హైదరాబాద్ పేలుళ్ళు: మతరాజకీయాల పై ధర్మాగ్రహం!

Publish Date:Feb 26, 2013

Advertisement

దిల్ షుక్ నగర్ దుర్ఘటనలు : మతరాజకీయాలపై గౌరవ న్యాయమూర్తుల ధర్మాగ్రహం!

- ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 


"మానవజాతి ప్రగతిపథం వైపు సాగించిన ప్రతి ఒక్క అడుగూ మానవ రక్తతర్పణతోనే సాగింది. ఇంతగా నరరక్తం ప్రవాహం కట్టడానికి అన్ని మతాల ధర్మాచార్యులూ సమానంగా బాధ్యులే! ఏ ఒక్క మతమూ, ఏ ఒక్క మతాచార్యుడూ గర్వించవలసింది ఏమీలేదు''!
                                                                           - 
మహా పండిత రాహుల్ సాంకృత్వాయన్

 


[ముప్పై భాషలలో పండితుడైన త్రిపీఠికాచార్య "దర్శన్-దిగ్దర్శన్'' "ప్రాక్పశ్చిమ దర్శనాలు'' గ్రంథంలో విశ్వోత్పత్తినుంచి మానవ పరిణామక్రమ విశ్వదర్శనం]

 



ఎన్నైనా చెప్పండి, దొంగబుద్ధి దొంగబుద్ధే! దొంగతనానికి అలవాటుపడినవాడు తను చిక్కుబడబోయే సమయానికి వాడే ఎదురుబొంకుగా "దొంగ, దొంగ! పట్టుకోండి, పట్టుకోండి'' అంటూ అరుస్తాడు! అందుకే "రొయ్యల బుద్ధి'' సామెత కూడా పుట్టుకొచ్చి వుంటుంది. అందరూ చూడ్డానికి శ్రీవైష్ణవులేనట, పాపం ఆవగింజంత 'హింస' ఎరగనివాళ్ళు, జీడిగింజంత మాంసంముక్క ఎరగనివాళ్ళు, కాని రొయ్యల బుట్టమాత్రం ఖాళీ అయిపోయిందట! నేడు మన దేశంలోని ఇరువర్గాలకు చెందిన మతఛాందసులు [శాంతిచిహ్నాలయిన అది ఇస్లామ్ కు, లౌకికవాదంపై ఆధారపడిన ఆదిహైందవ ధర్మానికీ విరుద్ధమైన ఇస్లామ్ మతఛాందసులు, సెక్యులర్ వ్యతిరేకులయిన హిందుత్వ ఛాందసులూ] వందలాది సంవత్సరాలుగా విభిన్న జాతుల మధ్య విలసిల్లుతూ వచ్చిన లౌకిక ధర్మాలన్నింటికి చిచ్చుపెడుతూ సామాజిక జీవనాన్ని అల్లకల్లోలానికి గురిచేస్తున్నారు.


ఈ "గురి''లో భాగమే హైదరాబాద్ జంటనగరాలలోని దిల్ షుక్ నగర్ లో [21-02-2013] జరిగిన దారుణమైన బాంబుపేలుళ్ళు. వాటిఫలితంగా ఎందరో బలికావడమూ. చాలాకాలంగా సాగుతున్న అమానుషమైన ఈ గొలుసుకట్టు పరిణామాలన్నీ దేశంలోని ఇరువర్గాల మతఛాందసులు రాజకీయపార్టీలుగానూ, దేశంలోని రెండు ప్రధాన రాజకీయపక్షాలు పదవులు ఆధారంగా 'వోటు'కోసం మతాన్ని ఆశ్రయించినందునా జరుగుతున్నాయని ఇప్పటికి కడచిన ఈ పక్షాల చరిత్రంతా నిరూపిస్తోంది. ఈ విషమ పరిణామాలను దేశంలోని న్యాయవ్యవస్థ. న్యాయమూర్తులూ గమనించకపోవడం లేదు. 'అగ్ర'వాదులకూ, 'ఉగ్ర'వాదులకూ బీజాలు ఎక్కడున్నాయో కూడా ఇంతకు ముందెప్పటికంటే కూడా అనుభవం మీద న్యాయమూర్తులు గ్రహించగలగడం విషాదపరిణామాల మధ్య విజ్ఞతాపూర్వకమైన గుర్తింపుగా మనం భావించాలి.

