జగన్ కు బెయిల్ రాజకీయ సమీకరణాల రహస్యం?!
Publish Date:Sep 30, 2013
Advertisement
దుర్యోధనుడికి ధర్మం ఏమిటో తెలుసుకాని ఆ వైపు అతడి మనస్సు పోదట, అలాగే అతడికి అధర్మం ఏమిటో కూడా తెలుసుగాని దానినుంచి (ఆధర్మం నుంచి) అతనికి మనసు మళ్ళదట! అలాగే కొందరు రాజకీయ నాయకులూ, వారి అవకాశవాద పక్షాలూ తీరుతెన్నులు కూడా అలాగే ఉన్నాయి. వై.ఎస్.ఆర్. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం దాని ప్రభుత్వంచే పెట్టించిన నానారకాల కేసుల సందర్భంగా గత 16 మాసాలుగా జైలులో నిర్బంధం అనంతరం బెయిల్ పైన షరతులతో విడుదలైన తరువాత ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యపై ఇంతకాలం ఆకుకు అందకుండా పోకకు పొందకుండా ప్రకటనలు చేస్తున్న వివిధ రాజకీయ పక్షాల మధ్య సమీకరణల తతంగం ప్రారంభమైంది. ఇది జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయ్యేదాకా ఈ పక్షాలు అనుసరించిన తీరువేరు, గగ్గోలు పెట్టిన పరిస్థితి వేరు. కాగా, అతడి విడుదల తర్వాత ఇవే రాజకీయపక్షాల మధ్య ఆదరాబాదరా ఆఘమేఘాల మీద సాగుతున్న సమీకరణలు వేరు! విచిత్రమేమంటే - అటు కాంగ్రెస్ వర్గాలలోనూ, ఇటు కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న కొన్ని రాజకీయపక్షాలలోనూ జగన్ విడుదల తర్వాత సాగుతున్న మల్లగుల్లాలు ఇంతకూ ఈ పక్షాల కేంద్రీకరణ రాష్ట్ర విభజన సమస్యపైనా లేక జగన్ విడుదలవల్ల అతడి విడుదలవల్ల తమకు జరగబోయే లాభనష్టాలపైననా అన్నది ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. రాష్ట్ర విభజన సమస్యపై వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ వచ్చిన విధానం, దానిపై అతని విడుదలకు చాలాకాలం ముందు చేసిన ప్రకటనకూ, విడుదలకు ముందు కొలదిరోజుల క్రితం తీసుకున్న వైఖరికీ తేడా ఉందని కొన్ని ప్రతిపక్షాల నాయకులు భావించి, 'అదిగో చూశారా జగన్ విడుదల కోసమే అధికార కాంగ్రెసూ జగన్ పార్టీ మధ్యలో లోపాయికారీ ఒప్పందం కుదిరంద'నీ విడుదల కోసమే జగన్ పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలిపి, 'రాష్ట్రప్రజల్ని మోసగించింద'నీ ప్రధాన ప్రతిపక్షమైన "తెలుగుదేశం'' పార్టీ నాయకులు కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు; వీరికి అండగా ఉన్న రెండు 'టీవీ'లూ, రెండు మూడు దినపత్రికలూ ఊహాజనితమైన కథనాలను జగన్ బెయిల్ పై విడుదలైన క్షణం నుంచీ ప్రచురణలూ, ప్రసారాలూ మొదలెట్టాయి. "గురివింద గింజ తన ముడ్డికింద నలుపు'' తెలియదట. కాని, ఈ కథనాలకు దిగిన కొందరు నాయకులూ, వారి ప్రచార యంత్ర్రాంగాలూ ఎందుకింత తొందరబాటుతో ముందుకు వచ్చి ఉంటాయి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు తనపైన ఉన్న స్పష్టమైన కనీసం మూడు కేసులలో తీవ్ర అభిగాలను కోర్టులలో ఎదుర్కోనవలసి వచ్చింది [ఐ.