రాజకీయ నాయకులకు, ఎన్జీవోల "సమైక్యాంధ్ర'' సభ గుణపాఠాలు!

Publish Date:Sep 10, 2013

Advertisement

 

 

 

- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

బొంకరా గురవా అంటే, ఇదే అదననుకున్న సన్నాసి ఒకడు "ఆ గురజాల దోమలు గురిగింజలంత ఉంటాయిరా'' అని కోసేశాడట! భాషాప్రయుక్త ప్రతిపాదికపైన ఒకేజాతి, ఒకేభాషా సంస్కృతుల కుదుళ్ళపైన ఏర్పడిన విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాన్ని నిట్టనిలువుగా చీల్చడం ద్వారానే పార్లమెంటులో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ల తర్వాత అధికసంఖ్యలో [42 స్థానాలు] సభ్యుల బలంతో నెహ్రూ కుటుంబ వారసుడుగా ఈ తరం ప్రతినిథి అయిన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం సాధ్యమని యు.పి.ఎ. అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలైన సోనియాగాంధీ తలపోయడంతో తెలుగు రాష్ట్రం విచ్చిత్తికి బీజాలు నాటింది. అందుకోసం "బోడితలకూ మోకాలికి ముడి''పెట్టి, కుదరని ఆ ప్రక్రియకు కారకులు ఆంధ్రప్రదేశ్ లోని అవకాశవాద రాజకీయ పార్టీల మీదికి తెలివిగా నెట్టి కూర్చుంది. ముందుగా రాష్ట్రవిభజన సమస్యపైన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీలాగా నీళ్ళు నమలకుండా కేంద్రంలో ఒక పాలకశక్తిగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గ నేత్రిగా స్పష్టాతి స్పష్టంగా విభజన అనర్థమని సోనియా చెప్పలేకపోయింది!

 

 

రేపు కొడుకు రాహుల్ ని [ఆ శక్తి ఉన్నా లేకపోయినా] దేశప్రధానిగా గద్దెనెక్కించే తొందరలో తాడూ బొంగరం లేని ఒక ప్రాంతపు స్థానిక పార్టీని స్థాపించుకున్న రాజకీయ నిరుద్యోగ నాయకుడి బెదిరింపులకు లొంగిపోయి కాంగ్రెస్ భవిష్యత్తుకే చేటుతెచ్చి తెలుగుజాతిని చీల్చడానికి వెనుదీయని కాంగ్రెస్ అధినేత్రి రాష్ట్రప్రజలను, రాష్ట్ర భవిష్యత్తును అయోమయ పరిస్థితుల్లోకి నెట్టింది; వలస సామ్రాజ్యపాలనా వ్యవస్థపై తిరగబడిన జాతీయ స్వాతంత్ర్య సమరంతో బొత్తిగా పరిచయంలేని, అవగాహనలేని సోనియాను పార్టీకి అధినేత్రిగా నెత్తికెక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలోని "డూడూ బసవన్నలు'' కేవలం కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రిపదవులను విడిచిపెట్టలేక, తెలుగుజాతిని చీల్చుతున్న అధినేత్రికి ఈ క్షణంలో కూడా కొమ్ముకాయడం తెలుగుజాతికే అవమానకరం.  ప్రపంచబ్యాంకి ప్రజావ్యతిరేక 'సంస్కరణల' చాటున దాగి దేశరాజకీయ, ఆర్థికవ్యవస్థా ప్రయోజనాలకే చేటుతెచ్చి, దేశాన్నే తాకట్టుపెట్టడానికి వెరవని కాంగ్రెస్ అధిష్ఠానం సుమారు 3000 సంవత్సరాల చరిత్ర గలిగిన తెలుగుజాతి సమైక్యతను కూడా పదవీప్రయోజనాల కోసం బలిపెట్టడానికి జంకదు!
 