 


"లౌకికవాదం: మైనారిటీల హక్కులు, రాజ్యాంగచట్టం'' అన్న అంశంపైన "నల్సార్ న్యాయవిద్యాలయం''లో జరిగిన [23-02-2013] జాతీయస్థాయి చర్చాగోష్ఠిని ప్రారంభిస్తూ సుప్రీంకోర్టు గౌరవన్యాయమూర్తి ఇటీవల వరకూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టీస్ ఎం.బి.లోకూర్ విలువైన సందేశం యిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారతదేశంలో ఉన్నది మత ప్రసక్తిలేని రాజ్యాంగమైనందున ఈ విలక్షణమైన లౌకికవ్యవస్థను రక్షించుకోవలసిన బాధ్యత దేశప్రజలందరిపైనా ఉందని జస్టీస్ లోకూర్ అన్నారు. ఎందుకంటే, మతం, ప్రార్థనలు, నమాజులు భిన్నత్వంలో ఎకత్వంతో కొనసాగే నిత్యనైమిత్తికాలు మాత్రమే. వ్యక్తిగతమైన మనోనిబ్బరం కోసం మానసిక శాంతికోసం రాగద్వేషాలకు, ఉద్రేకాలకు దూరంగా ఆచరించే సంప్రదాయాలు మాత్రమే. అందుకే, ఈ గుర్తింపుగల భారతరాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన రాజ్యాంగ నిర్ణయసభవారు 1947లోనే అనంతశయనం అయ్యంగార్ మతసంస్థలకు రాజకీయ పక్షాలూ, రాజకీయపార్టీలకు మతసంస్థలూ దూరంగా ఉండాలని, ఈ రెండు వ్యవస్థలమధ్య ఎలాంటి పొత్తూ పొంతన ఉండడానికి వీల్లేదని శాసిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు! కాని కాలక్రమంలో రాజకీయాధికార పక్షాలకూ, మతసంస్థలకూ తలల్లో పురుగు తొలిచి, కేవలం సీట్లకోసం, వోట్లకోసం ఒకరి పరిథిలోకి మరొకరు మెడలుదూర్చి దేశంలోని ప్రతీ సమస్యను మతద్వేషాలు చూసి, అందుకు అనుగుణంగా రాజకీయపక్షాలను, మతరాజకీయాన్ని మలుచుకుంటూ వచ్చి, జనజీవితాన్నే కకావికలుచేసి, సభ్యప్రపంచంలో భారతదేశానికి తలవంపులు తెచ్చిపెడుతున్నారు. ఈ పరిణామాల మధ్యనే జస్టీస్ లోకూర్ మరొకసారి రాజ్యాంగ లక్ష్యాన్ని గుర్తుచేయవలసి వచ్చింది. మతతత్వ ధోరణుల మూలంగానే సమాజంలో వైషమ్యాలు పెరుగుతున్నాయని, ఈ పరిణామాన్ని గుర్తించి విద్యార్థిలోకానికి ప్రాథమికస్థాయిలోనే పరమత సహనం గురించి, మతప్రసక్తి లేని లౌకికవాదం గురించీ అవగాహన కల్పించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేగాదు, "మతాలపేరిట రాజకీయాలు నడిపిస్తే ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడమే''నని అదే సభలో ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ ఖాద్రీ హెచ్చరించారు. దేశంలో మతాలమధ్య చిచ్చుపెట్టిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వ్యూహం గురించి ముంబై ఐ.ఐ.టి. ప్రొఫెసర్ రాం పునియా గుర్తు చేశారు.

