రాజకీయాల్లో కార్యకర్తలే బలిపశువులా?
Publish Date:Jul 6, 2026
Advertisement
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల కోసం ప్రాణాలర్పించే కార్యకర్తల వాస్తవ పరిస్థితిపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యక ఇంటర్య్వూలో తెలుగుదేశం సీనియర్ కార్యకర్త సిరిపురం శ్రీధర్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో, పార్టీ ఉద్యమాల్లో జెండాలు మోసి, ప్రత్యర్థులతో పోరాడే సాధారణ కార్యకర్తలు చివరకు కేసులపాలై కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా వారిని పట్టించుకోవడం లేదనే చేదు నిజాన్నిఆయన ఇసుమంతైనా సంకోచం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు కార్యకర్తలను కేవలం వాడుకుని వదిలేస్తున్నాయా అంటే ఔననే అనాలని సిరిపురం శ్రీధర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా రాజకీయ కక్ష సాధింపులు, కేసుల పరంపర విపరీతంగా పెరిగిపోయింది. పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని, ఆవేశంతో ముందుకెళ్లే యువత, కార్యకర్తలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, బ్రాహ్మణ చైతన్య వేదిక నిర్వాహకుడు సిరిపురం శ్రీధర్ పార్టీ కోసం చేసిన ఉద్యమాల్లో భాగంగా తనపై గతంలో దాదాపు 20 కి పైగా రాజకీయ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఒకసారి కేసుల్లో ఇరుక్కున్న తర్వాత సమాజంలో, కుటుంబంలో ఎదురయ్యే అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల విచారణ కోసం కోర్టులకు ఫీజులు చెల్లించలేక, చివరకు తల్లిదండ్రుల దగ్గర అడుక్కుని లేదా అప్పులు చేయాల్సిన దుస్థితి కార్యకర్తలకు వస్తోందని పేర్కొన్నారు. నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీలోనూ నిజమైన ఉద్యమ స్ఫూర్తితో పనిచేసేవాళ్లు వేళ్ల మీద లెక్కపెట్టేంత మందే ఉంటారన్న ఆయన మిగిలిన వారంతా కేవలం టీవీల్లో, ఫొటోల్లో కనిపించాలనే బ్యాచ్ మాత్రమే అని శ్రీధర్ చెప్పారు. వ్యక్తిగత ఆస్తుల గొడవలు లేదా సంఘవిద్రోహ చర్యల వల్ల వచ్చే కేసుల గురించి తాను మాట్లాడటం లేదని.. కేవలం పార్టీ పిలుపు మేరకు ఉద్యమాల్లో పాల్గొని అన్యాయంగా జీవితాలను నాశనం చేసుకుంటున్న జెన్యూన్ కార్యకర్తల కోణంలోనే ఈ వాదన వినిపిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏదో ఒక రాజకీయ పార్టీని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలలోనూ ఇదే పంథా నడుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తలను వాడుకోవడం, ఆపై కేసులు కాగానే వదిలేయడం అనే సంస్కృతి మారాలని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. యువత రాజకీయ ఆవేశంలో ఊగిపోయి వివాదాల్లో చిక్కుకోకుండా, కేసులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హితవు పలికారు. Siripuram Sridhar Interview, Political Party Workers Cases, TDP Leader Sensational Comments, Political Cases On Youth, Tone News Telugu, AP Politics Reality
http://www.teluguone.com/news/content/-parties-workers-scape-goats-in-politics-25-225186.html





