చైనా విస్తరణ కాంక్షకు వ్యతిరేకంగా ఏకమైన 14 దేశాలు.!
Publish Date:Jul 16, 2026
Advertisement
ప్రపంచంలోనే రెండో శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉండి, నంబర్ వన్ స్థానం కోసం పరితపిస్తున్న చైనాకు అంతర్జాతీయ వేదికపై ఊహించని భారీ షాక్ తగిలింది. దక్షిణ చైనా సముద్రంపై పట్టు సాధించేందుకు చైనా చేస్తున్న విస్తరణాకాంక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. అంతర్జాతీయ సముద్ర చట్టాలను తుంగలో తొక్కుతూ చైనా చేస్తున్న మిలిటరీ విన్యాసాలను నిలువరించేందుకు అమెరికా నాయకత్వంలో బలమైన ఫ్రంట్ సిద్ధమైంది. చైనా వాదనలకు ఎలాంటి చట్టబద్ధమైన ఆధారం లేదంటూ 14 దేశాల సంయుక్త ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. 2016 జూన్ 12న నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరానికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చైనా సముద్ర హక్కుల వాదనలను పూర్తిగా తప్పుబడుతూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాలు చైనాను గట్టిగా నిలదీశాయి. అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, న్యూజిలాండ్, రొమేనియా, స్లోవేనియా వంటి 14 దేశాలు ముక్తకంఠంతో చైనా అక్రమాలను ఖండించాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం చైనా సముద్రంలో గీసుకున్న నైన్-డాష్ లైన్ అబద్ధమని, దానికి ఎలాంటి విలువ లేదని ఈ దేశాలు స్పష్టం చేశాయి. 2016లో వచ్చిన పీసీఏ ఆర్బిట్రేషన్ అవార్డు అనేది చట్టబద్ధంగా ఇరు దేశాలను బంధించేలా ఉంటుందని, దీనిని చైనా అమలు చేసి తీరాలని ఆ దేశాలు ఆ ఉమ్మడి ప్రకటనలో డిమాండ్ చేశాయి. ఈ 14 దేశాల ఉమ్మడి కూటమికి యూరోపియన్ యూనియన్ పూర్తి మద్దతును ప్రకటించింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని, ఎలాంటి బలవంతపు లేదా సైనిక చర్యలకు పాల్పడకూడదని ఈ ప్రకటనలో ఆ దేశాలు విస్పష్టంగా పేర్కొన్నాయి. నావిగేషన్, ఓవర్‌ఫ్లైట్ స్వేచ్ఛను అంటే సముద్రాలు, ఆకాశ మార్గాల్లో అన్ని దేశాలకు ఉండే రాకపోకల హక్కులను కాపాడాలని స్పష్టం స్పష్టం చేశాయి. ఈ అనూహ్య పరిణామంతో అసహనానికి లోనైన చైనా.. బీజింగ్‌లోని జపాన్ ఎంబసీకి చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ను చైనా విదేశాంగ శాఖ నేరుగా పిలిపించి సమన్లు జారీ చేసింది. జపాన్ ఈ వివాదంతో నేరుగా సంబంధం లేని దేశమని, అయినప్పటికీ ఇతర దేశాలతో కలిసి ప్రాంతీయ శాంతి-స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందని చైనా నిరసన వ్యక్తం చేసింది. ఈ వివాదానికి అసలు కారణం దక్షిణ చైనా సముద్రానికి ఉన్న వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యత. ప్రపంచ వాణిజ్యానికి ఇది ప్రధాన రవాణా మార్గంగా ఉంది. ప్రతి ఏటా కోట్ల రూపాయల విలువైన ముడి చమురు, సహజ వాయువు ఈ సముద్ర మార్గం గుండానే రవాణా అవుతాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతంలో చైనా అక్రమంగా కృత్రిమ దీవులను నిర్మిస్తూ, వాటిని సైనిక స్థావరాలుగా మారుస్తోంది. ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోకి చైనా యుద్ధ నౌకలు చొరబడుతూ ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నాయని ఫిలిప్పీన్స్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం అమెరికా, దాని మిత్రదేశాల నౌకాదళాలు ఈ ప్రాంతంలో నిరంతరం పర్యవేక్షిస్తుండటం, మరోవైపు చైనా గస్తీ నౌకలు మోహరించడంతో ఈ సముద్ర ప్రాంతం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. భవిష్యత్తులో ఈ 14 దేశాల కూటమికి, చైనాకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. China South China Sea Dispute, PCA Ruling Against China, US Japan Alliance, UNCLOS Sea Laws, Nine Dash Line China
http://www.teluguone.com/news/content/14-nations-unite-against-chinas-expansionist-ambitions-36-226125.html