 

ఎందుకంటే, 1857 నాటి ప్రథమ భారత స్వాంతంత్ర్య సంగ్రామానికి తొలి పూజలందించిన హిందూ-ముస్లీం సమైక్యతా శక్తిని ఆగ్రహాన్ని చవిచూసిన సామ్రాజ్యవాదుపాలకులు భిన్నమతాల, భిన్న సంస్కృతులమధ్య దేశంలో నెలకొన్న ఐక్యతను ఛిన్నాభిన్నం చేస్తే తప్ప తమ పాలనను  కొనసాగించడం అసాధ్యమని భావించి ప్రజల్ని విభజించి, పాలించడం కోసం మతాలమధ్య చిచ్చుపెట్టారు. జాతివ్యతిరేక చర్యను అందిపుచ్చుకున్నవాళ్ళు మన దేశీయపాలకులే అయినా, అదే "విభజించి-పాలించే''దుర్మార్గపునీతిని మాత్రం కాలక్రమంలో అటు కాంగ్రెస్ పాలకులూ, బిజెపి పాలకులూ వదులుకోలేకపోతున్నారు. ఏ రాజకీయపక్షం పదవిలో లేకపోతే ఆ పక్షం, ఎదుటి శత్రుపక్షంతో ఎన్నికలలో పోటీకోసం లబ్ధిపొందడానికి మతసంస్థల్ని ఆశ్రయిస్తున్నారు; ఈ 'సౌకర్యం' కనిపెట్టిన మతసంస్థలూ రాజకీయ పక్షాల్ని, పక్షాలనూ ఆశ్రయిస్తున్నాయి!



అందుకనే, చాలామందికి గుర్తు ఉందొ లేదో గాని - ఆ మధ్యకాలంలో భారత ఎన్నికల ప్రధాన కమీషనర్ గా పనిచేసి రాజకీయపక్షాల్ని ఎన్నికల సమయంలో పాటించవలసిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పక్షాలను చీల్చి చెండాడిన వాడు శేషన్! ఆ సమయంలో బిజెపి ముఠా అనుసరిస్తున్న 'హిందుత్వ' ఎజెండాకు గండికొట్టి తాత్కాలికంగానైనా 'గాడి'లోకి తీసుకువచ్చిన వాడాయన! కేవలం 'హిందుత్వ'రాజకీయంతో వ్యవహరిస్తున్న బిజెపికి, ఆ పార్టీ నాయకత్వం రాజకీయపక్షంగా పదవీ స్వీకార సందర్భంలో "లౌకికవాదానికి కట్టుబడి ఉంటామ''నీ, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని చేసిన ప్రతిజ్ఞను శేషన్ గుర్తుచేసి, ఆ ప్రతిజ్ఞను విస్మరిస్తే బిజెపికి ఎన్నికలసంఘం యిచ్చిన రాజకీయ గుర్తింపును రద్దుచేస్తానని హెచ్చరించడంతో నోరుమూయవలసి వచ్చింది.

 


