ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిన ప్రత్యేక హోదా
posted on May 23, 2015 9:58PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం గురించి కేంద్రమంత్రులు చెపుతున్న మాటల వలన ఎన్డీయే ప్రభుత్వానికి మేలు కంటే కీడే ఎక్కువ జరురుగుతోందని చెప్పవచ్చును. ఈ అంశం మీద వారు మాట్లాడే ప్రతీ వాక్యం కూడా ప్రతిపక్షాలకు సరికొత్త ఆయుధం అందిస్తోంది. ఉదాహరణకు ఈరోజు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి అదనపు నిధులు ఇస్తున్నందునే పద్నాల్గవ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా గురించి గట్టిగా ప్రస్తావించడం లేదని అన్నారు. విభజన హామీలను చాలా వరకు నేరవేర్చామని మిగిలినవి కూడా త్వరలోనే నెరవేరుస్తామని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని అన్నారు.
యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో చేసిన అనేక హామీలలో కొన్నిటిని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న మాట వాస్తవం. కనుక మిగిలినవి కూడా అమలుచేస్తుందని నమ్మవచ్చును. కానీ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఎదురవుతున్న అడ్డంకుల వలన ఆ ఒక్క హామీని నెరవేర్చలేకపోతోందనేది కూడా వాస్తవం. కానీ పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదించేటపుడు, ఆ తరువాత ఎన్నికల సమయంలో కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ గట్టిగా నొక్కి చెప్పడం వలననే ఇప్పుడు ఆ హామీని వెనక్కు తీసుకోలేక ఇబ్బంది పడుతోంది.
ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఉన్న సాంకేతిక ఇబ్బందులు, రాజకీయ ఇబ్బందులు, ఇతర అవరోధాల గురించి, అదేవిధంగా ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంకట పరిస్థితి గురించి దాని కోసం పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీలకీ బాగా తెలుసు. అందుకే అవి తమ రాజకీయ ప్రత్యర్ధి అయిన బీజేపీని అది నడిపిస్తున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ఈ అంశం మీద ఇరుకున పెట్టి రాజకీయంగా దానిపై పై చేయి సాధించాలని చూస్తున్నాయి తప్ప నిజంగా వాటికి ఆంద్రప్రదేశ్ అభివృద్ధి జరిగిపోవాలనే తపనతో మాత్రం కాదు. అయితే వారికి ఆ అవకాశం కల్పిస్తున్నది మాత్రం కేంద్రమంత్రులేనని చెప్పకతప్పదు.
వారికి, ముఖ్యంగా దీనిని ఆయుధంగా చేసుకొని ఎన్డీయే ప్రభుత్వంతో పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజంగా రాష్ట్రంపై అంత ప్రేమ కారిపోతూ ఉంటే, అది పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించినప్పుడే అభివృద్ధి చేసి ఉండేది. కానీ అప్పుడు ఏమీ చేయకుండా కేవలం కుంభకోణాలు మాత్రమే చేస్తూ పదేళ్ళూ కాలక్షేపం చేసేసి ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం మోసలి కన్నీళ్ళు కార్చుతోంది. అయితే ఈ విషయం ఇంకా ఎంత కాలం సాగుతుందో తెలియదు కానీ అది సాగినంత కాలం ఎన్డీయే ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుండి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి విమర్శలు ఎదుర్కోక తప్పదు. కనుక ఈ సమస్యను మరింత కాలం నాన్చకుండా దీనిని ఏవిధంగా పరిష్కరించాలో గట్టిగా ఆలోచిస్తే మంచిదేమో.