అవసరమైన పని మాత్రమే చేయడం ఎందుకు ముఖ్యం?

మన దైనందిన జీవితంలో ప్రతీ ఒక్కరికీ అవసరాలు వుంటాయి. కానీ- ఏవి అవసరం ఏవి అనవసరం అనే విషయం తెలుసుకోలేక సందిగ్ధంలో పడిపోయి వాటికోసం కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు చాలా మంది. 

ఇలా సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల  మనకు లభించేది ఏదీ వుండదు అవకాశాలు చేయి జరిపోవడం, కాలం గడిచిపోవడం. ఇవి రెండూ నష్టాలు తప్ప ఏమాత్రం వారికి కొంచెం కూడా ఉపయోగకరం కాదు. ఎప్పుడైనా సరే మనం ఒక పనిని ప్రారంభించేటప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే అసలు మనకు ఈ పని ద్వారా ప్రయోజనం వుందా లేదా అనే విషయం ఆలోచించాలి. అలాగే చాలామంది అప్పటికప్పుడు కలిగే ప్రయోజనాల కోసం పనులు చేస్తారు. ఇలా తాత్కాలిక ప్రయోజనాలు కోసం మనం పనులు ప్రారంభించకూడదు. మనం ఇలాంటి పనులు చెయ్యటం ద్వారా ప్రయోజనం లేదు. కాని కాలక్షేపం కోసం చేస్తున్నాను అని అనుకుంటే ఆ పని చెయ్యడం అంత సమంజసం కాదు. మనకు ప్రయోజనం లేని ఏ పనికోసమైనా కూడా మన కాలాన్ని వృధాగా ఖర్చుపెట్టకూడదు. కాలం అంటే జీవితం, కాలాన్ని వృధా చేస్తున్నామంటే మన జీవితాన్ని మనం చేజేతులా వృథా చేసుకుంటున్నట్లే, మనకు జీవితంలో ఉన్నతమైన స్థానం కావాలి అంటే మన జీవితంలో అధిక సమయాన్ని మన విజయానికి దోహదపడే అంశాలపైనే కేటాయించాలి. 

అనవసర విషయాల కోసం సమయాన్ని కేటాయించటం ద్వారా అవసరమైన విషయాలు మరుగున పడిపోతాయి. అంటే అంత ప్రాముఖ్యత లేని పనులు చేస్తూ జీవితంలో మంచి స్థానానికి వెళ్లాల్సిన మనం, అవకాశాలు ఉన్నా వాటిని గుర్తించక  విజయానికి దూరంగా వుండడం జరుగుతుంది. అందుకే ముందుగానే మనకు ఏది అవసరమో నిర్ణయించుకొని దానికోసం మన జీవితంలో ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. తద్వారా విజయ సాధనకు దగ్గరగా వుంటాము. విజయం చేరువ కావాలంటే దాఞ్జకోసం సమయాన్ని ఎక్కువ కేటాయించడమే ఉన్నతమైన మార్గం. 

సాధారణంగా మన దైనందిన జీవితంలో కొన్ని సాధారణ విషయాలు వుంటాయి. ఇవేమీ పెద్ద ప్రాముఖ్యం లేని విషయాలులే అనుకుని, అలాంటి సాధారణ విషయాలను విస్మరిస్తే అవే కొంతకాలానికి అవే అత్యవసరమైనవిగా మారవచ్చు. అందువల్ల దైనందిన విషయాలే కదా అని తాత్సారం చెయ్యకూడదు. ఫలానా పనులు చెయ్యాలని నిర్ణయించుకునే ముందు ఆ పనులకు ప్రాధాన్యతా క్రమాలను ఇవ్వగలిగితే అవి సునాయాసంగానే జరుగుతాయి.  ప్రాధాన్యతా క్రమం అంటే మనం ఒక పనిని చెయ్యాలనుకుంటున్నామని అనుకోండి. అప్పుడు ఏం చెయ్యాలంటే, ఆ పని అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం వుందా లేదా? అది ముఖ్యంగా నిర్వహించాలా లేదా? లేకపోతే ఈ పని చెయ్యటం మంచిదా కాదా? ఈ పనిని ఎవరికైనా అప్పగించవచ్చా లేదా? దీనిని వెంటనే చెయ్యకపోతే నష్టం ఏమైనా వుందా లేదా అని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే మనం మన కాలాన్ని వృధా చేయకుండా విజయసాధనకు దగ్గరవ్వగలుగుతాము. మనకు ఏది అవసరం, ఏది అనవసరమో నిర్ణయించుకోగలగటంపైనే సమయ పాలన అనేది ఆధారపడుతుంది. అయితే కొన్ని విషయాలు తాత్కాలికంగా ఎలాంటి ప్రయోజనం చేకూర్చకపోయినా భవిష్యత్తులో తప్పక గొప్ప పలితాన్ని ఇస్తాయి. అలాంటి వాటిని గురించి ఆలోచించి తప్పక మంచి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవడంలో సఫలమైనట్టు.

                                      ◆నిశ్శబ్ద.