అందువల్ల నేటి విషమపరిస్థితుల్లో తక్షణం జరగవలసినపని - మతసంస్థలుగా అవతారమెత్తి కాలక్రమంలో అవే రాజకీయపక్షాలుగా [అటు 'మిమ్'నూ, ఇటు బిజెపీని] నమోదై కొనసాగడాన్ని నిషేధించాలి; వాటి సభ్యులకు దేశ సామాన్య పౌరులమాదిరిగానే వోటు హక్కు ఇతర హక్కులూ ఉండాలి. ఎవరి మతసంప్రదాయాల్ని వారు పాటించుకునే హక్కును గుర్తించాలి. కాని రాజకీయపక్షంగా మతం చాటున తలఎత్తే హక్కు మాత్రం ఉండరాదు. అలాంటి అనుబంధసంస్థలన్నింటికీ ఈ నిబంధన వర్తించాలి. మతసంస్థ ఒక రాజకీయపక్షంగా ఈ దేశంలో వ్యవహరించడానికి అవకాశం లేకుండా పార్లమెంటు నిర్దిష్టమైన రాజ్యాంగసవరణ చేయాల్సిన సమయం వచ్చింది. అయితే అదే సందర్భంలో, నిషేధాలతోపాటు ఈ పితపబుద్ధులతో, సమాజాన్ని భ్రష్టుపట్టించే పక్షాలు తలెత్తడానికి మూలకారణమైన ఆర్థిక అసమానతల నిర్మూలనపైన పాలనావ్యవస్థ కేంద్రీకరించాలి. "సమాజంలో ఉగ్రవాదం హెచ్చరిల్లడానికి ఈ అసమానతలే కారణమ''ని రాష్ట్ర హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టీస్ నూతి రామ్మోహన్ రావు [23-02-2013] దిల్ షుక్ నగర్ లో కిరాతకాన్ని ప్రస్తావిస్తూ పాలకవ్యవస్థకు గుర్తుచేశారు. అయితే ఈ అసమానతలు తొలగడానికి అవసరమైన ఆదేశం రాజ్యాంగంలోని 38-39వ అధికరణలు పాలనావ్యవస్థకు పూర్తీ అవకాశం కల్పించినప్పటికీ పాలకపక్షాలు ఎందుకని వాటిని తు.చ. అమలు జరపకుండా నాటకమాడుతున్నాయో కూడా న్యాయమూర్తులు గ్రహించగలగాలి. సర్వత్ర ధనికవర్గ రాజకీయాలు రాజ్యమేలుతున్న సమాజాలలో పాలకుల ఆచరణ 'పెదవులు'దాటదని, మాటలు కోటలు దాటినా, కాలు గడపదాటదనీ గ్రహించాలి.

 


భారత నగరాలలో ఉగ్రవాదుల బాంబుపేలుళ్ళకు కారణాలు వెతికేవాళ్ళు ఎక్కడ ఘటన జరిగిందో అక్కడ క్షుణ్ణంగా వెతక్కుండా, మెడలురిక్కించి గంటలోనే బీహార్, నేపాల్ సరిహద్దుల దాకా సాగతీయడం విచిత్రం. పైగా తరచుగా ఈ దుర్మార్గాలకు గుజరాత్, మహారాష్ట్ర (బొంబాయి), కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే ఎందుకు కేంద్రబిందువులు కావలసివస్తోంది? ఈ నాల్గురాష్ట్రాలపైన ఉగ్రవాదులు ఎందుకు కేంద్రీకరించావలసివస్తోంది? వీటిలో మూడు రాష్ట్రాలలో బిజెపి, బిజెపి-శివసేన మతరాజకీయాలు తీవ్రస్థాయిలో కొనసాగుతుండడమే ఉగ్రవాదులూ అయా మేరకు ఈ రాష్ట్రాలలోనే కేంద్రీకరించవలసి వస్తోందని భావించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లో పాత రజకార్ మత సంస్థే ఆ తర్వాత మజ్లీస్ ఇత్తిహదుల్-ఇ-ముస్లిమీన్ రాజకీయసంస్థగా రూపాంతరం చెందింది. బాబ్రీమసీదు విధ్వంసకాండ, అందుకు ప్రతిగా ఆ పిమ్మట ముంబై కల్లోలాలు ఆ దరిమిలా గుజరాత్ లో మోడీ ప్రభుత్వం మైనారిటీలను పెద్దసంఖ్యలో ఊచకోత కోయటం, గుజరాత్ హోంమంత్రి పాండ్యా, జస్టీస్ కృష్ణయ్యర్ విచారణ సంఘం ముందు హాజరై, మైనారిటీల ఊచకోతకు బిజెపి మోడి ఎలా పోలీసులను అనుమతించిందీ ఆ ఆదేశానికి ఒక సాక్షిగా హీరేన్ పాండ్యా నివేదించడం, ఆ దరిమిలా పాండ్యా హత్యకు గురికావడం, ఆ హత్య తబిశీళ్ళు అహ్మదాబాద్ లో ఉండగా, అందుకు కారకులయిన హంతకుల్ని హైదరాబాద్ లో వెతకడానికి గుజరాత్ పోలీసుల్ని పంపడం - నాడొక పెద్ద ప్రహసనంగా సాగింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరాన్ని ఉగ్రవాదుల పేరిట అందరూ కలిసి ఒక హంతక నగరంగానూ, హత్యల అడ్డాగానూ సంబంధిత మత రాజకీయశాక్తులు మార్చివేశారు! ఇటువంటి వాతావరణంలో శాసనవేదికల ఉసురు సహితం మతోగ్రవాదుల చేతుల్లోనే ఉంటుంది! ఇందుకు ఉదాహరణ కోసం ఎక్కడికో వెళ్ళి వెతకనక్కరలేదు.

