ఏపీకి క్యూ కట్టనున్న దిగ్గజ సంస్థలు.. గెట్ రెడీ.. అధికారులతో చంద్రబాబు
Publish Date:Jan 25, 2025

Advertisement
దావోస్ పర్యటనకు ఆర్భాటంగా వెళ్లి రిక్త హస్తాలతో తిరిగి వచ్చారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు చంద్రబాబు. దావోస్ వేదికగా జరిగి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ఏకైక అజెండాగా వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సదస్సు జరిగినన్ని రోజులూ క్షణం తీరక లేకుండా దిగ్గజ సంస్థల అధిపతులతో చర్చోపచర్చలు జరిపింది. సదస్సు ముగిసిన తరువాత విజయ హాసంతో చంద్రబాబు, ఆయన బృందం తిరిగి వచ్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం దావోస్ పర్యటనలో చంద్రబాబు విఫలం, ఒక్క రూపాయి పెట్టుబడి రాష్ట్రానికి తేలేకపోయారంటూ ఇష్టారీతిగా నోరు పారేసుకుంది. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన ఈ ఏడు నెలలో దావోస్ సదస్సుతో సంబంధం లేకుండానే రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వెతుక్కుంటూ వచ్చాయన్న విషయాన్ని వైసీపీ నేతలు కన్వీనియెంట్ గా మరిచిపోయారు. దావోస్ సదస్సులో ఒక్కటంటే ఒక్క ఎంవోయూ కూడా కుదుర్చుకోలేకపోయారంటూ చంద్రబాబు, లోకేష్ మీద ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. వాటన్నిటికీ చంద్రబాబు దీటుగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరయ్యే నిమిత్తం స్విట్జర్లాండ్ నగరం దావోస్ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పర్యటనను ముగించుకుని శుక్రవారం (జనవరి 24) సాయంత్రానికి అమరావతి చేరుకున్నారు. అదే రోజు తన అధికారిక నివాసంలో ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకే తాను దావోస్ వెళ్లానని ఆ పని దిగ్విజయంగా పూర్తి చేశాననీ చెప్పారు. ప్రభుత్వం తరఫున తాము ఇచ్చిన ప్రజెంటేషన్లను సావధానంగా విన్న దిగ్గజ సంస్థల అధిపతులు, ప్రతినిధులు త్వరలోనే రాష్ట్రానికి వస్తామని తెలిపారని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో దిగ్గజ సంస్థల ప్రతినిధి బృందాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. వారు వచ్చినప్పుడు… వారికి అవసరమైన వివరాలను సమగ్రంగా అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పిందే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. దావోస్ లో తాము చేసిన కృషికి కొనసాగింపుగా పకడ్బందీ చర్యలు చేపడితే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తడం ఖాయమేనని, ఆ దిశగా సిద్ధం కావాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
http://www.teluguone.com/news/content/-investments-flood-to-ap-39-191851.html












