భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రాయానికి ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదా.!
Publish Date:Jul 14, 2026
Advertisement
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిష్టాత్మక ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు హోదా ఇస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం (జులై 14) గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టం 2025 పరిధిలోని సెక్షన్ 4(1) ప్రకారం కేంద్ర హోంశాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. దీనితో దేశంలోని కేటగిరీ 1 అధీకృత అంతర్జాతీయ విమానాశ్రయాల జాతీయ రిజిస్ట్రీ జాబితాలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు 39వ స్థానం లభించింది. ఈ తాజా హోదాతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు, విదేశీ ప్రయాణికులకు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, వీసా చెకింగ్ వంటి ఇమ్మిగ్రేషన్ సేవలు అందించేందుకు చట్టబద్ధమైన మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల తర్వాత ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదా దక్కించుకున్న మూడవ విమానాశ్రయంగా భోగాపురం నిలిచింది. ఈ పరిణామం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్ ఏరోడ్రోమ్ లైసెన్స్ పొందిన తర్వాత కొన్ని రోజులకే చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నెల 10న న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రతిష్టాత్మక లైసెన్స్ పత్రాలను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ప్రారంభించడానికి ఎయిర్‌పోర్ట్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఈ లైసెన్స్ స్పష్టం చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనలు, పర్యవేక్షణలో రాబోయే పాతికేళ్ల ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విమానాశ్రయాన్ని అత్యంత వేగంగా లాంచ్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. జీఎంఆర్ గ్రూప్ సుమారు 4 వేల 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో, 2వేల 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. ఈ విమానాశ్రయం వార్షికంగా దాదాపు 4 కోట్ల మంది ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైనయ్యింది. ఇక్కడి టెర్మినల్ భవనం వైశాల్యం 78,000 చదరపు మీటర్లుగా ఉంది. దీని నిర్మాణ శైలి సముద్రంలో ఎగిరే చేప ఆకారంలో ఉండటం విశేషం. టెర్మినల్ లోపలి వెలుపలి డిజైన్లు ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్ర దాయాలు వైభవాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ప్రయాణికులు వేగంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవడానికి వీలుగా విశాఖపట్నం బీచ్ రోడ్ మార్గం ద్వారా భోగాపురానికి ప్రత్యేక కనెక్టివిటీ రూట్‌తో పాటు మొత్తం 7 అనుసంధాన రహదారులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. జూలై చివరి నాటికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కానుంది. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే విజయనగరం జిల్లా కలెక్టర్, జీఎంఆర్ ఉన్నతాధికారులతో ఎయిర్‌పోర్ట్ లాంజ్, రన్‌వే, అప్రోచ్ రోడ్లపై సమగ్ర సమీక్ష నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. విమానాశ్రయం ప్రారంభమైన వారం రోజుల నుంచే ఇక్కడ పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. Immigration Check Post Status to Bhogapuram Airport, Rammohan Naidu, Alluri Sitarama Raju Airport, Bhogapuram Airport Inauguration, GMR Bhogapuram Greenfield Airport
http://www.teluguone.com/news/content/-immigration-check-post-status-to-bhogapuram-airport-36-225983.html