 

ప్రపంచయుద్ధానికి ముందు, ఆ యుద్ధకాండకొక 'మిష'ను సృష్టించవలసివచ్చి, నరమేధానికి కీర్తివహించిన నాజీ హిట్లర్, జర్మన్ పార్లమెంట్ భవనాన్ని (రీచ్గ్ స్టాగ్)కి తన పార్టీవాళ్ళతోనే తగులబెట్టించి, ఆ దుర్మార్గాన్ని కమ్యూనిస్టులపైకి నెట్టాడు! అలాగే గుజరాత్ లో 2002  నాటి మైనారిటీలపై జరిగిన ఊచకోతకు తులతూగే విధంగా 1938లో జర్మనీలోని మైనారిటీ యూదు జాతీయులని ఊచకోతకోసి, వాళ్ళ వ్యాపారాలను, ఇల్లనూ ధ్వంసం చేసిన క్రిస్తాల్నాక్డ్ (KRISTALLNACHT) ఉదంతం చరిత్రకు తెలుసు! 1925 నాటి ఇండియాలో ప్రస్తుతపు "హిందుత్వ''వాదుల నాటి నాయకులకు హిట్లర్ ముఠాతో ఉన్న సంబంధాలను జిఫర్లాటో అనే ప్రసిద్ధ చరిత్రపరిశోధకుడు వెల్లడించాడు. ఆ హిట్లర్ ఆరాధకులు ఆధునిక భారతంలో బిజెపికి పూర్వ ప్రేరకులయిన "హిందూ మహాసభ'' 'జనసంఘ్', ఆర్.ఎస్.ఎస్. లలో కూడ పొదిగిలేరని ఎవరైనా చెప్పగలరా? అందుకే మతం మానవతావాదాన్ని మాత్రమే అభిమతంగా ఆరాధించగలిగితే నవభారతం నవమన్మోహితంగా వృద్ధి కాగల్గుతుంది.

 

అందుకే మానవత, లౌకికధర్మం, సమతాధర్మం ఇరుసులుగా ఎదిగిన హైందవాన్ని మాత్రమే స్వామి వివేకానందుడు అభిమానించి, ప్రవంచించి ప్రచారం చేశాడు. చివరికి తప్పుదారి పట్టిన హైందవానికి తిరిగి పూర్వవైభవం తీసుకురావడం కోసం హైందవంలో సంస్కరణభావాలు వ్యాప్తి చెంది తీవ్రతరం కానంతకాలం దేశంలోని మైనారిటీలు అన్యమతాలను ఆశ్రయించడంలో తప్పులేదని కూడా వివేకానందుడు ఒకదశలో వకాల్తా పట్టవలసివచ్చిందని మనలోని మూఢమతులు గుర్తించాలి! అందుకోసమే ఆయన - సమాజశాంతిని భంగపరుస్తున్న కొందరు మతాచార్యులను సహితం దేశసరిహద్దుల్ని దాటించాలని చాటిచెప్పేవరకూ నిద్రపోలేదు! అప్పటిదాకా ఎదుటి పక్షంపైన అన్యమత ద్వేశంతోనే కారాలు మిరియాలు నూరుతూ తనవద్దకు వచ్చేసరికి "మత రాజకీయాల సమయంకాద''ని శ్రీరంగనీతులు వల్లించడమూ మనలోని ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం. నేడు రెండు మత రాజకీయ సంస్థలూ లేదా రాజకీయ మతసంస్థలూ 2014 ఎన్నికలు లక్ష్యంగానే సమాజశాంతిని భగ్నం చేస్తున్నాయి.

