'బొగ్గు'తో పూర్తిగా 'నల్లకప్పేసి' పోయిన కాంగ్రెస్ యుపిఎ సర్కారు!
Publish Date:Apr 29, 2013
Advertisement
- డా. ఎబికె ప్రసాద్ భారత రాజకీయాలలో చిత్రమైన పరిణామాలొస్తున్నాయి. మన ఇరుగు పోరుగైన పాకిస్తాన్ సైనిక నియంతృత్వానికి క్రమంగా దూరమవుతూ ప్రజాస్వామ్యం మార్గంలో కాళ్ళూనుకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మన (భారత)దేశ రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకపక్షాలు 'ప్రజాస్వామ్యం' పేరు చాటున దాగి ప్రజాస్వామిక పద్ధతులనుంచి పక్కదారులు తొక్కుతూ నియంతృత్వ పోకడలకు పట్టం కట్టె వైపుగా బలంగా అడుగులు వేస్తున్నారు. పాకిస్తాన్ లో ఇంతకుముందు సైనిక పాలనా నియంతలలో ఒకరైన ముషారఫ్ తన హయాములో పాకిస్తాన్ న్యాయవ్యవస్థను సహితం శాసించే దశకు చేరుకున్నప్పుడు పాకిస్తాన్లోని ప్రజాస్వామ్య శక్తులు, కొన్ని రాజకీయపక్షాల దన్నుతో బలపడుతున్న పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చౌధురిని పదవినుంచి బర్తరఫ్ చేయడానికి సాహసించాడు. దాని పర్యవసానంగా పాకిస్తాన్ లోని ప్రజాస్వామ్య న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు మూకుమ్మడిగా విజృంభించి ముషారఫ్ చర్యను ఖండించడమేగాక భారీ స్థాయిలో కోర్టువద్ద, దేశంలోనూ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయవలసి వచ్చింది.
(సీనియర్ సంపాదకులు)
ఈ చర్య పాకిస్తాన్ లోని ప్రజాస్వామ్య శక్తులకు అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో బలసంపన్నులను చేసింది. పాకిస్తాన్ పౌరసమాజం పౌర ప్రభుత్వం ఏర్పాటు కోసం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని జుల్ ఫికార్ భుట్టో ప్రదానమంత్రిత్వంతో ప్రారంభమైన (ఎన్నికల ద్వారా) పౌరప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా, భుట్టోను హత్య చేయడం ద్వారా, సైనిక నియంతృత్వ శక్తులు తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నించాయి. కాని భుట్టో హత్య అనంతరం ఆయని కుమార్తె, రాజకీయ నాయకురాలైన బెనాజిర్ భుట్టోను పాక్ ప్రజలు ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ పరిణామం జనరల్ ముషారఫ్ కు కంటగింపుగా మారి,ఆమె హత్యకు పన్నుగడ పన్నాడు.
ఆమె హత్యానంతరం అధికారానికి వచ్చినవాడు ముషారఫ్ కాని పాక్ ప్రజలు క్రమంగా ప్రజాస్వామ్య వ్యవస్థా స్థాపన కోసం అనేక త్యాతాల ద్వారా ఈ రోజుకీ అకుంఠితంగా పోరాడుతూనే ఉన్నారు. గత పదేళ్ళలోపే పాకిస్తాన్ ప్రజలు ఉగ్రవాదుల బెడద మధ్యనే తిరిగి పౌర ప్రభుత్వాలను ఎన్నికల ద్వారా ఎన్నుకోవడంద్వారా పౌర ప్రజాస్వామ్య ప్రబ్బుత్వాల సుస్థిరత కోసం పునాదులు వేసుకుంటున్నారు.
అయినా, విదేశాలలో గత అయిదేళ్ళకు పైగా తలదాచుకుంటున్న ముషారఫ్ తిరిగి పాక్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయాలని చూశాడు. ఆ ప్రయత్నాన్ని పాక్ రాజకీయ పక్షాలు, సుప్రీంకోర్టు, ఎన్నికల కమీషన్ కూడా తుత్తునీయలు చేశారు. మూడు, నాలుగు చోట్ల ముషారఫ్ వేసిన నామినేషన్ పత్రాలను స్థానిక ఎన్నికల సంఘాల రిటర్నింగ్ ఆఫీసర్లు తిరస్కరించడంతో అతగాడు డీలా పడిపోయాడు. ప్రజాస్వామిక శక్తుల అండతో తిరిగి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చౌధురి నాయకత్వంలో యిప్పటికి పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం కొంతవరకు నిలదొక్కుకుంది.