ఎం.జి., ఎమ్మార్, రహేజా, డెల్ఫ్ సంస్థలకు చెందిన లావాదేవీల్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కుదిరిన ఒప్పందాలలో]! అతని ముఖ్యమంత్రిత్వం ముగిసిన తరువాత, రాజశేఖరరెడ్డి పరిపాలనకు వచ్చిన అనంతరం కోర్టుల పరధిలోకి వెళ్ళిన కేసులవి. అందులో ఒకటి [ఈ వ్యాస రచయిత] ఐ.ఎం.జీ. సంస్థతో చంద్రబాబు నడిపిన లావాదేవీల తాలూకు భూముల కేటాయింపునకు సంబంధించిన కేసు! పైన తెల్పిన కేసులేవీ ఈ రోజుకీ ఒక కొలిక్కి రాలేదు. విభజన విషయంలో కాంగ్రెస్ ఎంత 'చావుతెలివి'తో వ్యవహరించిందంటే ఏ దేశంలోనైనా పాలకపార్టీ స్థాయిలో సమస్యలపై చేసే నిర్ణయాలను ముందుగా ప్రకటించాకనే ఇతర ప్రతిపక్షాల అభిప్రాయాల్ని కోరడం పార్లమెంటరీ వ్యవస్థలో ఆనవాయితీ! కాని ఇక్కడ జరిగిన పని - రాష్ట్ర విభజన విషయంలో అసలు తానేమనుకుంటున్నదో, తన నిర్ణయమేమిటో తెల్పకుండా, "ముందు మీ అభిప్రాయాలు చెప్పండి'' అని ప్రతిపక్షాలను కోరి, వాటిని ఇబ్బందుల్లోకి నెట్టడం! "అవునేవ్! ఆ వచ్చేవాడు కామమ్మ మొగుడే అయి ఉండాల''ని వెనకటికొకావిడ అన్నాదో లేదో మిగతా వాళ్ళంతా "అవును, అతడు కామమ్మ మొగుడే, సందేహం లే''దని గొర్రెదాటుడు పద్ధతిలో అందరూ అలాగే 'బృందగానం' చేశారట! సరిగ్గా ఆ పద్ధతిలోనే కాంగ్రెస్ తాను రాష్ట్రవిభజన సమస్యను తన నెత్తిమీదికి ఎందుకు తెచ్చుకోవాలనుకుని, రాష్ట్రంలోని ఇరుప్రాంతాల ఓట్లు, సీట్లపైన కన్నువేసి, తానుగా బయటపడకుండా, తన నిర్ణయమేమిటో చెప్పకుండా, సీమాంధ్రనుంచి వచ్చి తెలంగాణా తెలుగుప్రజల మధ్యన ఒక కలుపుమొక్కలా తిష్టవేసి ఒక 'మల్టీనేషనల్ కుటుంబాన్ని' నడుపుతున్న 'బొబ్బిలిదొర' కె.సి.ఆర్. అనే ఊరసవెల్లితో మంతనాలాడి, అన్ని ప్రతిపక్షాలనూ ముగ్గులోకి లాగింది. ఇంకేముంది, కొన్ని ప్రతిపక్షాల నాయకులు కాంగ్రెస్ బుట్టలో పడిపోయి దేనికదే తామెక్కడ అభాసుపాలైపోతామోనని భావించి కాంగ్రెస్ ప్రతిపాదనకన్నా ముందుగానే విభజన భావనకు సమ్మతించి వచ్చాయి! ఎటు తిరిగీ సీమాంధ్రయావత్తూ చుక్కాని పట్టే రాజకీయనాయకుడు లేకపోయినా ఉద్యోగ, రైతు, మహిళా, కార్మిక, విద్యారంగాలకు చెందిన వారంతా బహుళ సంఖ్యలో రోజుల తరబడి, మైళ్ళకొలదీ సమ్మెయాత్రలు చేస్తున్న తరువాతనే, విభజనను వ్యతిరేకిస్తూ స్పష్టమైన ప్రకటనతో జగన్ పార్టీ బేషరతుగా ముందుకు రావటం, జగన్ మరికొన్నేళ్ళు జైలులోనే ఉంటే బాగుంటుందని కొన్ని పక్షాలు [టి.డి.పి., బి.జె.పి., కమ్యూనిస్టు పార్టీ, కొన్ని చుల్లర పార్టీలూ] భావిస్తున్న తరుణంలో జగన్ బెయిల్ మీద షరతులతో విడుదలయ్యాడు! ఈ పరిణామాన్ని ఈ పక్షాలు సహించలేక జగన్ బెయిల్ కు తప్పుడు భాష్యాలు చెప్పడం ప్రారంభించారు! వాటిల్లో కొన్ని -కేసులనుంచి బయటపడడం కోసం కాంగ్రెస్ తో చేతులు కలిపిన టి.