తాజావార్తలను బట్టి [08-09-2013] చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రస్తుత ప్రధానమంత్రి ప్రజావ్యతిరేక సంస్కరణలకు పురోహితుడైన డాక్టర్ మన్ మోహన్ సింగ్ ను తప్పించి రాహుల్ ను ఆ స్థానంలో కూర్చోపెట్టే వైపుగా పావులు కదులుతున్నాయి. ఇందుకు సాక్ష్యం - ఒక్కటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చడానికి అనుకూలంగా కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీపరంగా తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కసారి కూడా వ్యతిరేకించలేని మన్మోహన్ సింగ్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే గాక, తన ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోగల స్థితిలో లేకపోవటం. అందుకు తగినట్టుగానే తన ఉత్తరాధికారిగా రాహుల్ ప్రధాని కావాలన్న ఆకాంక్షను దాచుకోలేకుండా బయటపెట్టడం - మధ్యయుగాల నాటి రాజరికపు సంస్కృతికే నిదర్శనం.
 



ఈ పూర్వరంగంలో, రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి కేవలం నాయకత్వస్థాయిలోనూ, అదికూడా మూడు, నాలుగు "జక్కాయి బుక్కాయి'' రాజకీయపక్షాల క్యాడర్ కు ప్రధానంగా పరిమితమై "వేర్పాటువాద'' ఉద్యమాన్ని సాగలాగుతున్న ఆ పక్షాల తాలూకు రాజకీయ నాయకుల వల్ల సాధ్యంకాని లక్షలాదిమంది ప్రజాసమీకరణ సమైక్యాంధ్ర ఉద్యమానికి ఏ పార్టీల తోడ్పాటు లేకుండా, విభజనవల్ల మూడు ప్రాంతాలలోని ప్రజలు ఎదుర్కొనబోతున్న సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ ఎన్.జి.వో.లు హైదరాబాద్ లో తలపెట్టిన "సమైక్యాంధ్ర'' మహాసభ (07-09-2013) ఘనంగా విజయవంతమయింది. సంకుచిత మనస్సుతో తెలుగుజాతి ప్రయోజనాలకు హానికల్గించే స్వార్థపూరిత లక్ష్యంతో కొందరు "ప్రత్యేకరాష్ట్ర'' వాదంతో నడుపుతున్న ఉద్యమకారులనుంచి వచ్చిన బెదిరింపులకు లోనుగాకుండా ఎ.పి.ఎన్.జి.వో.ల సమన్వయ సంఘం జరిపిన సదస్సు ఎంత ప్రశాంతంగా, ఎంతటి క్రమశిక్షణతో, ఎవరికీ ఇబ్బంది కల్గించని రీతిలో, ఉద్రేకాలకు లోనుగాకుండా, ప్రజల్ని కించించే తప్పుడు నినాదాలు లేకుండా ఆంధ్ర (తెలుగు)జాతి విడిపోరాదని, విడిపోతే చెడిపోతామన్న స్ఫూర్తితో రాష్ట్రరాజధాని నడిబొడ్డులో అత్యంత జయప్రదంగా ముగిసినసభ - కేంద్ర, రాష్ట్ర రాజకీయ నాయకులందరికీ పెద్ద కనువిప్పు కావాలి; గుణపాఠం కావాలి. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా తెలుగుజాతి భవిష్యత్తుకోసం జాతి వికాసం కోసం, కేవలం జాతి మౌలిక ప్రయోజనాల రక్షణ కోసం ఉద్యోగులు బహుళసంఖ్యలో తలపెట్టిన మొట్టమొదటి సభ యిది. తెలంగాణాలో ఇంకా సజీవులుగా ఉన్న ఒకనాటి తెలంగాణా సాయుధ పోరాటయోధులు సహితం స్వాతంత్ర్యోద్యమ కాలంలో మాత్రమే యిలా ఐచ్చికంగా వివిధ వర్గాల ప్రజలు ఎవరికి వారుగా చొరవతో ఇనుమడించిన దేశభక్తితో యిలా పాల్గొన్నారని వ్యాఖ్యానించడం జరిగింది. తెలుగుజాతిని చీల్చడం కోసం రాజకీయ స్వార్థంతో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్, దాని సంకీర్ణ ప్రభుత్వమూ ఉపసంహరించుకునే దాకా - ఎన్నిమాసాలు పట్టినా సరే, జాతికోసం "సమైక్యాంద్ర'' ఉద్యమం విశ్రమించబోదని ఇది జీతాలకోసం కాదు, జాతి జీవితాలకోసం జరుగుతున్న పోరాటమనీ ఉద్యోగులు, సభావారూ ప్రతినబూనటం యావత్తు తెలుగుజాతిలోనూ విశ్వాస సూర్యోదయాలు నింపింది!