ఇలాంటి పరిస్థితులలో మన దేశంలోని కాంగ్రెస్ - యు.పి.ఎ. పాలకవ్యవస్థ మాత్రం "ప్రజాస్వామ్యం'' పేరిటనే అనేక ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలకు పాల్పడడమే గాకుండా ప్రపంచబ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణలను తలకెత్తుకుని, బహుళ జాతి గుత్తసంస్థల పెట్టుబడులకు దేశపు ఆర్థికవ్యవస్థను భారత పారిశ్రామిక, వ్యవసాయ విధానాలకు విరుద్ధంగా బాహాటంగా తలుపులు తాను కూడా భారీ స్థాయిలో అవినీతికి పాల్పడింది. ఇలా దేశ సహజవనరులలో కీలకమైన రేడియో తరంగ వ్యవస్థపై ఆధిపత్యాన్ని విదేశీ గుత్త కంపెనీలకు "2-జి స్పెక్ట్రమ్'' పేరిట గుత్తగా కట్టపెట్టడానికి చేసిన ప్రయత్నంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థికమంత్రి చిదంబరం, ప్రధానమంత్రి కార్యాలయం, చివరికి జాతీయస్థాయి నేర విచారణ సంస్థ అయిన సిబీఐ ఉన్నతాధికారులు కొందరు (ఎ.కె.సింగ్) పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ దొరికిపోయారు.
ఈ "స్పెక్ట్రమ్'' తాలూకూ "అయినవాళ్ళకు కంచాలలో'' పెట్టి లైసెన్సులను విచ్చలవిడిగా యు.పి.ఎ. సర్కారు పంచడాన్ని సుప్రీంకోర్టు విమర్శించి, 122 లైసెన్సులను చుప్తాగా రద్దుచేసింది. ఇది పాలకశక్తులకు "గొంతులో పచ్చి వెలక్కాయ''గా మారింది. ఈలోగా ఈ "స్పెక్ట్రమ్'' కుంభకోణం ఆనాటి టెలికామ్ మంత్రి రాజా చర్యల ఫలితమేనని ప్రకటించి, అతణ్ణి మాత్రమే నేరస్థుడిగా చిత్రించి, అరెస్టు చేసి, ఆ దరిమిలా కేంద్రంలో డి.ఎం.కె. అండకోసం అతనికి బెయిల్ మంజూరు చేసిందీ ప్రభుత్వమే! తీరా ఇప్పుడు అదే రాజా ఈ కుంభకోణానికి ప్రధానబాధ్యులు మన్మోహన్ సింగ్, చిదంబరం అనీ, ప్రధానమంత్రితో చర్చించిన తరువాతనే, అతని అనుమతి మీదనే, అతని కోరిక మేరకే తాను లైసెన్సులు మంజూరు చేయడం జరిగిందనీ రాజా విస్పష్టమైన ప్రకటనతో ముందుకొచ్చాడు.
అయినా సరే ప్రధానమంత్రికి, చిదంబరానికీ ఎలాంటి సంబంధంలేనట్టు ఇతర సంబంధిత మంత్రులు ప్రభుత్వంలో దాగిన అవినీతిపరులను పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, రాజకీయపక్షాల ప్రతినిధులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ సంఘానికి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న పి.సి.చాకో (కాంగ్రెస్) బుకాయింపులకు దిగాడు. ఈలోగా బొగ్గుగనుల కేటాయింపుల విషయంలో బి.జె.పి. హయామునుంచి నేటిదాకా కొనసాగుతున్న లైసెన్సుల కుంభకోణంతో కూడా మన్మోహన్ సింగ్ కు "సంబంధం ఉంద''ని ఆరోపణలు వెల్లువెత్తాయి. "ముగ్గురి మధ్య ముంత దాగింద''న్న సామెతలాగా ఇలాంటి కుంభకోణాల మధ్యనే నియంతృత్వశక్తులు కూడా బలుస్తూంటాయి.
