సెంచరీ కొట్టిన చదువు..!

పంతొమ్మది వందల నలభయ్యో సంవత్సరంలో అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మిస్ జింజర్ అనే ఒక బ్యూటీ గ్రాడ్యుయేషన్ చదువుతూ వుండేది. ఈ మిస్ జింజర్ మిస్టర్ హిస్‌లాప్ అనే తన క్లాస్‌మేట్‌తో పీకల్లోతు ప్రేమలో వుండేది. మన జింజర్ పిల్ల ప్రతిరోజూ యూనివర్సిటీలో పాఠాలు నేర్చుకుంటూ, సాయంత్రం అవగానే తన బోయ్‌ఫ్రెండ్ దగ్గర ప్రేమపాఠాలు నేర్చుకుంటూ హ్యాపీగా వుండేది. ఇంతలో  రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. జింజర్ లవర్ హిస్‌లాప్ సైన్యంలోకి వెళ్ళి యుద్ధం చేయాల్సి వచ్చింది. దాంతో జింజర్, హిస్‌లాప్ యూనివర్సిటీని విడిచి వెళ్ళిపోయారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హిస్‌లాప్ యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్ళిన హిస్‌లాప్ తిరిగి వచ్చాడు.. కానీ, మధ్యలో ఆగిపోయిన మిసెస్ జింజర్ చదువు మాత్రం కొనసాగలేదు. ఎప్పటికప్పుడు చదువుకోవాలని అనుకున్నా, సంసార బాధ్యత కారణంగా కుదర్లేదు. ఏమయితేనేం, మొత్తానికి మన జింజర్ పాప తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఎప్పుడనుకుంటున్నారు? ఏ పంతొమ్మిది వందల నలభై ఐదులోనో... యాభైలోనో కాదు.. రెండు వేల ఇరవై నాలుగులో! నమ్మలేకపోతున్నారు కదూ... మన జింజర్ బామ్మ తన 105 సంవత్సరాల వయసులో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. రెండ్రోజుల క్రితం జరిగిన కాన్వొకేషన్లో హెరిటేజ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఈ కాన్వొకేషన్‌లో మన జింజర్ బామ్మ మనవళ్ళు, మునిమనవరాళ్ళు కూడా పాల్గొన్నారు. ఓకే.. కంగ్రాట్స్ జింజర్ బామ్మా...!