అమరావతికి అనుకూలంగా ఎమోషనల్ స్పీచ్.. ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి
Publish Date:Apr 3, 2026
Advertisement
రేణుకా చౌదరి అంటే ఒక ఫైర్ బ్రాండ్. ఏప్రిల్ 2న రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై ఆమె చేసిన ప్రసంగం నభూతో అనే వారొక పక్క. ఇదంతా ట్రాష్ అంటూ కొట్టి పడేస్తున్న వారు మరో పక్క తయారయ్యారు. ఎవరేమైనా అనుకోనీ అంటూ ఆమె సభలో చెలరేగిన విధం.. ఆంధ్ర ఎంపీల్లో కూడా లేనటువంటి ఎమోషన్ ఉన్నట్టు కనిపించింది. తెలుగు వారితో ఆమెకు మరింత బాండింగ్ ఏర్పరిచింది. ఆమె స్థానం ఇంకా చెక్కు చెదరలేదని నిరూపించింది. ఆమెలో ఇంకా చల్లారని రాజకీయ వాడి వేడిని వెలుగులోకి తెచ్చింది. ఇంతకీ రేణుక చుట్టూ ఉన్న వివాదాలేంటి? ఎన్టీఆర్ కాలం నాటి నుంచి నేటి వరకూ ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? అన్నది అలా ఉంచితే.. తాజాగా రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు. పెట్టరా పేరు అమరావతి.. పిలవరా కమ్మరావతీ అంటూ చెలరేగి పోయారామె. ఎన్టీఆర్ కాలం నాటి నుంచీ అమె పొలిటికల్ కెరీర్ మొత్త ఫైర్ బ్రాండే. రేణుకా చౌదరి రాజకీయ ప్రస్థానం 1984లో తెలుగుదేశం పార్టీతోనే మొదలైంది. ఆమెను రాజకీయాల్లోకి తెచ్చింది ఎన్టీఆరే. ఎన్టీఆర్ కి ఎందరో కూతుళ్లున్నా.. రాజకీయ కుమర్తె మాత్రం రేణుకా చౌదరే. ఆమెకు ఎన్టీఆర్ గారాల పట్టి అన్న పేరుండేది అప్పట్లో. ఎన్టీఆర్ చైతన్య రథం నడుపుతుంటే, ఆయన వెనుకున్న అతి కొద్ది మంది ముఖ్య నేతల్లో రేణుక ఒకరు. ఆమెకు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉన్న పట్టును చూసి ఎన్టీఆర్ ఆమెను ఢిల్లీకి అంటే రాజ్యసభకు పంపారు. 1986 నుంచి 1998 వరకు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్‌గా ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎన్టీఆర్ మాటను ఢిల్లీ స్థాయిలో బలంగా వినిపించడంలో ఆమె సిద్ధహస్తురాలిగా పేరు సాధించారు. అయితే, చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన రాజకీయ మార్పులతో ఆమె 1998లో తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో ఆమె పార్టీ మారడం అతి పెద్ద సంచలనం. ఇక కమ్మ సామాజిక వర్గంలో ఆమె ఇమేజ్ ఎలాంటిదో చూస్తే.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకురాలిగా ఆమెకు ఉన్న ముద్ర చెక్కు చెదరలేదు. ఢిల్లీ స్థాయిలో ఒక మహిళగా, తమ సామాజిక వర్గం నుంచి అంతటి బలమైన గళం వినిపించడంపై కమ్మ వారిలో ఒక రకమైన గర్వం దాగి ఉంటుంది. దీంతో ఆమెను కమ్మ వారి ఆడబిడ్డగా గౌరవించడమూ ఉంది. ఆమె టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు, పార్టీని ప్రేమించే కమ్మ సామాజిక వర్గం నుంచి కొంత వ్యతిరేకత ఎదురైంది. కానీ, ఇటీవల అమరావతి ఉద్యమంలో ఆమె రైతులకు అండగా నిలబడటంతో మళ్ళీ ఆ వర్గంలో ఆమెకు ఆదరణ పెరిగింది. ఇక వ్యక్తిగతంగా ఆమె చుట్టూ నెలకొని ఉన్న వివాదాలు ఎలాంటివో పరిశీలిస్తే.. పార్లమెంటులో కుక్క పిల్ల వ్యవహారం ఒకటి ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల పార్లమెంటు ప్రాంగణంలోకి ఒక కుక్క పిల్లను తీసుకురావడంపై వివాదం చెలరేగింది. దీనిపై ఆమె స్పందిస్తూ మనుషులను కరిచే వాళ్ళు లోపల- సభలో కూర్చున్నారు, నేను ఒక ప్రాణిని కాపాడితే తప్పా? అని ఎదురు ప్రశ్నించారామె. గతంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నప్పుడు ఆమె గట్టిగా నవ్వడం రామాయణంపైనా కామెంట్లు చేయడం అప్పట్లో అతి పెద్ద నేషనల్ న్యూస్ అయ్యింది. ఇంకా ఇలాంటి ఎన్నో వివాదాలు రేణుక చుట్టూ ఉన్నా.. ఆమె కుండ బద్దలు కొట్టి మాట్లాడ్డంలో సిద్ధహస్తురాలు. ఆమె ప్రస్తుతం ఉన్న పార్టీ ఏదైనా సరే తన పవరేంటో నిరూపిస్తూనే ఉన్నారు. దీంతో ఆంధ్రులంతా కలసి.. హేట్సాఫ్ రేణుకమ్మా.. మా వైపు నిలబడినందుకు మీకివే మా శుభాభినందనలు అని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/-emotional-speech-in-support-of-amaravati-45-216610.html