డి.పి., రేపు రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీ తమకు ఒక 'శని'గా దాపురించిందని భావిస్తున్న కొన్ని ఇతర నామమాత్రపు ప్రతిపక్షాలు గతపదేళ్లలో ఏ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో పట్టుమని డజను అసెంబ్లీ స్థానాలు కూడా గెలవలేని బిజెపి, కమ్యూనిస్టు పార్టీలు, కాసేపు కాంగ్రెస్ తో, మరికొంతసేపు టి.డి.పి.తోనూ ఇచ్చకాలాడి, తెలుగుజాతిని చీల్చడం కోసం కేవలం ద్వేషపూరిత ప్రచారాలతో మన తెలంగాణా ప్రాంతపు యువకులైన సొంతబిడ్డల్ని ఆత్మహత్యలవైపు పురిగొల్పి వాటినుంచి తన కుటుంబాన్ని మినహాయించుకున్న బొబ్బిలిదొర పార్టీ టి.ఆర్.ఎస్; ఏ తెలుగుజాతిని సమైక్యంగా ఒక్క గొడుగు కిందికి చేర్చి విశాలాంధ్ర ఏర్పాటుకు పునాదులు లేపి, దోహదం చేసిందో, ఏ దొరల, భూస్వామ్య, జాగిర్దారీ వర్గాల చెరనుంచి బడుగుబలహీన వర్గాల అండతో తెలంగాణా రైతాంగ సాయుధపోరాటానికి నాయకత్వం వహించి ఇప్పుడు తెలుగుజాతిని చీల్చడానికి వెనుదీయని కమ్యూనిస్టుపార్టీ, అదే పోరాటంలో ఎప్పుడో ఒకప్పుడు పాలుపంచుకుని తర్వాత అదే తానునుంచి లెక్కకు మించిపోయిన చిల్లరశాఖలు కొన్నీ! ఇక కాంగ్రెస్ లో నాయకులు, వారి మంత్రులు, వారి శాసనకర్తలు ఎందరో పనికిమాలిన 'మహానుభావులు'! వీళ్ళూ రాష్ట్ర 'విభజన'అనే ముసుగును తగిలించుకుంటూనే "సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోనికి తీసుకోవాల''ని అధిష్ఠానానికి చెప్పినట్టు నటిస్తూనే, జగన్ పార్టీ రేపు ఎన్నికల్లో ప్రజాభిమానంతో దూసుకు రాకుండా అడ్డుకట్టలు వేయడం కోసమని "జగన్ కి బెయిల్ మంజూరు కావడంపైన ప్రజల మనస్సులుకొన్ని అనుమాలున్నాయం'టూ తీగలు తీస్తున్నారు! "ప్రజల'', "ప్రజాభిమానం'' అన్న మాటలు, ముసుగులూ రాజకీయపక్షాలకు ప్రత్యేక తొడుగులని మాత్రమేనని ఇంతకుముందు గ్రహించకపోయిన ప్రజలకు రాష్ట్ర విభజన ప్రతిపాదన వచ్చిన తరువాత తెలిసిపోయింది! అంటే, అంత పెద్దఎత్తున 60రోజులుగా రాష్ట్రవిభజన ప్రతిపాదనను తిరస్కరిస్తూ సాగుతున్న అంతటి రాజకీయేతర ఉద్యమాన్ని ఎలా నట్టేటముంచడం ద్వారా తమ పదవులను, హోదాలనో రక్షించుకునే దశలో ఈ 'గందోళీ' నాయకులు ఉన్నారు. మరొక వేర్పాటు వాదనాయకుడు సీమాంధ్రకు రూ.400-500 కోట్ల ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించిన మరుక్షణంలో "అయితే, అదే దామాశాలో ఇంతకాలం 'సమైక్యరాష్ట్రంలో' బాధలు పడిన ప్రాంతానికి కూడా అంతా, లేదా అంతకుమించిన ప్యాకేజీ రావాల్సి ఉంటుందని'' ప్రకటించడం ద్వారా కేంద్రంలో ఆ పార్టీని రద్దుచేసి, కాంగ్రెస్ లో