టీ బ్యాగ్ లతో టీ తయారు చేసుకుని తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి..!
Publish Date:Nov 8, 2024
Advertisement
టీ.. భారతీయులకు ఒక ఎమోషన్. ఒకప్పుడు పట్టణాలలో ప్రజలు, బయటి షాపులలో మాత్రమే టీ కనిపించేది. కానీ ఇప్పుడు గ్రామాలకు కూడా టీ ఫీవర్ పాకింది. ఉదయాన్నే కాఫీలు, సద్ది అన్నం తినే కల్చర్ నుండి ఉదయాన్నే టీ తాగి, టిఫిన్లు తిని పనులు చేసుకునే స్థితికి కాలం మారింది. ఇప్పుడు భారతదేశంలో నీటి తర్వాత అత్యధికంగా వినియోగిస్తున్న పానీయం టీ కావడం గమనార్హం. చాలామంది టీ ఆకులు, టీ పొడి కొనుగోలు చేసి టీని తయారు చేసుకుని తాగుతుంటారు. కానీ ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు గ్రీన్ టీ, బ్లాక్ టీ మొదలైనవి తాగుతారు. ఇవి కూడా తయారు చేసుకోవడానికి సులభంగా ఉంటుందని టీ బ్యాగ్ రూపంలో కొనుగోలు చేస్తారు. అయితే టీ బ్యాగ్ లు ఉపయోగించి తయారు చేసుకునే టీ వల్ల ఆరోగ్యం పాడవుతుందనే విషయాలను వైద్యులు, ఆహార నిపుణులు వెలిబుచ్చుతున్నారు. అసలింతకీ టీ బ్యాగ్ ల వల్ల జరిగే నష్టం ఏంటి తెలుసుకుంటే.. *రూపశ్రీ.
ఉదయాన్నే వేడి నీటిని ఒక పెద్ద కప్పులో పోసి అందులో గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ బ్యాగ్ వేసి 5 నుండి 10 నిమిషాల తరువాత ఆ పానీయాన్ని తాగడం చాలా మంది చేసే పని. ఆరోగ్యానికి ఆరోగ్యం, పని కూడా తక్కువే అనేది వారి భావన. కానీ ఇలా టీ బ్యాగుల ద్వారా తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు.
టీ బ్యాగులు ఉపయోగించడం చాలా తేలిక. కేవలం వేడి నీటిలో ఈ టీ బ్యాగులను కొన్ని నిమిషాలు ఉంచితే ఆరోగ్యకరమైన టీ తయారవుతుందని అనుకుంటారు. దీనికి తగ్గట్టుగానే మార్కెట్లో కూడా టీ బ్యాగుల అమ్మకం ఎక్కువ. ముఖ్యంగా టీ బ్యాగులు కూడా వివిధ రకాల ఫ్లేవర్లలో అమ్ముతుంటారు. టర్మరిక్ టీ, మందార టీ, దాల్చిన చెక్క టీ, చమోమిలే టీ వంటి టీలను కూడా అమ్ముతుంటారు. ఇవన్నీ శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయని అనుకుంటారు. వీటిలో కెఫీన్ ఉండదు. అయినప్పటికీ ఇవి కూడా డెంజరే.. ఎందుకంటే ఇవి కూడా టీ బ్యాగ్ ల రూపంలో ఎక్కువ వాడతారు.
టీ బ్యాగ్ లలో ఉండే రసాయనాలు శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. అంతే కాదు వీటిని ప్యాక్ చేసిన తరువాత ఇందులో ఏమున్నాయో గమనించే అవకాశం ఉండదు. కానీ కొన్ని సార్లు ఈ టీ బ్యాగ్ లలో కీటకాలు, చనిపోయిన పురుగులు వంటివి కూడా ఉండవచ్చు. ఈ కారణంగా ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ముఖ్యంగా టీ బ్యాగులను వేడి నీటిలో ఉంచినప్పుడు టీ బ్యాగుల నుండి మైక్రో ప్లాస్టిక్ విడుదల అవుతుంది.
టీ బ్యాగులలో డయాక్సిన్ లేదా ఎపిక్లోరోహైడ్రిన్ పూత ఉంటుంది. వేడి నీటిలో టీ బ్యాగులను ఉంచినప్పుడు ఈ పూత కరుగుతుంది. ఇది గ్లాసులోని నీటిలో కలిసిపోతుంది. దీని వల్ల శరీరానికి హాని కలుగుతుంది. దీర్ఘకాలంగా ఈ టీ బ్యాగులు వాడితే శరీరానికి మేలు జరగకపోగా వివిధ రకాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.
http://www.teluguone.com/news/content/-tea-bags-side-effects-34-188055.html