 15 కిలోమీటర్ల పాటు సాగి రాజుపాళెం చేరుకుంది. అక్కడ రైతులకు ఘన స్వాగతం లభించింది. వందలాదిమంది ప్రజలు.. అమరావతి రైతులకు ఎదురువెళ్లి స్వాగతం పలికారు. 25 రోజులుగా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు పాదాలకు బొబ్బలు వచ్చాయి. కొందరికి పుండ్ల వచ్చాయి. మహిళా రైతులు నడవలేక ఇబ్బంది పడుతున్నారు. అయినా పాదయాత్ర మాత్రం ఆపడం లేదు. కాళ్లు నొప్పులు పెడుతున్నా, నడవడానికి ఇబ్బంది పడుతున్నా.. ఏ మాత్రం లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు, పాదయాత్ర చేస్తున్న రైతుల పాదాలకు బొబ్బలు, పుండ్లు చూసి చలించిపోయారు రాజుపాళెం ప్రజలు, వివిధ పార్టీల నాయకులు. రైతుల పాదాలను పాలతో కడిగారు. రైతుల మహాపాదయాత్రకు స్థానికులు దారిపొడవునా బంతిపూలతో స్వాగతం పలికారు. గ్రామ పొలిమేర్లలో రంగువల్లులు తీర్చిదిద్దారు. పలువురు నేతలు, ప్రవాసాంధ్రులు రైతులకు మద్దతు తెలిపారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వారిపై కేసులు పెట్టడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రైతుల మహాపాదయాత్రకు గురువారం విరామం ప్రకటించారు. శుక్రవారం యథావిధిగా మహా పాదయాత్ర కొనసాగుతుందని అమరావతి జేఏసీ తెలిపింది.
http://www.teluguone.com/news/content/amaravathi-padayatra-women-farmers-facing-problems-39-127073.html