 

ప్రజలతో నిమిత్తం లేకుండా, వివిధ ప్రాంతాల్లోని యావత్తు తెలుగుజాతి అభిప్రాయాలు తెలుసుకోడానికి జనవాక్య సేకరణ జరపకుండానే, ఏ పార్టీకి ఆపార్టీ తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పోటాపోటీలమీద తెలుగుజాతిని విభజించే 'నెగెటివ్' ప్రక్రియలో పడిపోయి, ముందుగా ఎలాంటి సొంత ప్రతిపాదన ప్రాతిపదికగా తానుగా కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని ప్రకటించని దశలో  జాతి విధ్వంసకులుగానూ, ప్రజాబాహుళ్యానికి విశ్వసనీయ నాయకత్వం అందించలేని వాజమ్మలుగానూ ప్రధాన ప్రతిపక్షాలు అవతరించడం ఘోరం! మంచి పాలనా శాస్త్రానికి సంబంధించిన "పొలిటికల్ సైన్స్'' పదవికే ఈ ప్రతిపక్షాలు చెడు అర్థాలు, నెగెటివ్ నినాదాలూ, 'నిఘంటువు'ల కెక్కించడానికి తాపత్రయపడ్డాయి!



 

'సమైక్యాంధ్ర' రక్షణనే సభలో ప్రసంగించిన ఉద్యోగానాయకులు పదేపదే కోరుకున్నారుగాని సోదర తెలంగాణా తెలుగుబిడ్డల ప్రయోజనాలు పట్టని కొందరు రాజకీయ నిరుద్యోగుల మాదిరిగా తెలుగువారు తెలుగుప్రాంతంలో తిరగడానికి 'వీసాలు'' పొందాలని కోరలేదు; 'తెలుగువాళ్ళు విడిపోతే చెడిపోతాం'' అన్నారేగాని కొందరిలా "కాళ్ళు విరగ్గొడతాం'' అనలేదు. "అందరం కలిసుందాం, కలిసి ఎదుగుదాం'' అన్నారేగాని "విడిపోతేనే వికాసం'' అనలేదు' ఉభయత్రా ఎదురయ్యే సమస్యలను "చర్చలద్వారా కలిసి పరిష్కరించుకుందాం'' అన్నారేగాని "నోరెత్తితే నాలుకలు కోసేస్తాం'' అనలేదు; రాజధాని హైదరాబాద్ ను "మూడుప్రాంతాల ప్రజల కష్టార్జితమ''న్నారేగాని ఉమ్మడి శ్రమఫలితంగా నిర్మించుకున్న "తెలుగువారి రాజధాని నుంచి తెలుగువారే వెళ్ళిపోవాల''ని ఉద్యోగ వక్తలు కోరుకోలేదు;


 

