రాజస్థాన్ కు చెందిన ఈ రాణి గారి కోపం గురించి వెంటే షాకవుతారు..!


రాజస్థాన్.. చాలా ప్రత్యేకమైన రాష్ట్రం.  రాజస్థాన్  రాష్ట్రంలో కోటలు,  అందమైన రాజ భవనాలు కోకొల్లలు ఉన్నాయి. ఇక్కడి రాజులు, రాణుల చరిత్ర చాలా గొప్పది కూడా.  వీరిలో ఒక్కొక్కరి చరిత్ర ఒక్కో విధమైన విస్మయాన్ని కలిగిస్తుంది.  ముఖ్యంగా కొందరు రాజులు, రాణుల నిర్ణయాలు చాలా షాకింగ్ గా అనిపిస్తాయి. అలాంటి వారిలో రాణి ఉమాదే భాటియా కూడా ఒకరు.  ఈమెను రాజస్థాన్ ప్రజలు రుతీ రాణి అని పిలుస్తారు.  ఈమెకు చాలా కోపమట. ఎంతగానంటే ఈమె జీవితంలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఈమె భర్త బ్రతికున్నంత వరకు అసలు అయన దగ్గరకు వెళ్ళనే వెళ్లలేదట.  ఇంతకీ ఈ రాణి గారి కోపం ఎందుకో.. ఈమె ఎందుకు అంత కఠినంగా మారిపోయారో తెలుసుకుంటే..

ఉమాదే భాటియాని రాజస్థాన్ కు చెందిన రాణి.  ఈమెను ఉమా దేవి భాటియాని అని కూడా పిలుస్తారు. ఉమాదే భాటియాని  జైసల్మేర్ కు చెందిన రాజా రావల్ లుంకరన్ కుమార్తె. ఈమె రాజపుత్ర వంశానికి చెందిన యువరాణి.  ఈమె చాలా అందగత్తె ఈమె అందం గురించి సుదూర రాష్ట్రాలకు కూడా పాకింది.  1537లో జోధ్పూర్ కు చెందిన మాల్ఢియో రాథోడ్ తన రాజ్య విస్తీర్ణాన్ని పెంచుకునే చర్యలో భాగంగా  పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ జైసల్మేర్ ను ముట్టడించాడు. రావల్ లుంకరన్ తన కుమార్తె ఉమాదే భాటియాను మాల్డియో రాథోడ్ కు ఇచ్చి వివాహం చెయ్యడం ద్వారా తన రాజ్యాన్ని ఆక్రమణ నుండి కాపాడుకున్నాడు.

మాల్డియో రాథోడ్ తో ఉమాదే భాటియాకు వివాహం జరిగిన తరువాత జైసల్మేర్ నుండి ఉమాదే భాటియాతో పాటు కొందరు మహిళా పరిచారకులను కూడా ఉమాదే భాటియాతో అత్తవారింటికి పంపారు. ఉమాదే భాటియా వద్ద ఉన్న పరిచారకులలో భర్మాలి అనే ఒక దాసి ఉండేది.  ఆమె చాలా అందంగా ఉండేది. ఒకరోజు మాల్డియో రాథోడ్ బాగా మద్యం సేవించి రాణి దగ్గరకు రాకుండా మద్యం సేవించే గదిలోనే ఉండిపోయాడు.  దీంతో ఉమాదే భాటియా తన పరిచారిక భర్మాలిని పిలిచి రాజు దగ్గరకు వెళ్లి అతణ్ణి పిలుచుకుని రావలసిందిగా చెబుతుంది.  రాణి చెప్పినట్టు భర్మాలి రాజు దగ్గరకు వెళుతుంది. కానీ రాజు భర్మాలి అందానికి ముగ్ధుడై ఆమెను దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటాడు.  

రాజును తీసుకుని రావడానికి వెళ్లిన దాసి ఎంతసేపటికి రాకపోవడంతో ఉమాదే భాటియా తనే స్వయంగా రాజు దగ్గరకు వెళుతుంది.  అక్కడ రాజు భర్మాలితో సన్నిహితంగా ఉండటం చూసి కోపంతో రగిలిపోతుంది. ఆ కోపంలోనే ఆమె జైసల్మేర్ కు తన పుట్టింటికి వెళ్లిపోయింది.   అలా ఆరోజు వెళ్లిన ఉమాదే భాటియా అసలు ఎప్పుడు తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు.  భర్త చేసిన పనికి అతడిని జీవితంలో క్షమించలేకపోయింది.  జీవితాంతం ఆమె భర్త మీద కోపంతో అలా ఉండిపోవడంతో ఆమెను కోపిష్టి రాణి అని పిలవడం అందరికీ అలవాటైంది.


                                           *రూపశ్రీ.