 

ఒకవైపున కేంద్ర హోంమంత్రి షిండే దిల్ షుక్ నగర్ బాంబుపేలుళ్ళకు కారకులు ఎవరని తొందరపడి నిర్థారణ చేయరాదని చెబుతూండగా, పేలుళ్ళ వెనక పాకిస్తాన్ హస్తముందని బిజెపి నాయకుడు అద్వానీ నిర్ణయించేశాడు. పాకిస్తాన్ కూడా ఉగ్రవాద దాడులకు తరచుగా గురవుతున్న సమయంలోనే అద్వానీ ఈ ప్రకటన చేయడం రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణకు దోహదం చేయదు; ఇదిలా ఉండగా "ఉగ్రవాదులకు శిక్షణ యిస్తున్న పాకిస్తాన్ కే వెళ్ళి క్షేత్రస్థాయిలోనే ఉగ్రవాదాన్ని మట్టుపెట్టిరావాలని "హిందూ దేవాలయాల ప్రతిష్ఠాపాన పీఠాధిపతి'' ఒకరు (23-02-2013) మహా ఉచిత సలహా యిచ్చాడు! ఇక ఒక బిజెపి సీనియర్ నేతగారు "హైదరాబాద్ లో ఇంటింటికీ సర్వే జరిపి ఉగ్రవాదులను వారికి ఆశ్రయిస్తున్నవారిని'' పట్టుకోవాలని కోరారు! అయితే ఇన్నేళ్ళుగా సవాలక్ష కేసుల్లో ఇరుక్కుపోయిన, లేదా ఇరికించిన డజన్లకొలదీ మైనారిటీల యువకులలో హెచ్చుమందిపైన ఒక్క ఆరోపణా రుజువు కాకుండా న్యాస్తానాలు ఎందుకు విడుదల చేయవలసి వచ్చిందో, పోలీసుల్ని ఎందుకు శాఠించవలసి వచ్చిందో బుద్ధిజీవులు ఆలోచించాలి! మనిషికి అభిమతమయినది మతం. కాని ఆ అభిమతాన్ని మానవీయంగా మలుచుకోగలగాలి. ఏది ఏమైనా విచారణల, సోదాల, అరెస్టుల పేరిట మైనారిటీలను వేధించడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా నిరసించాలి. అలాగే ఇరువర్గాలలోని మతఛాందసుల చర్యలను సకాలంలో తుంచివేయాలి. ఈ క్రమంలో మిలిటెంట్ మైనారిటీకన్నా, మౌనంగా మన్నుతిన్న పింజేరుల్లా ఉండే మెజారిటీ దేశసమైక్యతకు, దాని పరిరక్షణకు అసలు పెద్దచెరువు అని గ్రహించాలి.

 


మైనారిటీలపై మతవిద్వేషంతో సాగిస్తున్న మత రాజకీయశక్తుల ప్రచార ఫలితంగా దేశంలో ఏర్పడుతూ వచ్చిన భయకంపిత వాతావరణం చివరికి దేశ పోలీసువర్గాలను కూడా ప్రభావితం చేస్తోంది. విద్వేష ప్రచారానికి పరోక్షంగా చట్టబద్ధ వాతావరణం సృష్టి అవుతోంది. ఇది రెండు మతాలకూ చెందిన సాధారణ పౌరుల్నికూడా ప్రభావితం చేసి అనిశ్చిత పరిస్థితుల్ని అశాంతిని కల్గిస్తోంది. 1993లో అమెరికాలోని నల్లజాతి యువకులపై జరిగిన విద్వేష ప్రచారం ఫలితంగా ఒక యువకుడు హత్యకు గురైన ఉదంతంపైన విచారణ జరిపిన స్టీఫెన్ లారెన్స్ ఇంక్వయిరీలో నివేదిక "యూనిఫారమ్ లో ఉన్న పోలీసులు'' కూడా విద్వేష ప్రచారానికి లోనవుతారని వెల్లడించింది.