వీటన్నింటికిమించి, సమైక్యాంధ్ర మహాసభకు సీమాంధ్రనుంచి, హైదరాబాద్ చుట్టుపట్లనుంచి సమైక్యతాంధ్రను చెదరగొట్టరాదనీ భావించి బారీగా బస్సులలో, ఇతరవాహనాలలో తరలివస్తున్నప్పుడూ, సభను శాంతంగా, జయప్రదంగా ముగించుకుని తిరిగి తమతమ ప్రాంతాలకు వెడుతున్నప్పుడూ, పలుచోట్ల "ముసుగువీరులు'' కొందరిని ప్రేరేపించి ధైర్యంచాలక ఉద్యోగుల వాహనాలపైన రాళ్ళూరప్పలూ వేయించి గాయపరిచినా, సదస్యులు ఎదురుదాడి చేసి 'సీన్లు' సృష్టించలేదు; నిజాంకళాశాలలోని కొందరు విద్యార్థుల్ని సభకు వస్తున్న వారిపై రాళ్ళు రువ్వెందుకు కొందరు రాజకీయ నిరుద్యోగులు అజ్ఞాతంగా ప్రోద్భలపరిచినా, సభకు వచ్చిన ప్రతినిధులు గణనీయమైన సంఖ్యలో ఉన్నా సంయమనం పాటించారన్న ఇటీవల వెలసిన ఒకే ఒక స్థానిక పత్రికతప్ప ఆంగ్లపత్రికలు సహా మిగతా పత్రికలన్నీ పేర్కొన్నాయి! అన్నింటికన్నా విచిత్రమూ, సిగ్గుచేటైన విషయమూ - సభకు వస్తున్న సీమాంధ్ర ప్రతినిధులపైన రాళ్ళు విసురుతూ నిజాంకళాశాల భవనం మీదనుంచి ఒక విద్యార్థి జారిపడిపోయి క్షతగాత్రుడుకాగా, ఆ విద్యార్థిని భవనం మీదనుంచి పోలీసులు కిందకి తోసేశారని ఒక్క స్థానిక పత్రిక తప్ప మరే పత్రిక రాయకపోవటం. మిగతా పత్రికలన్నీ "రాళ్ళు విసిరే హడావుడిలో అతడే జరిపడ్డాడని రాశాయి!

 

అన్ని పత్రికలూ ఎ.పి.ఎన్.జీ.వో.ల "సమైక్యాంధ్ర మహాసభ'' ఘనంగా విజయవంతమైందని పతాకశీర్శికలు వార్త ప్రచురించగా సభనే ఒక "దండయాత్ర''గానూ, "సీమాంధ్రుల దాడిలో గాయపడిన తెలంగాణా'' అని తెలుగుప్రజల మధ్య రాజకీయ నిరుద్యోగులు మరింత విద్వేషాన్ని రగుల్కొల్పారు. మరో విచిత్రమైన అబద్ధం - సమైక్యతను కోరేవారి "గొంతుకలు కోస్తానని'' చాకు చూపించే ఒక వ్యక్తిది మార్ఫింగ్ చేసి ఒక స్థానిక ఛానెల్ చూపడం! ఈ విద్వేష ప్రచారం చాటున ఆ "గుప్పెడు'' రాజకీయ నిరుద్యోగులయిన దొరలు, భూస్వాములయిన పాత జాగిర్దారీ, దేశ్ ముఖ్, పటేల్, పట్వారీల సంతతీ మళ్ళీ తెలంగాణా ప్రజలపైన స్వారీ చేయడానికి, బడుగు బలహీనవర్గాల  బొమికలలో మిగిలిన 'మూల్గుల''ను కూడా పీల్చుకు తినడానికీ అధికారం చేజిక్కించుకోడానికే బలవంతంగా తెలుగుజాతిని చీల్చడానికి ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని తెలుగువారంతా గమనించాలి. ఈ సందర్భంగా, ఇంతకుముందు రాష్ట్రవిభజన విషయంలో కొంత 'పిడివాదం'లోకి జారుకున్నట్టు కన్పించిన మావోయిస్టు సోదరుల ధోరణిలో కూడా తాజాగా కొంత మార్పు కన్పిస్తోంది. "కోస్తాంధ్ర, రాయలసీమ మేధావులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ భారతకమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఒక ప్రకటనను [ 06-09-2013] పత్రికలకు విడుదల చేసింది. రాష్ట్రవిభజన ప్రతిపాదనపైన స్పష్టంగా, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా అభిప్రాయాన్ని వెల్లడించకపోయినా భారతమావోయిస్టు పార్టీ కేంద్రీయ, ప్రాంతీయ మండలి తెలుగు "ప్రజలమధ్య ఐక్యత చాలా అవసరమ''ని చాటి చెబుతోంది! ఆ ప్రకటనలో యింకా యిలా ఉంది : "తెలంగాణా రాష్ట్ర ఏర్పాటువల్ల తలెత్తే స్సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించుకోడానికి ప్రజాసంఘాలు, ఉద్యమసంస్థలు ఒక ప్రజాస్వామిక వాతావరణంలో కలిసి చర్చించుకుని ముందుకుపోవాలి. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టి పాలకవర్గాలు చోద్యం చూస్తున్నాయి. ఆ వలలో (ట్రాప్)పడకుండా సమస్యలను సామరస్యంగా, న్యాయంగా పరిష్కారం చేసుకోవాలి. ప్రజల ప్రజాస్వామిక డిమాండ్ల పట్ల మూడుప్రాంతాల ప్రజలూ చైతన్యయుతంగా మెలగాలి''!



