వారిద్దరినీ వైకాపా రంగంలో ఎందుకు దింపినట్లో?
posted on May 25, 2015 11:22AM
.jpg)
ఆంధ్రాలో ఉన్న నాలుగు యం.యల్సీ. స్థానాలకు నలుగురే నామినేషన్లు వేయడంతో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కానీ తెలంగాణాలో ఉన్న ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్ధులు పోటీ చేస్తున్నందున ఎన్నికలు అనివార్యమయ్యాయి. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఈరోజే చివరి రోజు కనుక తన ఐదవ అభ్యర్ధిని తెరాస పోటీలో ఉంచుతుందా లేక ఉపసంహరించుకొంటుందా? అనేది మరి కొన్ని గంటలలో తేలిపోతుంది.
యం.యల్యే. కోటా క్రింద జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియ ముగియక ముందే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే తన అభ్యర్ధుల పేర్లను వైకాపా ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును గుంటూరు నుంచి ప్రముఖ నటుడు కృష్ణ సోదరుడు, సినీ నిర్మాత జి.అదిశేషగిరిరావు ను కృష్ణ జిల్లా నుంచి బరిలోకి దింపుతోంది. ఆ రెండు జిల్లాల స్థానిక సంస్థలలో తనకు అవసరమయిన బలం లేకపోయినప్పటికీ వారిని పోటీలో నిలబెట్టడం వలన వైకాపా ఏమి నిరూపించదలచుకొందో తెలియదు కానీ వారు ఓడిపోతే వ్యక్తిగతంగా వారికీ, పార్టీకి కూడా అవమానమే అవుతుంది.