మాజీ డిప్యూటీ మేయర్ హత్యకు భారీ కుట్ర.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు.!
Publish Date:Nov 29, 2026
Advertisement
రూ.25 లక్షలకు సుపారీ ఒప్పందం..అడ్వాన్స్ రూ.5 లక్షలు.! హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ మాజీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు జరిగిన భారీ కుట్రను బోరబండ పోలీసులు భగ్నం చేశారు. పక్కా ప్రణాళికతో సుపారీ ఇచ్చి హత్యకు పథకం రచించిన నిందితుల కుట్రను కేసు నమోదైన కొన్ని గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. రూ.25 లక్షలకు హత్యకు సుపారీ.! పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండలోని స్వరాజ్ నగర్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్, తన సోదరుడు ఫయాజ్ ఖాన్‌తో కలిసి సుమారు నెల రోజుల క్రితం మహ్మద్ కాషిఫ్ మిస్బాను సంప్రదించారు. బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కుట్రకు సంబంధించి ముందస్తు ఏర్పాట్ల కోసం రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మారణాయుధాలతో రెక్కీ.. కదలికలపై నిఘా.! హత్యా పథకంలో భాగంగా కొందరు వ్యక్తులు మారణాయుధాలతో బాబా ఫసియుద్దీన్ నివాస పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయన కదలికలను గమనిస్తూ, హత్యకు అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్రపై సమాచారం అందడంతో బోరబండ పోలీసులు అప్రమత్తమయ్యారు. గంటల్లోనే ఐదుగురు అరెస్ట్.. మరొకరు పరారీ.! ఈ కేసును తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుడు, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు సాంకేతిక ఆధారాలను సేకరించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టి కేసు నమోదైన గంటల వ్యవధిలోనే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇమ్రాన్ ఖాన్, దేవర రాజా, ఫయాజ్ ఖాన్, మహ్మద్ కాషిఫ్ మిస్బా, షేక్ నవాజ్ ఉన్నారు. మరో నిందితుడు సయ్యద్ హాదీ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. రెండు కత్తులు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం.! నిందితుల నుంచి రెండు కత్తులు, ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్ర నేపథ్యంలో బాబా ఫసియుద్దీన్‌కు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సుపారీ హత్యలపై పోలీసుల హెచ్చరిక.! నగరంలో సుపారీ హత్యలు, నేరపూరిత కుట్రలు, అక్రమ ఆయుధాల వినియోగం వంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. రెక్కీ నిర్వహించడం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం, హత్యలకు కుట్ర పన్నడం వంటి నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇది కూడ చదవండి: ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో దశలో పోలింగ్ జోరు.. పలుచోట్ల ఉద్రిక్తతలు.! [ Baba Fasiuddin, Baba Fasiuddin Murder Plot, Hyderabad Crime News, Former Deputy Mayor, Borabanda Police, Supari Gang, Hyderabad Police, Murder Conspiracy, BNS, PD Act ] మీకు నచ్చవచ్చు: ఓటు వేసేందుకు వస్తూ మృత్యుఒడికి..నలుగురు దుర్మరణం.! మీకు నచ్చవచ్చు: పెళ్లి పేరుతో మోసం: రూ. 10 లక్షలకు కుచ్చుటోపీ.!
అలవాటుపడిన నేరస్థులపై పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పాటు, అవసరమైన చోట రౌడీ షీట్లు తెరిచి వారి కదలికలపై నిఘా ఉంచుతామని తెలిపారు. రాజకీయ, ఆర్థిక పలుకుబడి ఉన్నా నేరస్థులను కాపాడలేదని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, రెక్కీ కార్యకలాపాలు లేదా ఆయుధాలతో సంచరించే వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
http://www.teluguone.com/news/content/-baba-fasiuddin-25-238171.html