 

అంతేగాదు, ఈ మేరకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణా మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, యువజన తదితర "సమస్త ప్రజానీకానికి'' మావోయిస్టుపార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో కార్యదర్శి హోదాలో 'ఆనంద్' పేరిట విడుదలయిన ఈ ప్రకటనలో మూడు ప్రాంతాల ప్రజలమధ్య "ఐక్యత, సంయమనం చాలా అవసరమ''ని మావోయిస్టు పార్టీ ఎందుకు భావిస్తోందో కూడా యిలా పేర్కొంది :
"తెలంగాణా ఏర్పాటు విషయంలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల దళారీ (కాంప్రచార్), నిరంకుశాధికార బడాపెట్టుబడిదారీ,భూస్వామ్యవర్గాలు సామ్రాజ్యవాదంతో కుమ్ముక్కయి దోచుకోవడానికి ప్రయత్నిస్తూ తీవ్రంగా అణచివేస్తున్న ఈ తరుణంలో ప్రజలమధ్య ఐక్యత చాలా అవసరం''!

 

సహృదయంతో మావోయిస్టు పార్టీ చేసిన ఈ ప్రకటనలో - ఈ మాత్రపు అవసరాన్ని కూడా ముందుగా గుర్తించకుండా కొందరు రాజకీయ నిరుద్యోగులు తలపెట్టిన స్వార్థపూరిత వేర్పాటు ఉద్యమాన్ని పరోక్షంగా కూడా ఎందుకు ఆ పార్టీ ఎందుకని ఖండించలేకపోయింది? పత్రికావార్తలను బట్టి చూస్తే ఆ పార్టీ పరోక్షంగా కూడా రాజకీయ నిరుద్యోగులు కొందరు బూతులతో, అబద్ధపుప్రచారాలతో, ఇరుప్రాంతాల ప్రజలమధ్య పూడ్చుకోలేనంత విద్వేషా, విషపూరితంగా ఎక్కిస్తున్న దశలో మావోయిస్టుపార్టీ ఈ ఐక్యతా సందేశాన్ని యిచ్చి ఉంటే ప్రజల్ని బాగా ప్రభావితం చేసి ఉండేది! ఒక బడా వేర్పాటు వలసవాద 'దొర' ప్రారంభించిన స్వార్థపూరిత, కేవలం నాయక ప్రయోజన కేంద్రంగా అల్లిన కృత్రిమ ఉద్యమం ఆ నాయకుడుగాని, "మల్టీనేషనల్ కంపెనీ'' స్థాయిలో పెరిగిన అతడి కుటుంబం నుంచి ఎలాంటి త్యాగమూ చేయకుండా బడుగు, బలహీనవర్గాలకు చెందిన తెలుగుబిడ్డల్ని భ్రమలతో ఆత్మహత్యలవైపు నెట్టేశారు!


