40 లక్షల మంది పేర్లు జాబితాలో లేవు
Publish Date:Jul 30, 2018
Advertisement
అసోం జాతీయ పౌరుల నమోదు (ఎన్ఆర్సీ) తుది ముసాయిదా లిస్ట్‌ను ఈరోజు విడుదల చేశారు. మొత్తం 3.29 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా, 2.89 కోట్ల మందికి జాబితాలో చోటు లభించింది. 40 లక్షల మంది పేర్లు జాబితాలో లేవు.దీనిపై ఇవాళ ఉదయం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్, టీఎంసీ విరుచుకుపడ్డాయి.దీంతో రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో వివరిణ ఇస్తూ ఇందులో కేంద్రం పాత్ర ఏమిటో ప్రతిపక్షాలు చెప్పాలని నిలదీశారు.సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని అన్నారు.ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం తగదని పేర్కొన్నారు. తుది ముసాయిదా జాబితాలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ అసోం జాతీయ పౌరుల నమోదు ముసాయిదాపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.40 లక్షల మంది అస్సామీలకు జాబితాలో చోటుదక్కకపోవడం బీజేపీ 'గేమ్ ప్లాన్'లో భాగమేనని,ఈ విషయంపై మాట్లాడడానికి దిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సమయం ఇవ్వాల్సిందిగా కోరనున్నట్లు మమత తెలిపారు.ఎన్ఆర్సీ ముసాయిదాలో పేర్లు లేని వాళ్లకి పశ్చిమ్‌బంగాలో ఆశ్రయం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘వాళ్లకి ఇళ్లు ఉన్నాయి. వారంతా అసోం వాసులు. ఒకవేళ వారు ఇక్కడికి రావాలని కోరుకుంటే దాని గురించి ఆలోచిస్తాం. కానీ వాళ్లు ఎందుకు వచ్చేయాలి? సొంత దేశంలో శరణార్థులైన భారతీయులు వారు’ అని అన్నారు. పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డులు ఉన్న కొందరి పేర్లు కూడా జాబితాలో లేవని మమత ప్రశ్నించారు. కేంద్రం నలభై లక్షల మందిని దేశం నుంచి బలవంతంగా పంపేయాలని అనుకుంటోందని ఆక్షేపించారు.అసోంలో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తొలగించారు. అసోం ప్రజలతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేశారు.ఇది చాలా ఆందోళన కలిగించే అంశం’ అని మమత అన్నారు.తమ తృణమూల్ పార్టీ ఎంపీల బృందాన్ని అసోంకి పంపిస్తున్నామని, అవసరమైతే తాను కూడా వెళ్తానని చెప్పారు.
http://www.teluguone.com/news/content/40-lakh-risk-losing-citizenship-as-assam-releases-draft-list-39-82892.html





