కన్న తల్లిని ఇంటి నుంచి గెంటేసిన మున్సిపల్ చైర్మెన్..

అతను అధికార పార్టీ నాయకుడు. పట్టణానికి ప్రధమ పౌరుడు. పట్టణ ప్రజల రక్షణ బాధ్యతలు చూసే గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఆ నాయకుడు అత్యంత నీచంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం తల దించుకునేలా వ్యవహరించాడు. కన్న తల్లిపైనే దాడి చేశాడు. ఏకంగా ఇంటి నుంచి గెంటేశాడు. ఆస్తి కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆ వైసీపీ నేత. కన్న తల్లిని ఇంటి నుంచి మున్సిపల్ చైర్మెన్ గెంటేస్తున్న ఫోటోలు,దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఈ దారుణ ఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. మున్సిపల్ చైర్మెన్ రఘు.. తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డాడు. తల్లిని ఇంటి నుంచి గెంటివేశాడు. ఆస్తి కోసం తల్లిదండ్రులతో కొన్ని రోజులుగా రఘు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే వారిపై దాడి చేశాడు. ఆస్తి కోసం రఘు తమను వేధిస్తున్నాడని తల్లి సరోజ ఎమ్మిగనూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. ఇంటికొచ్చి తమపై దాడి చేస్తున్నాడని, కుమారుడితో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో తెలిపింది. మున్సిపల్ చైర్మెన్ నుంచి  తమకు రక్షణ కల్పించాలని ఆమె ఎస్పీకి విజ్ఞప్తి చేసింది. గత మూడు నెలలుగా ఆస్తి కోసం తన కొడుకు వేధిస్తున్నాడని పోలీసులకు వెల్లడించింది ఆ తల్లి.

కన్న తల్లిని మున్సిపల్ చైర్మెన్ గెంటేసిన ఘటన ఎమ్మిగనూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. కన్న తల్లిపైనే కిరాతకంగా దాడి చేసిన వ్యక్తి తమకు చైర్మెన్ గా ఉండటం దౌర్బాగమని ఎమ్మిగనూరు  ప్రజలు మండిపడుతున్నారు. కన్నతల్లిపై దాడి చేసిన మున్సిపల్ చైర్మెన్ పై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలతో కుటుంబ సభ్యులకు కూడా రక్ణణ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ చైర్మెన్ తీరు తమకు  తీవ్ర ఇబ్బందికరంగా మారిందని జిల్లా వైసీపీ నేతలు కలవరపడుతున్నారు.