 

ఈ పరిణామదశలోనే కొన్నాళ్ళక్రితం నేను "సమాచార హక్కు చట్టం'' కింద ఆత్మహత్యల పాలైన బిడ్డల, కుటుంబాలకు చెందిన వివరాలను తెలుగువారి తెలంగాణాలోని పదిజిల్లాల నుంచి తెప్పించుకున్నాను. జిల్లాల పోలీసు ఉన్నతాధికారులనుంచి ఈ నివేదికలు అందాయి. నేనూ, తెలంగాణా మిత్రులు కొందరం వాటిని పరిశీలించడం జరిగింది. మొత్తం నివేదికల్ని పరిశీలించగా తేలిన సత్యం ఏమిటి? ఈ ఆత్మహత్యల్లో నూటికి 90 మందికిపైగా ఎస్.సి., ఎస్.టి., బి.సి. బలహీనవర్గాలకు చెందిన ముద్దుబిడ్డలవేనని రుజువైంది! అన్ని వేళలా, అన్నిత్యాగాలూ వృధా అయినవిగా భావించకూడదు. కాని కొందరు స్వార్థపూరిత లక్ష్యంతో ప్రారంభించే ఉద్యమంలో తప్ప ప్రాంతాల నిజమైన పురోగతి కోసం, సామ్యాజ్యవాద వ్యతిరేక పోరాటంలోకి, విమోచన పోరాటాలలోకి, పెట్టుబడిదారీ, భూస్వామ్యవర్గాల దోపిడీకి నిరసనగా జరిగే ఉద్యమాలలోకి దూకే వీరకిశోరాల త్యాగాలు మాత్రమే బేషరతు త్యాగాలవుతాయి, విలువైన త్యాగాలవుతాయి, కనుకనే అలాంటి త్యాగాల కోసం "అడ్వాన్స్ గ్యారంటీల''తో ఎవరూ ప్రవేశించరు! అలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించరు. కాని తెలుగుజాతిని చీల్చడం కోసం కొందరు రాజకీయ నిరుద్యోగులు జరుపుతూవచ్చిన విభజనోద్యమానికి నాయకుల పదవీస్వార్థం మినహా మరొక లక్ష్యం లేదు. కనుకనే నిజమైన ప్రజాతంత్ర ఉద్యమానికి చుక్కాని పట్టగలిగిన శక్తులు వేరు. అలాటివాళ్ళను వేరుచేసి ముందుగా "శిలువ వేసో, షూట్ చేసో, విషమిచ్చో ధనికవర్గ శక్తులు చంపేస్తాయి. ఈ విషయాలు తెలిసిన మావోయిస్టు పార్టీ ఆలస్యంగానైనా తాజాగా విభజనోద్యమం వెనక ఏ శక్తులు పనిచేస్తున్నాయో, సమైక్యాంధ్ర విశాలాంధ్రగా రూపొంది, పెట్టుబడిదారీ చట్రం అనుమతించిన పరిధుల్లోనే పరిమితుల్లోనే, అంతకుముందు రెండు రకాల పరాయిపాలనలలో (బ్రిటిష్, నిజాముల హయాముల్లో) ఎన్నడూ నోచుకోనంత అభివృద్ధిని సాపేక్షంగా మాత్రమే నమోదు చేస్తున్న సమయంలో ఆ పార్టీ కేంద్రీకరణ, ఈ పరిమిత ప్రగతిని పునాది చేసుకుంటూనే మరిన్ని "జాంబవంతుడి అంగల''తో సమున్నత స్థాయిలో అభివృద్ధిని సాధించగల సామాజిక సమూల పరివర్తనా శకాన్ని ఆవిష్కరించే దిశగా శక్తియుక్తుల్ని వొడ్డవలసి ఉంటుంది!