 


అస్సాంనుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ మత విద్వేష ప్రచారాల మూలంగా 1983 నుంచీ మైనారిటీల ధన, మాన, ప్రాణాల్ని ఎలా కోల్పోయారో "కంయూనలిజం కంబాట్'' పత్రిక సంపాదకురాలు, జస్టీస్ కృష్ణయ్యర్ ఆధ్వర్యంలో ఏర్పడిన మానవహక్కుల పరిరక్షణా సంస్థ సభ్యురాలు, గుజరాత్ మారణకాండకు గురైన కుటుంబాల తరపున ఈ రాజకీయ న్యాయస్థానాలలో పోరు సల్పుతున్న తీస్తా సెతల్వాడ్ అనేక ఉదాహరణలు పేర్కొన్నారు: 1983లో నెల్లి (అస్సామ్) పరిసరాలలో ప్రేరేపితమైన మతఘర్షణలలో 3000 మంది సామాన్య ముస్లీం పౌరులు హతులయ్యారు; ఈ హత్యాకాండలో పోలీసులు కూడా పాలుపంచుకోవడం న్యాయస్థానాల దృష్టిని ఆకర్షించింది; 1984లో ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో పనిగట్టుకుని 3000మంది సిక్కు పౌరులను చంపారు; 1987లో హషింపురా (ఉత్తరప్రదేశ్)లో 51 మంది ముస్లీంపోరులను రాష్ట్రీయ సాయుధ కాన్ స్టాబ్యులరీ గురిపెట్టి చంపారు; 1989లో భాగల్పూర్ (బీహార్) లో తలపెట్టిన ఊచకోతకు వేలమంది బలి అయ్యారు; ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారానలను కాలిఫ్లవర్ పంటభూమిలో ఆగమేఘాలమీద పూడ్చిపెట్టారు; 1992-1993లో 1200 మందికి పైగా హతులయ్యారు; 2008 నాటి కందమహల్ (ఒడిషా)లో జరిపిన మతవిద్వేషంతో జరిగిన ఘాతుకానికి సుమారు 100 మంది క్రిస్టియన్ పౌరులు బలయ్యారు; ఇక 2002లో గుజరాత్ లో మైనారిటీలపై జరిపిన హత్యాకాండలో 2000 మందికి పైగానే బలయ్యారు; ఈ అన్ని దుర్ఘటనలను పరిశీలించి విచారించిన కోర్టులూ, జ్యుడిషియల్ కమీషన్లూ మైనారిటీలకు వ్యతిరేకంగా పాక్షిక ధోరణిలో దేశంలోని పోలీసులు కూడా వ్యవహరిస్తున్నందుకు తీవ్రంగా విమర్శించవలసి వచ్చింది! దేశంలో మతవిద్వేష వాతావరణాన్ని పనిగట్టుకుని ఒక వర్గం మతరాజకీయపక్షం అన్యమతాలపైన సృష్టిస్తున్న ఫలితంగా ప్రజల భద్రతకు పూచీపడవలసిన పోలీసుయంత్రాంగం కూడా ఎలా ప్రభావితమయ్యే ప్రమాదముందో నిరూపిస్తున్నాయి. రాజ్యాంగం హామీపడిన సెక్యులర్ వ్యవస్థను రక్షించుకోవడం ద్వారా మాత్రమే ఇండియాను, ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుకోగలుగుతాం. మనకు కావలసింది గాంధీలు మాత్రమే గాని ఉన్మాదులూ, మతోన్మాద గాడ్సేలూ, కాశిం రజ్వీలూ కాదు!




By
en-us Political News

  
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.