ఆళ్లనాని.. తెలుగుదేశం గూటికి.. పార్టీ క్యాడర్ ను చంద్రబాబు సముదాయించగలరా ?
Publish Date:Dec 3, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నాయకుడు ఆళ్ల నాని తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైంది. వైసీపీలో చాలా కాలం కొనసాగినప్పటికీ ఆళ్ల నాని ఎన్నడూ తెలుగుదేశం నేతలపై నోరు పారేసుకున్నది లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డికి విధేయుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల నాని ఆ విధేయత కారణంగానే వైఎస్ మరణం తరువాత జగన్ వెంట నడిచారు. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించి వైసీపీ సర్కార్ ఏర్పడిన తరువాత జగన్ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆయనకు పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు. ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఆ తరువాత వెనక్కు తీసుకున్నారు. ఆళ్ల నాని వైసీపీ తరహా రాజకీయాలకు దూరంగా ఉండటమే అందుకు కారణమన్న ప్రచారం అప్పట్లో గట్టిగా నడిచింది. జగన్ ను ఇంప్రెస్ చేయడానికి ఏవైతే చేయాలో అవేమీ ఆళ్ల నాని చేయలేదని, అందుకే ఆయనను జగన్ దూరం పెట్టారనీ అప్పట్లోనే వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింద. ఇక రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పతనమై, తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత నాని పరిస్థితి వైసీపీలో మరింత అధ్వానంగా తయారైంది. ఓటమి తరువాత కూడా జగన్ తీరు మారకపోవడం, కొత్తగా కొలువుదీరిన తెలుగుదేశం కూటమి సర్కరా్ పై ఎదురుదాడే అన్నట్లుగా ఆయన చేపట్టిన కార్యక్రమాలతో విసిగిపోయిన ఆళ్ల నాని చివరకూ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంలో తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. అన్నట్లుగానే ఇంత కాలం ఆయన నుంచి రాజకీయల ప్రస్తావనే రాలేదు. అయితే తాజాగా ఆయన తెలుగుదేశం గూటికి చేరడానికి నిర్ణయించుకున్నారు. అందుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పచ్చజెండా కూడా ఊపేసినట్లు చెబుతున్నారు. ఇంత వరకూ బానే ఉంది కానీ ఆళ్ల నాని తెలుగుదేశం గూటికి చేరడాన్ని ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం క్యాడర్ స్వాగతించే అవకాశాలు లేవని అంటున్నారు. ఇంత కాలం అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నంత కాలం పార్టీకి అండగా నిలిచి వైసీపీ దౌర్జన్యాలు, దాడులకు గురైన వారి నుంచి ఆళ్ల నాని చేరికపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం పార్టీలో కష్ట పడిన కార్యకర్తలకు తప్పని సరిగా గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు. ఆళ్ల నాని చేరిక వల్ల పార్టీలో ఎవరికీ అన్యాయం జరగకుండా తాను చూసుకుంటానని భరోసా ఇస్తున్నారు. ఆళ్ల నాన్ని రాజకీయాలలో ఎన్నడూ మర్యాద గీత దాటలేదని, అటువంటి వారి చేరడం వల్ల పార్టీకి బలమే తప్ప నష్టం జరగదని చంద్రబాబు చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి మాత్రం షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా వైసీపీకి గుడ్ బై చెప్పేసి కూటమి పార్టీల్లో ఏదో ఒక గూటికి చేరిపోవడమే బెటర్ అని వైసీపీ నేతలు గట్టిగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గుర్తింపు, ప్రాధాన్యత, పదవులు వంటి డిమాండ్లేమీ లేకుండానే పార్టీలో చేర్చుకుంటే చాలు అన్నట్లుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వైసీపీ నేతల తీరు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీతో అంటకాగడం వల్ల రాజకీయ భవిష్యత్ సంగతి తరువాత, ముందు తమను జనం పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉందన్న భయం వారిలో వ్యక్తం అవుతోంది. అందుకే ఒకరి తరువాత ఒకరిగా వైసీపీకి దూరం జరుగుతున్నారని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/alla-nani-to-join-tdp-39-189355.html