ఆర్డీవీహైడింగ్.. ఎంత కాలం?

ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు మూడు రాష్ట్రాలలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ చిక్కకుండా రామ్ గోపాల్ వర్మ అజ్ణాతంలోనే ఉన్నారు. అక్కడ నుంచే వీడియోలు విడుదల చేస్తూ తన కోసం పోలీసుల గాలింపునూ, తన సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా కేసుల నమోదునూ ప్రశ్నిస్తున్నారు. భయం లేదనీ, పోలీసుల కేసులను ఖాతరు చేయననీ గప్పాలు కొడుతున్నారు. అదే సమయంలో ముందస్తు బెయిలు మంజూరు చేయాలనీ, తనపై కేసులను క్వాష్ చేయాలనీ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. అలాగే తాను భౌతికంగా విచారణకు హాజరు కాలేననీ, తాను సెలబ్రిటీననీ, సినిమాలతో చాలా చాలా బీజీ అని చెప్పుకుంటూ వర్చువల్ విచారణ కోరుతున్నారు. 

తనలోని భయాన్ని కప్పిపుచ్చుకుని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ఇవన్నీ చేస్తున్నారని నెటిజనులు ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు అది వేరే సంగతి.  వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ ఈ నెల 35న ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన గైర్హాజరయ్యారు. మరో వైపు ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్లు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అవి ఎప్పుడు విచారణకు వస్తాయో చూడాలి.

ఒక వేళ కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయకపోతే రామ్ గోపాల్ వర్మ ఇంకెంత కాలం అజ్ణాతంలో ఉంటారో, పోలీసుల నుంచి ఎంత కాలం తప్పించుకు తిరగగలుగుతారో చూడాల్సి ఉంది. ఇక ఆయన కోరినట్లుగా వర్చువల్ విచారణ ప్రశక్తే లేదని పోలీసులు కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఎలా చూసినా రామ్ గోపాల్ వర్మ అరెస్టు కాకుండా ఉండాలంటే కోర్టులు యాంటిసిపేటరీ బెయిపు పిటిషన్ పై సానుకూల తీర్పైనా ఇవ్వాలి. లేదా రామ్ గోపాల్ వర్మ తన అజ్ణాత జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండాలి.