పేద-మధ్య తరగతికి పారిశ్రామికాభివృద్ధి ఫలాలు : సీఎం చంద్రబాబు
Publish Date:Jun 18, 2026
Advertisement
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన 18వ ఎస్ఐపీబీ సమావేశంలో రూ.30,515 కోట్ల పెట్టుబడులతో 50 కంపెనీలకు ఆమోదం లభించగా, వీటి ద్వారా 29,677 ఉద్యోగాలు సృష్టించనున్నట్లు తెలిపారు. స్టార్టప్‌లకు ప్రోత్సాహం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా కోర్సుల రూపకల్పన, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక కోర్సులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఇథనాల్, బయోఫ్యూయల్స్, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, బ్యాటరీ టెక్నాలజీ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. రైతులకు ఉపయోగపడేలా మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్ ఏర్పాటు చేయాలని, తక్కువ ధరల్లో పరికరాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఏఐ ఆధారిత టెక్నాలజీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతాల వద్ద అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలు చేపట్టాలని, పర్యాటక రంగంలో హోటళ్లు, రిసార్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశకు చేరిన తర్వాతే ప్రోత్సాహకాలు, రాయితీలు అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.
http://www.teluguone.com/news/content/18th-sipb-meeting-36-223437.html