చివరికి, తాజాగా ప్రయివేట్ పార్టీలకు బొగ్గుగనుల కేటాయింపులలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపిన ప్రభుత్వ సంస్థ సిబీఐ సహితం రూపొందించిన నివేదికలోని అంశాలను కూడా పాలకపక్షం తారుమారు చేసి తన ప్రభుత్వాన్ని ఎలాగోలా రక్షించుకొనే ప్రయత్నంలో సిబీఐ అధికారులను అటకాయించడానికి ప్రయత్నించింది. దీని పర్యవసానంగా ప్రతిపక్షాల నిరంతర డిమాండ్ల మధ్యన ప్రభుత్వం తప్పించుకోలేని పరిస్టితులలో సుప్రీంకోర్టు జోక్యం ద్వారా సిబీఐ వాస్తవాలతో కోర్టు ముందుకు రాక తప్పలేదు. తన వాంగ్మూలాన్ని సమర్పించింది. కోర్టుకు సమర్పించడానికి ముందే న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ కు నివేదికను చూపించిన మాట నిజమేనని సిబీఐ ఒప్పేసుకుంది.
అశ్వినీ కుమార్ కే గాక, ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులకూ, బొగ్గుగనులశాఖా అధికారులకూ కూడా చూపించామని సిబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా వెల్లడించడంతో పాలకపక్షం గుట్టు కాస్తా రట్టు అయింది. అయితే "మొండివాడు రాజుకంటే ఘనుడు'' అన్నట్టుగా ప్రధాని మన్మోహన్ సింగ్ నిరంకుశుడిగా మొదటిసారిగా తన నిజరూపాన్ని బయటపెట్టుకున్నారు. న్యాయశాఖమంత్రి అశ్వినీ కుమార్ రాజీనామా చేయవలసిన అవసరమే లేదని ప్రతిపక్షాల డిమాండ్ ను తోసిపుచ్చారు. అదేమంటే, యు.పి.ఎ. తొమ్మిదేళ్ళ పాలనలో ప్రతిపక్షాలు ఇలా వ్యవహరించడం వాటికి మామూలేన''ని వాదించసాగారు! చివరికి అవసరమైతే మిగిలిన పార్లమెంటు బడ్జెటరీ సమావేశం కాస్తా చుప్తాగా రద్దయ్యే పరిస్థితి వచ్చినా మన్మోహన్ సింగ్ తన వైఖరిని మార్చుకోడాని వార్తలొచ్చాయి!
లార్డ్ యాక్డన్ సూక్తి ప్రకారం "కొంత అవినీతికి అలవాటుపడిన వాళ్ళు పూర్తిస్థాయిలో అవినీతికి పాల్పడడానికి జంకరు''! అలాగే రోచీ అనే ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త దృష్టిలో "ఆహికారంలో ఉన్నప్పుడు అవినీతికి అలవాటుపడ్డ వారు అధికారాన్ని కోల్పోనున్నామని భావించినప్పుడు కూడా భారీ అవినీతికి దిగుతార''ట! నిరంకుశ వ్యవస్థకు బీజాలు పడేది యిలాగనేనని మరవరాదు. చివరికి 2-జి స్పెక్ట్రమ్ కుంభకోణం సందర్భంగా ప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహరించిన సుప్రీంకోర్టు చేతుల్ని కూడా మెలితిప్పాలని ఈ మధ్యలో పాలకశక్తులు ప్రయత్నించడాన్ని మనం మరచిపోలేదు. ఈ ప్రయత్నంలో భాగంగానే ప్రధానమంత్రి ఒకసారి "రాజ్యాంగం పాలకవర్గానికి, న్యాయవ్యవస్థకు మధ్య బాధ్యతలను విభజించి ఉన్నందున ఒకరి విభాగంలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిద''ని హెచ్చరించిన విషయాన్ని మరవరాదు! ఇలాంటి ఘట్టాలలోనే "ముచ్చు''కూ, "నాలిముచ్చు'' కూ ఉన్న తేడా గురించి పెద్దలు ప్రస్తావిస్తుంటారు!
http://www.teluguone.com/news/content/abk-prasad-39-22775.html