కేటీఆర్ ర్యాలీలో జగన్ ఫ్లెక్సీలు.. దీని భావమేమి తిరుమలేశా?
Publish Date:Jun 29, 2026
Advertisement
ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బీఆర్ఎస్, వైసీపీల బంధం గురించి చర్చ బాహాటంగా సాగడం కద్దు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైపీపీ అధినేత జగన్, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుల మధ్య స్నేహం, అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇరువురు నేతలూ పరస్పరం ప్రశంసలను గుప్పించుకోవడం తెలిసిందే. తాజాగా వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నిర్వహించిన ఒక భారీ ర్యాలీలో బీఆర్ఎస్ గులాబీ జెండాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. కేటీఆర్ పర్యటన వేదిక వద్ద కేటీఆర్, వైఎస్ జగన్ ఇద్దరి చిత్రాలు పక్కపక్కనే ఉన్న కటౌట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తెలంగాణ వేదికగా జరిగిన ఈ పొలిటికల్ డెవలప్మెంట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్న అసలు కథేంటి, దీని వెనుక ఏవైనా పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయా అన్నది ఇప్పుడు రాజకీయవర్గాలలో తెగ చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తెలంగాణ రాజకీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ కి నాయకుల ఫోటోలు లేదా ఫ్లెక్సీలు చాలా చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. గతంలో 2019 లోక్సభ ఎన్నికల సమయంలో సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం కేటీఆర్ స్వయంగా హైదరాబాద్లో జగన్ తో భేటీ అఅయ్యారు. అయితే ఆ తర్వాత కాలంలో రెండు పార్టీల మధ్య, అలాగే కేటీఆర్, జగన్ మధ్య అనుబంధానికి సంబంధించిన వార్తలుపెద్దగా వినిపించలేదు. మధ్యలో అడపాదడపా వైసీపీ బీఆర్ఎస్ అనుబంధం, జగన్, కేటీఆర్ స్నేహం గురించిన ప్రస్తావనలు వచ్చినా, తాజాగా వికారాబాద్ లో కేటీఆర్ ర్యాలీ జరుగుతున్న సమయంలో జగన్ ఫ్లెక్సీలు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక పొలిటికల్ స్ట్రాటజీ ఉందన్న ప్రచారం జోరందుకుంది. ఈ పరిణామంపై తెలంగాణలో కాంగ్రెస్, ఏపీ తెలుగుదేశం నేతలు తమదైన శైలిలో విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్, వైసీపీల మధ్య అంతర్గత అవగాహన ఉందంటూ తాము చేసిన ఆరోపణలకు ఈ ఫ్లెక్సీలు బలమైన నిదర్శనమని అంటున్నారు. మరోవైపు, వికారాబాద్ లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించేందుకు, వైసీపీ సానుభూతిపరుల మద్దతును కూడగట్టేందుకే ఈ తరహా ఫ్లెక్సీల వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/agans-flex-banners-at-ktrs-rally-39-224515.html





