ఏబీఎన్ రాధాకృష్ణకు సతీవియోగం.. ప్రముఖుల సంతాపం
Publish Date:Apr 27, 2021
Advertisement
ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. దుర్గ మరణంతో ఆంధ్రజ్యోతి సంస్థల ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర వేలేరులో కనకదుర్గ జన్మించారు. బిషప్ అజరయ్య స్కూల్లో ఆమె విద్యాభ్యాసం చేశారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదువుకున్న కనకదుర్గ.. విజయవాడలోనే సిటీ పబ్లిక్ స్కూల్ టీచర్‌గా పనిచేశారు. అనంతరం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు. కాకినాడ, విజయవాడ, హైదరాబాద్‌లోని పలు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లలో ఆమె విధులు నిర్వర్తించారు. బంజారాహిల్స్ బ్రాంచ్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో కనకదుర్గ వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. 1983 జూలై 3న వేమూరి రాధాకృష్ణ- కనకదుర్గల వివాహం జరిగింది. 2002లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌గా, 2009లో ఏబీఎన్‌లోనూ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కనకదుర్గకు కుమారుడు ఆదిత్య, కుమార్తె అనూష ఉన్నారు. వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో చనిపోవడం బాధాకరమని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్‌గా కనకదుర్గ.. సంస్థ అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారన్నారు. సేవా భావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఉద్యోగులను ఉద్యోగుల్లా కాకుండా సొంత బిడ్డల్లా ఆమె చూసుకునేవారని తెలిపారు. వేమూరి రాధాకృష్ణ సతీమణి, వేమూరి కనకదుర్గ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వేమూరి కనకదుర్గ మరణం తనను కలిచివేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నరసింహన్ సంతాపం తెలిపారు. వేమూరి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కనకదుర్గ ఆత్మకు శాంతి చేకూరాలని నరసింహన్ ఆకాక్షించారు. రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ కనకదుర్గ మృతితో దిగ్భ్రాంతికి గురయ్యానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. బ్యాంకు అధికారిణిగా పనిచేసి, సంస్థ నిర్వహణ బాధ్యతలలో తనదైన ముద్ర వేశారన్నారు. రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కనకదుర్గ మృతిపై తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. టీడీపీ నేతలు, మాజీ మంత్రులు తమ ప్రగాఢ సానుభుతి తెలిపారు.
http://www.teluguone.com/news/content/abn-md-vemuri-radhakrishna-wife-demise-25-114374.html