 

పెట్టుబడిదారీ, అర్థ భూస్వామ్య సమాజవ్యవస్థలో రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలోని ప్రాంతాల మధ్య, ప్రాంతాలలోని వివిధ జిల్లాల మధ్య అనివార్యమయ్యే అంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, దోపిడీవ్యవస్థకు కాపలాదార్లుగా మాత్రమే 'రాణించ'గల రాజకీయ నిరుద్యోగ నాయకులు స్వార్థప్రయోజనాలతో అధికార లాలసతో తలపెట్టే ఉద్యమాలను నిర్ద్వింద్వంగా సకాలంలో ఖండించి, బలంగా నిరసించాల్సిన బాధ్యత పురోగామి శక్తులయిన మిలిటెంట్ శక్తులదే కావాలి. ఇందుకు చిన్న ఉదాహరణ టాంక్ బండ్ పై నెలకొన్న మూడుప్రాంతాలవారి తెలుగు తేజోమూర్తులయిన సంస్కృతీపరుల విగ్రహాలను విధ్వంసం చేసిన తరువాత అందులో పాల్గొన్నవారిని ఆ విధ్వంసకాండకు బాధ్యత వహించిన కొన్ని పార్టీలు ఎవరికివారు ఎదుటివారి మీదకు నెట్టేశారు. అలా నెట్టిన వారిలో "మార్కిస్టు-లెనినిస్టు'' ముద్రలతో చెలామణీ అవుతున్న "సెక్షన్లు'' కూడా ఉన్నాయని గమనించాలి! ఇప్పుడు కూడా "సమైక్యాంధ్ర మహాసభ'' ద్వారా క్రమశిక్షణతో, వేలెత్తి చూపడానికి వీలులేని సంయమనంతో సర్వత్రా శాంతియుతంగా వ్యవహరించిన ఎ.పి.ఎన్.జీ.వో.లను "సీమగూండాలుగా, రౌడీలు''గా ముద్రవేయడానికి కొందరు వేర్పాటువాదులు ప్రయత్నించడాన్ని యిప్పటికైనా మావోయిస్టుమిత్రులు పరిగణనలోకి తీసుకోవాలి!

 

"ఎదురుబొంకు'' సామెతను గుర్తుంచుకోవాలి! అటు సీమాంధ్రను, ఇటు దక్కన్ లోని హైదరాబాద్ సంస్థానాన్ని 300-400 సంవత్సరాలపాటు వలసలుగా మార్చుకుని ఏలిన బ్రిటిష్ సామ్యాజ్యవాదులు, నిజాంపాలకులూ పరస్పరం దొంగచాటు ఒప్పందాల ద్వారా అటు కోస్తాంధ్రను, ఇటు తెలంగాణాను, అటు రాయలసీమనూ ప్రజల సంపదనూ దోచుకుని పొందిన అపారమైన ధనరాశులతో ఇరుపక్షాల రాజ్యాలు కాపాడుకున్నారని మరవరాదు; ఈ పాలకుల మధ్య ఈనాటి మాదిరిగానే ఆనాడూ బ్రిటిష్ వాళ్ళకు ఉత్తరాంధ్రను, మధ్యాంధ్రను, రాయలసీమనూ నిజాం నవాబులు అమ్మి భారీగా సొమ్ము చేసుకున్న సంపదతోనూ, తెలంగాణా ప్రజలను దోచుకున్న సంపదతోనూ హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. అందుకే హైదరాబాద్ యావత్తు తెలుగుజాతికేగాక, అనేక బాధలకు గురైన సామాన్య ముస్లిం ప్రజాబాహుళ్యానికి కూడా రాజధానిగా రూపుదిద్దుకుంది. ఈ వాస్తవాన్ని కూడా మావోయిస్టులు గుర్తించి, వ్యూహాన్ని తెలుగుజాతి సమైక్యతా పరిరక్షణ కోసం ముందడుగు వేయక తప్పదు! ఒక్కసారి తెలంగాణా సాయుధపోరాట యోధుడైన దేవులపల్లి వెంకటేశ్వర్రావు అన్న మాటల్ని మావోయిస్టులు గుర్తుచేసుకోవడం మంచిదికాదా? దేవులపల్లి మాటల్లో "ఒకే భాషా సంస్కృతులకు పునాదిగా ఏర్పరచుకున్న రాష్ట్రంలో యావత్తు తెలుగుజాతికి మాత్రమే స్వయంనిర్ణయహక్కు ఉంటుందిగాని, జాతిలో ఒక భాగానికి ఉండదుగాక, ఉండదు!

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.