ఇసుక దందా.. బాపట్ల మాజీ ఎంపీ సోదరుడు అరెస్ట్

వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా అక్రమాలతో చెలరేగిపోయిన  ఆ పార్టీ నేతల లీలలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డుకుని ప్రశ్నించిన తెలుగుదేశం ఏజెంట్ పై దాడికి పాల్పడిన కేసులో పిన్నెల్లి అరెస్టయ్యారు. ఆయన అరెస్టయిన రోజుల వ్యవధిలోనే బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్ సోదరుడు నందిగం ప్రభుదాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయనను ఇసుక అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్టు చేశారు.

ఉద్దండరాయుని పాలెం వద్ద సోమవారం (జులై 1) తెల్లవారు జామున ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని పోలీసులు లారీని పట్టుకున్నారు.  లారీ డ్రైవర్ ను అరెస్టు చేసి లారీని సీజ్ చేశారు.  విచారణలో ఈ ఇసుక అక్రమ రవాణాలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ హస్తం ఉందని తెలియడంతో తుల్లూరు పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ప్రశ్రించారు.

ఇలా ఉండగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ తన సోదరుడి అరెస్టు పై ఇంత వరకూ స్పందించలేదు.  ఇలా ఉండగా గత ప్రభుత్వంలో నిబంధనలకు తిలోదకాలిచ్చి జగన్ కు అడుగులకు మడుగులొత్తే చందంగా వ్యవహరించిన అధికారులను, అలాగే అక్రమాలకు పాల్పడిన నేతలను ఉపేక్షించే ప్రశక్తే లేదని ఇప్పటికే  తెలుగుదేశం అధినేత ప్రకటించిన సంగతి తెలిసిందే.   ఇలా ఉండగా తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి 20 రోజులు అవుతున్నా జగన్ హయాంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై ఇంత వరకూ చర్యలు తీసుకోకపోవడంపై తెలుగుదేశం శ్రేణులలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది, ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందు పాదయాత్ర సందర్భంగానూ తెలుగుదేశం కీలక నేత, మంత్రి లోకేష్ పదే పదే రెడ్ బుక్ లో అక్రమార్కుల అందరి పేర్లూ ఉన్నాయి. అధికారంలోకి రాగానే విచరణ జరపి చట్టపరంగా శిక్షిస్తామని  చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ తెలుగుదేశం సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. 

అయితే తెలుగుదేశం కూటమి ఎవరిపైనా కక్ష సాధింపు పద్ధతిలో చర్యలు తీసుకునే ప్రశక్తే లేదని, అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని తెలుగుదేశం ప్రభుత్వం ఆచరణలో చెబుతోంది. ఆ దిశగా ఇప్పటికే చర్యలు కూడా ఆరంభమయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ వర్గాల కథనం ప్రకారం  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి ముందే మద్యం కుంభకోణం పై కేసు నమోదు కావడమే కాకుండా వాసుదేవరెడ్డిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించి ఆయన నుంచి మొత్తం గుట్టు రాబట్టారు. ఇప్పుడు సీఐడీ మద్యం దందా లెక్కలను తేల్చే పనిలో తలమునకలై ఉంది. 
ఇక ఇసుక మాఫియాకు సంబంధించి  అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదిలే ప్రశక్తేలేదని, అక్రమాలు, అక్రమార్కులకు సంబంధించిన నివేదికలు సిద్ధమౌతున్నాయనీ తెలుస్తోంది. జగన్ కు వంత పాడి రాజ్యాంగానికి తూట్లు పొడిచిన అధికారులు దాదాపుగా జీఏడీకి అటాచ్ అయ్యారు. ఇలాంటి వారంతా  ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చంద్రబాబు వద్దకు వచ్చి ఓ బొకే అందించి, తమదేమీ లేదనీ అంతా జగన్మాయేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు.

అయితే చంద్రబాబు మాత్రం వారి అభినందనలు స్వీకరించడానికి, వారిచ్చిన బొకే తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో తమ పప్పులుడికేలా లేవని గ్రహించిన పలువురు అధికారులు వీఆర్ఎస్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని విస్పష్టంగా చెబుతోంది. ఇక తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన వీఐపీ మూకలపై కూడా చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితర నేతల అనుచరులపై కేసుల నమోదుకు రంగం సిద్ధమైంది. దాడి జరిగిన రెండున్నరేళ్ల తరువాత ఈ కేసుపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రత్యేక అధికారుల బృందం తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి దాడి జరిగిన రోజు నాటి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దాడికి పాల్పడిన వారినే కాకుండా దాడి చేయించిన వారిపైనా చర్యలు తీసుకునే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఇలా జగన్  ఐదేళ్ల పాలనలో నిబంధనలకు తిలోదకాలిచ్చి, అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ఆరంభమైపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

జగన్ హయాంలోలా అడ్డగొలుగా, కక్ష సాధింపులకు పాల్పడే విధానం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో జరగదనీ, గీత దాటిన ఏ ఒక్కరినీ కూడా వదలి ప్రశక్తే లేదనీ, అంతా నిబంధనలకు అనుగుణంగా చట్టప్రకారం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.