కలిసిపోతానని మాటిచ్చివచ్చిన బొబ్బిలిదొర చేసిన ప్రకటన కొత్త అర్థాన్ని సంతరించుకుంది. అంటే, ఇంతకుముందెన్నడూ అతని నోటనుంచి రాని "ప్యాకేజీ'' భాషను ఆ పార్టీ క్యాడర్ బుర్రల్లోకి ఎక్కించి, తన పార్టీని క్రమంగా రాద్దుచేసుకొని, దశాదిశాలేకుండా ప్రారంభించిన స్వార్థపూరిత 'ఉద్యమాన్ని' నట్టేట ముంచడానికి సిద్ధమయ్యాడని స్పష్టమవుతోంది! వెనక కె.వి.రంగారెడ్డి, డా. చెన్నారెడ్డి వర్గాలు ఎలా యువత ప్రాణాలను వందలసంఖ్యలో తోడుకున్నారో, రేపూ ఈ 'బొబ్బిలిదొర'వల్ల జరగబోతున్నదీ అదే ప్రహాసనమని అర్థం చేసుకోవాలి! ఇక బిజెపి వైఖరి "నేను అధికారంలోకి వస్తే రాష్టాన్ని విభజిస్తానని చెప్పి'' ఏళ్ళూ వూళ్ళూ గడిచినా కేంద్రంలో దాని ప్రభుత్వం వెలగబెట్టినన్నాళ్ళూ అందుకు ధైర్యం చేయలేక,ఆ వాదనను ఆనాడు "చంద్రబాబే విభజన వద్దన్నాడని'' చెప్పి తప్పించుకొంటూ వచ్చింది; ఇక ఇప్పుడేం చేస్తోందంటే "రేపు విభజన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే, ఆ బిల్లులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించుకునిగాని ఏ నిర్ణయానికీ రాము'' అని ప్రచారం చేసుకొంటోంది' ఈలోగా ప్రదానమంత్రిత్వ పదవిపైన ఆశలు పెంచుకుంటున్న బిజెపి అభ్యర్థి, 2000 మంది మైనారిటీలను ఊచకోతకు వెరవని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ సభ అనంతరం చేసిన ప్రకటనలో "విభజన ప్రతిపాదనను కాంగ్రెస్ తొందరపడి చేసింద''ని విమర్శించడం ద్వారా ఆ పార్టీ నిర్ణయంలో స్పష్టత పూర్తిగా కొరవడింది! పైగా బిజెపితో పొత్తుకోసం మరోసారి తహతహలాడుతున్న చంద్రబాబుతో పొత్తు ప్రమాదకరమని, తొందరపడవద్దనీ, బిజెపిని నడిపించే దాని మతపరమైన బ్రాండ్ "ఆర్.ఎస్.ఎస్.'' రెండురోజులనాడు హెచ్చరించిందని మరవరాదు! అయినా, విభజనకు సానుకూలంగా లేఖలు ఇచ్చి, సంకెళ్ళు తొడుక్కున్న రాజేకీయ ప్రతిపక్షాలు - వై.ఎస్.ఆర్. (జగన్) పార్టీలాగా 'సమన్యాయ' సిద్ధాంతాన్నీ విడిచిపెడుతూ లేఖలను ఉపసంహరించుకుని, సమన్యాయానికి ఇంట్లోనే పోరాడాలన్నా, దాన్ని సాధించుకోవాలన్నా అందుకు మార్గం "సమైక్య ఆంధ్రప్రదేశ్'' ఉనికి మాత్రమేగాని, తెలుగువారు "విడిపోయి వికాసం సాధించుదా''మనే నెగెటివ్ నినాదం మాత్రం కాదు, కానేకాదు! ఈ పార్టీలకు తెలుగుజాతిని చీల్చే కుట్రను అడ్డుకోవడానికి ఒకే ఒక్క మార్గం - రాజ్యాంగం శాసిస్తున్నట్టు రాష్ట శాసనసభలో విభజనకు వ్యతిరేకంగానూ ఆంద్రప్రదేశ్ యథాతథంగా విభక రాష్ట్రంగానే ఉండాలని ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించడం అన్ని పార్టీల బాధ్యత! లేదా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ సహా అన్ని పక్షాలూ ప్రజలనుంచి దూరమైపోతాయి.
