ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

 

జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu