అక్టోబర్ 2న: యూపీఐ చెల్లింపులు బంద్.. అసలు కారణం ఇదే.!
Publish Date:Sep 24, 2026
Advertisement
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై కొత్తగా ఛార్జీలు విధించాలన్న నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పలు వాణిజ్య, వ్యాపార సంఘాలు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున 'నో యూపీఐ డే' పాటించాలని నిర్ణయించాయి. ఆ రోజున దేశవ్యాప్తంగా వ్యాపారులు తమ దుకాణాల్లో డిజిటల్ స్కానర్లు, క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్సులకు నల్లటి బట్టలు కట్టి వినూత్న రీతిలో నిరసన తెలపనున్నారు. వ్యాపారులు కస్టమర్ల మధ్య జరిగే లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం రూ.2,000 దాటిన ప్రతి చెల్లింపుపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రుసుమును చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. అయితే ఒక లావాదేవీపై గరిష్ట పరిమితిని రూ.300గా నిర్ణయించారు. వ్యక్తుల మధ్య జరిగే బదిలీలతో పాటు, నెలకు లక్ష రూపాయల వరకు లావాదేవీలు నిర్వహించే చిన్న స్థాయి వ్యాపారులకు ఈ నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించారు. అయినప్పటికీ, దేశంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో అధిక భాగం రూ.2,000 దాటినవే ఉండటంతో ఇది తమపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని వ్యాపారులు వాపోతున్నారు. ప్రభుత్వం డిజిటల్ ఆర్థిక లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న తరుణంలో, వ్యాపార వర్గాలపై ఇలాంటి అదనపు రుసుములు రుద్దడం సరికాదని జాతీయ స్థాయి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. చిన్న వ్యాపారుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం ఈ భారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో పాటు పలు ప్రముఖ పంపిణీదారుల సంఘాలు ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. కొన్ని రంగాల వారికి సంబంధితశాఖలు చర్చలు జరిపి హామీలిచ్చినా, మొత్తంగా కొత్త నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి. అక్టోబర్ 15 గడువు సమీపిస్తున్న తరుణంలో, ప్రభుత్వం వ్యాపార సంఘాల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన ఎలాంటి మలుపు తిరుగుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డిజిటల్ పేమెంట్స్ భవిష్యత్తుపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. [ UPI payments stop, No UPI Day October 2, MDR charges on UPI, digital payment news Telugu, merchant discount rate India ]
http://www.teluguone.com/news/content/-upi-payments-stop-25-232396.html