పైగా ఏ కోనేరు ప్రసాదుకు సంబంధం ఉన్నదన్న ఆరోపణపైన ఆ ఎమ్మార్ కేసు గృహనిర్మాణ సంస్థ విషయంలో కూడా జగన్ అనుచరుడెవరికో సంబంధం ఉన్నదని, అతణ్ణీ అందులోకి లాగారు! కోనేరుతో పాటు అతడూ అభియోగాల సందర్భంగా సిబీఐ విచారణలోకి వెళ్ళాడు! తీరా చూస్తే, ఎమ్మార్ తో తనకేమీ సంబంధంలేదని చెబుతూ వచ్చిన చంద్రబాబుకు ఎమ్మార్ తో పూర్తి సంబంధం ఉన్నట్టు నిందితుడు అయిన కోనేరు స్పష్టంగా ప్రకటించడంతో కేసు ఇంకో రూపం తీసుకుంది; అలాగే ఐ.ఎం.జి. తాలూకు కేసుకూడా రాష్ట్ర హైకోర్టు ముందు ఉంటూ, పూర్తి విచారణకు రాకపోతున్న పరిస్థితుల్లో అందుకు సంబంధించి జగన్ తల్లి విజయమ్మ కూడా సుప్రీమ్ కోర్టును ఆశ్రయించగా ముందు కింది కోర్టులో చట్టం ప్రకారం తేల్చుకుని అప్పుడు సుప్రీమ్ ను ఆశ్రయించమని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది! అయినా కింది కోర్టు ఆవరణ నుంచి అదీ కదలడం లేదు. ఇలా తనపైకి దూసుకు వచ్చిన కేసులనుంచి బయటపడాలంటే ఎలాంటి చిట్కా అవసరమో చంద్రబాబుకి తెలుసు! సరాసరి కేంద్రప్రభుత్వ 'పెద్దల'తో [అంటే, మానిప్యులేటర్స్] లాలూచీపడి, ఈ కేసులనుంచి తనకు విముక్తి కలిగించే పక్షంలో రాష్ట్ర విభజన సమస్యపై కేంద్ర ప్రతిపాదనకు తాను మద్దతుగా నిలుస్తానని హామీపడి వచ్చినట్టు ఆనాడే వార్తలు పొక్కాయి! సరిగ్గా అందుకు అనుగుణంగానే రాష్ట్రవిభజనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం స్థాయిలో చేసిన తీర్మానానికి చంద్రబాబు (తెలుగుదేశం)ఆమోదం తెలుపుతూ కొన్ని ఇతర పక్షాలతో పాటు లేఖ రాసిచ్చారు!
ప్రధాన ప్రతిపక్షంగా "దేశం'' అధినేత తలూపి, లేఖరాసి ఇచ్చివచ్చారు; కమ్యూనిస్టుసహా మిగతా కొన్ని పార్టీలూ అలాగే తలూపివచ్చాయి! సరిగ్గా ఈ క్రమంలోనే విభజన ప్రతిపాదనను ఆమోదించేదిలేదని మార్కిస్టు పార్టీ, "మిమ్'' (ఓవైసీ), వై.ఎస్.ఆర్.సి.పి.లు స్పష్టం చేశాయి. అయితే, నెలలు గడిచినకొద్దీ, విభజనపై రకరకాల ప్రకటనలను రోజుకో తీరుచొప్పున కాంగ్రెస్ విడుదల చేస్తూ 'విభజన' తప్పదేమోనన్న అనుమానాలను "టూమ్రీ''లుగా వదులుతూ తీవ్రస్థాయిలో అవకాశవాద పటిమను కాంగ్రెస్ అధిష్ఠానం, చాటుకొంటున్న దశలో, 'బొబ్బిలిదొర' ధనస్వామ్య బెదిరింపులతో, స్వార్థపూరిత అరాచక ప్రవర్తనతో సృష్టించిన అనిశ్చిత పరిస్థితుల్లో వై.ఎస్.ఆర్. పార్టీ మధ్యే మార్గంగా ఒక ప్రకటన చేసింది - "ఒకవేళ కాంగెస్ మొండిగా రాష్ట్ర విభజనను అనివార్యం చేసి, ముందడుగు వేస్తే'' కనీసం అన్ని ప్రాంతాల ప్రజలకూ "సమన్యాయం'' చేసి తీరాలని ప్రకటించింది! ఎప్పుడైతే కాంగ్రెస్ అవకాశవాదం ముదిరిపోయి విభజనకు అనుకూల 'సిగ్నల్స్' నిరంతరం వదులుతూ వచ్చిందో, దాని ప్రభావం వల్ల "సమైక్యరాష్ట్ర''వాదం నాయకులు లేకుండానే ఎ.పి.ఎన్.జి.వో.ల సమ్మె మహోధృతిలో ముందుగా సాగానారంభించిందో ఆ క్షణమే వై.ఎస్.ఆర్.సి.పి. "సమన్యాయ సూత్రా''న్ని కూడా తుంగలో తొక్కి పూర్తిగా సమైక్యరాష్ట్రమే అన్ని ప్రాంతాల అభివృద్ధికీ శరణ్యమని భావించి, స్పష్టమైన నిర్ణయం తీసుకుంది; ఈ నిర్ణయాన్ని వై.ఎస్.ఆర్. (జగన్) పార్టీ ప్రకటించే నాటికి జగన్ కు బెయిల్ ప్రసక్తే రంగంలోకి రాలేదు!
http://www.teluguone.com/news/content/abk-prasad-separate-telangan-issue-39-26253.html