కథలు చెప్పడం వల్ల పిల్లలకు నేర్పే దేమిటి??

ప్రస్తుతం ఎదిగే పిల్లలు ఏదైనా చేయాలంటే పెద్దలు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటారు. కానీ వరించుట్టూ ఉండే స్నేహితులు వారిని వివిధ రకాలుగా మాటలతో మనస్తత్వం మారిపోయేలా చేస్తారు.

ఉదాహరణకు…


ఓ అబ్బాయి కాలేజీలో చేరాడు. అతడి మిత్రులంతా కలసి సినిమాకు వెళ్ళాలని పథకం వేశారు. అయితే క్లాసులు ఎగ్గొట్టి, పెద్దల అనుమతి లేకుండా సినిమా చూడటం తప్పు అని తల్లిదండ్రులు నేర్పారు ఆ పిల్లవాడికి. కానీ సినిమా చూసినంత మాత్రాన ఏమీ కాదని మిత్రులు ప్రోత్సహిస్తూంటారు. ఎందరో సినిమాలు చూస్తున్నారు. అందరూ పాడైపోతున్నారా? అని వాదిస్తారు. ఇటువంటి పరిస్థితిలో పిల్లవాడు విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలి. 


"సినిమాకు వెళ్ళకపోవటం" అంటే పేరెంట్ గెలిచినట్టు "వాళ్ళొద్దంటే మానెయ్యాలా?" అనో "వెళ్ళకపోతే మిత్రులు హేళన చేస్తారనో" సినిమాకు వెళ్తే "చైల్డ్" గెలిచినట్టు. అలా కాక "ఇప్పుడు ఆ సినిమా చూడాల్సిన అవసరం అంతగా లేదు. సినిమా కన్న క్లాసు ప్రాముఖ్యం అధికం" అని విశ్లేషించి నిర్ణయం తీసుకున్నా, "క్లాసులో చెప్పేది చదువుకోవచ్చు, నష్టం కూడదీసుకోగలిగిందే కాబట్టి ఇప్పుడు సినిమా చూసినంత మాత్రాన పెద్దగా నష్టం లేదు" అని తర్కించి నిర్ణయం తీసుకున్నా, "అడల్ట్" పని చేస్తున్నట్టు. ఇలా మానవమనస్తత్వం పని తీరును ఆధునిక మానసికశాస్త్రవేత్తలు వివరిస్తారు. అంటే, ఊహ తెలియని దశ నుంచీ ప్రతీదీ పిల్లవాడిపై ప్రభావం చూపిస్తాయన్నమాట.


అటువంటప్పుడు ఉయ్యాలలో నిద్రిస్తున్న పిల్లవాడి కోసం పాడే పాటల ప్రభావం అతడిపై చూపటంలో ఆశ్చర్యం ఉందా! అది అబద్ధం అవుతుందా?


పాకే వయసు రాగానే 'చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ' అంటూ నేర్పేవి పనికి రాకుండా పోతాయా? ఆ తరువాత చెప్పే పురాణకథలు, ప్రభావరహితం అవుతాయా?


బాల్యంలో కృష్ణుడి అల్లరి చేష్టలు పిల్లవాడి ఊహాప్రపంచానికి రెక్కలనిస్తాయి. తానూ కృష్ణుడిలా సాహసకార్యాలు, అవీ లోకకల్యాణకారకాలైన సాహసకార్యాలు చేయాలన్న తపన పిల్లవాడిలో కలుగుతుంది. ఆ వెంటనే చెప్పే ధ్రువుడి కథ, అష్టావక్రుడి కథ, సత్యహరిశ్చంద్రుడు, హనుమంతుడు, రాముడు, లవకుశుల కథలు పిల్లలకు స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా హనుమంతుడి కథలు, సాహసాలు సూపర్ మేన్, బ్యాట్ మేన్ లను మరపిస్తాయి. వాటి కన్నా ఆరోగ్యకరమైన వినోదాన్నిచ్చి, ఉన్నతమైన ఆదర్శాన్ని నిలుపుతాయి. పిల్లలను అమితంగా ఆకర్షించే అనేకాంశాలు హనుమంతుడి కథల్లో ఉన్నాయి.


అంటే నీతులు చెప్పకుండా, ఉపన్యాసాలు ఇవ్వకుండా కేవలం కథలు చెప్పటం ద్వారా. పిల్లల వ్యక్తిత్వవికాసానికి బీజాలు వేసే వ్యవస్థ అన్నమాట మనది. ఇళ్ళల్లో తల్లికి సమయం లేకపోతే, తాతయ్యనో, నాయనమ్మనో, బాబాయిలో, అత్తయ్యలో, ఎవరో ఒకరు సాయంత్రం కాగానే పిల్లలను పోగేసి కథలు చెప్పేవారు. పురాణకథలతో పాటు జానపదకథలూ వినిపించేవారు. చారిత్రకగాథలు చెప్పేవారు ఆయా కథలు పిల్లలను ఎంతగా ఆకట్టుకునేవంటే మళ్ళీ సాయంత్రం కోసం పిల్లలు ఎదురుచూసేవారు.


నెమ్మదిగా ఈ కథలు దేశభక్తుల కథలుగా రూపాంతరం చెందేవి. రాణా ప్రతాప్ త్యాగం, శివాజీ సాహసం, భగత్ సింగ్ బలిదానం, ఝాన్సీలక్ష్మి వీరత్వం..... ఇలా ప్రారంభం నుంచీ పిల్లల ముందు ఉత్తమాలోచనలు, ఉత్తమ ఆదర్శాలు నిలపటం జరిగేది. పిల్లలు పాఠశాలలకు వెళ్ళి కొత్త ప్రపంచద్వారాలు తెరుచుకునేసరికి, ఆ ప్రపంచపు తాకిడిని తట్టుకుని విచక్షణతో నిర్ణయాలు తీసుకునే విజ్ఞానం వారికి అందేది. దాంతో ప్రలోభాలను తట్టుకుని సరైన మార్గం ఎంచుకోగలుగుతాడు పిల్లవాడు. ఇదీ పిల్లలకు కథల వల్ల పెద్దలు నేర్పే మంచి. ఇలాంటి వాటిలో పిల్లలు విలువలు సులువుగా గ్రహిస్తారు. తద్వారా వారిలో స్నేహితులు రెచ్చగొట్టినా అది నాకు అవసరం లేదు, చదువుకోవాలి అనే మాటను ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా చెప్పగలుగుతారు.

                                           ◆నిశ్శబ్ద.