రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

Publish Date:Aug 14, 2026

Advertisement

 

తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2.0 నిర్వహణ, సన్న ధాన్యం సాగుకు ప్రోత్సాహం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను తీసుకురావడం, ఎలక్ట్రిక్ ఆటోలకు సబ్సిడీ వంటి పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.

రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు..!

రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండగా.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసింది. దీంతో మరో 62 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 42 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2.0..!

గత ఏడాది నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2.0 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించేందుకు ప్రాథమికంగా తేదీలను ఖరారు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

గత ఏడాది ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వం.. ఈసారి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో సదస్సు నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ ప్లాన్‌ను కూడా ఆవిష్కరించనుంది. డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో తెలంగాణలో ఉన్న పెట్టుబడులు, పరిశ్రమల అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా సదస్సును నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ స్టార్టప్‌లు, పరిశ్రమలు సాధించిన విజయాలతో పాటు వివిధ రంగాల్లోని కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించేలా ఎగ్జిబిషన్లు, స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

సన్న ధాన్యం సాగుకు ప్రోత్సాహం..!

వానాకాలం పంటలో ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రకాల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించనుంది. అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఈ ఏడు రకాల సన్న ధాన్యానికే క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాలని కేబినెట్ తీర్మానించింది.

మిగులు ధాన్యాన్ని ఈ-వేలం ద్వారా విక్రయం..!

యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని కేబినెట్ పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించనుంది. మిగిలిన 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇటీవల మొక్కజొన్న ఈ-వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకున్న నేపథ్యంలో.. మిగులు ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి ఈ-వేలం ద్వారా విక్రయించాలని కేబినెట్ నిర్ణయించింది.
.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు..!

రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇవి సాంకేతిక విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి. తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ పరిధి నుంచి వీటిని తొలగించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలో చేర్చేందుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న వీటన్నింటినీ ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేసేందుకు కేబినెట్ తీర్మానించింది.

మరో ఏడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆమోదం..

ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో తొలివిడతగా 113 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తాజాగా ఆమోదించిన ఏడు పాఠశాలలతో కలిపి ఇప్పటివరకు 86 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌లకు అనుమతులు మంజూరయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ త్వరగా స్థల సేకరణ పూర్తి చేసి నిర్మాణాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పాఠశాలలను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన చోట వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.

పెట్రోల్, డీజిల్ ఆటోలకు గుడ్‌బై.. ఈవీలకు సబ్సిడీ..!

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చేందుకు కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్’ అమలు చేయడానికి ఆమోదం తెలిపింది.

ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆటోకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చుకోవడం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

HILT పాలసీ దరఖాస్తుల గడువు పొడిగింపు..

హైదరాబాద్ సిటీ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమలను నగర శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన HILT పాలసీ దరఖాస్తుల గడువును మరో మూడు నెలలు పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం..

మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఫేజ్-2 పనులకు రూ.2,100 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఆయా ప్రాంతాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించనున్నారు.

గూడెం దొడ్డి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుపై కీలక నిర్ణయం..!

గూడెం దొడ్డి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమించేందుకు కూడా అనుమతి ఇచ్చింది.

 Telangana Cabinet Decisions, Indiramma Houses Allocation, CURE Project Hyderabad, Telangana Rising Global Summit 2.0, Invest Telangana Theme, Telangana Investment Summit December 2026

By
en-us Political News

  
వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంపు..!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముందుగానే..!
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న సాయంత్రం 6 గంట లకు రాజ్‌భవన్‌ (లోక్‌భవన్‌)లో తెలంగాణ గవర్నర్‌ ‘ఎట్ హోమ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
BCI తీరుపై తీవ్ర అభ్యంతరం..!
హైదరాబాద్ పోలీస్‌లకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు..!
స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కమ్మటి నీటి బొట్టు కోసం నల్లమల అడవుల వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం ఆ ప్రాంత ప్రజలకు కొత్తేమీ కాదు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట పరిసరాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.