పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం.. విపక్షా పార్టీల వాకౌట్..!
Publish Date:Jul 19, 2026
Advertisement
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సెషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఒక ప్రత్యేక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ అనెక్సీ భవనంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో సీట్ల కేటాయింపు వ్యవహారం పెద్ద వివాదానికి దారితీసింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీలకు కేంద్రం ప్రత్యేకంగా ఆసనాలు కేటాయించడమే కాకుండా, వారిని విడిగా ఆహ్వానించడంపై ప్రతిపక్షాల ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన సుమారు 20 మంది రెబల్ ఎంపీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఇండియా (NCPI) అనే కొత్త పార్టీలో విలీనమయ్యారు. అయితే ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ 20 మంది తిరుగుబాటు ఎంపీల గ్రూపునకు ప్రత్యేకంగా ఒక టేబుల్‌ను, ప్రత్యేక సీట్లను కేటాయించడం వివాదానికి కేంద్ర బిందువైంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ తిరుగుబాటు ఎంపీల కొత్త పార్టీని ఇంకా అధికారికంగా గుర్తించలేదని, గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకుండానే వారిని అఖిలపక్ష సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారని ప్రతిపక్ష నేతలు నిలదీశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు ఒక్కసారిగా సమావేశం నుంచి బయటకు నడిచి వాకౌట్ చేశారు. ఈ నాటకీయ పరిణామంతో పార్లమెంట్ అనెక్సీ భవనం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వాకౌట్ రాజకీయంలో సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, జేఎంఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన (యూబీటీ) తో పాటు వామపక్ష పార్టీలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. ఒకే మాటపై నిలబడిన ఈ విపక్షాలు సభ వెలుపల తమ నిరసనను గట్టిగా వినిపించాయి. అయితే కొంతసేపటి తర్వాత ఉద్రిక్తతలు కాస్త సర్దుమణగడంతో, ప్రతిపక్ష కూటమి నేతలు తిరిగి వచ్చి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. వర్షాకాల సమావేశాల్లో తాము లేవనెత్తనున్న ప్రజా సమస్యలు, ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చలు కొనసాగించారు. దేశ రాజధానిలో జరిగిన ఈ ఆకస్మిక రాజకీయ ప్రకంపనలు, రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎంత రసవత్తరంగా జరగనున్నాయో అనేదానికి స్పష్టమైన సంకేతంగా నిలిచాయి. All Party Meeting, India Bloc Walkout, Rebel TMC MPs Seating, Parliament Monsoon Session, Kiren Rijiju, NCPI Party, Mallikarjun kharge
http://www.teluguone.com/news/content/all-party-meeting-36-226449.html





