టీనేజ్ అబ్బాయిలు ఒంటరితనం ఫీలవుతారా? అసలు నిజాలు చెప్పిన మాజీ ఐఏఎస్...! 

 


సాంకేతికతతో బాగా అనుసంధానమయ్యి, చుట్టూరా స్నేహితులు ఉండే తరం అయినప్పటికీ, ఇప్పటి యువత ఎక్కువగా ఒంటరితనం ఫీలవుతున్నారు. వినోద కార్యక్రమాల్లో  పాల్గొనటంలోనూ, సరదా సందళ్లలోనూ ముందున్నప్పటికీ  టీనేజ్ అబ్బాయిలకి   ఒంటరిననే భావన   ఎందుకు వస్తుంది? అని మీరు   అనుకుంటున్నారా..!   అయితే దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ మాజీ ఐఏఎస్ అధికారయిన వికాస్ దివ్యకీర్తి  వాటిలో కొన్ని ముఖ్యమైన కారణాలను ప్రస్తావించారు.  అందులో ఒకటి ‘కుటుంబ ఒత్తిడి’..

మీరు ఓ టీనేజ్ కొడుకు తల్లిదండ్రులైతే, అతను  ఒంటరితనం ఫీలవ్వటానికి గల  కారణాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అసలు ఈ టీనేజ్ అబ్బాయిల్లో ఒంటరితనం ఎందుకు పెరుగుతోందో తెలుసుకుందాం..

తల్లిదండ్రుల కలలను నెరవేర్చడానికి ఒత్తిడి:

వికాస్ దివ్యకీర్తి  చెప్పినట్లు,  ‘కుటుంబానికి  మద్దతుగా నిలబడాల్సింది అబ్బాయిలే అన్న మాటని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బయటవాళ్లు అందరూ కలిసి,  ప్రతీ మగపిల్లాడికి  చిన్న వయస్సు నుంచే నూరిపోస్తారు.  తల్లిదండ్రులు వారికి ఇదే విషయాన్ని పదేపదే గుర్తు చేస్తుంటారు కూడా.  తల్లిదండ్రుల రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా కుటుంబాన్ని నిర్వహించాలనే బాధ్యత అబ్బాయిలకే ఉంటుంది. ఈ ఆలోచనలతో వచ్చే  తీవ్రమైన ఒత్తిడి వల్ల చదువులో వెనకబడితే వారి  జీవితం ఏమైపోతుందోనన్న మానసిక ఆందోళన ముందునుంచే  పట్టుకుంటుంది. తాము చదవలేకపోతున్నామనే విషయాన్ని కూడా వాళ్ళు బయటకి చెప్పుకోలేరు.  దీనివల్ల వారికి మానసిక ఒత్తిడి, ఒంటరిననే భావన  పెరిగిపోతాయి.'

13-19 వయస్సులో పిల్లలు ఎందుకు ఒత్తిడిని అనుభవిస్తారు?

వికాస్ దివ్యకీర్తి ప్రకారం, 13-19 వయస్సు గల పిల్లలు ఎక్కువ ఒత్తిడిలో ఉంటారు. ఎందుకంటే ఈ వయసులోనే వాళ్ళు  భవిష్యత్తు కోసం పెద్ద చదువుల వైపు వెళ్ళటమో లేదా  పనిచేయడం ప్రారంభించటమో చేస్తూ ఉంటారు.  కుటుంబ బాధ్యతల ఒత్తిడి కూడా వారికి ఉంటుంది.  తాము పడుతున్న ఈ ఆందోళనలన్నీ తరచుగా ఎవరికీ చెప్పుకోలేరు.  అందువల్ల వారు ఒంటరితనాన్ని అనుభవిస్తారు.

టీనేజ్ పిల్లలలో తిరుగుబాటు స్వభావం:

13-19 వయస్సు గల టీనేజ్ అబ్బాయిలు సహజంగా తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటారు. మానసికంగా ఎదిగీ ఎదగని వయసు కావటంతో ఈ సమయంలో వారి మనస్సులో అనేక ప్రశ్నలు ఉంటాయి.  కానీ వాటికి సమాధానాలు ఏవీ దొరకవు. అందుకే ప్రతి తల్లిదండ్రులు ఈ దశలో తమ పిల్లల భావాలను అర్థం చేసుకొని మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం.

అక్కచెల్లెలు ఉన్న వారే అదృష్టవంతులు:

వికాస్ దివ్యకీర్తి ప్రకారం, తమ వయస్సుకి ఇంచుమించు  సమాన వయస్సున్న  అక్క లేదా చెల్లెలు ఉన్న అబ్బాయిలు అదృష్టవంతులు. అలా సమవయస్కులైన అక్కచెల్లెళ్లు అత్యంత సన్నిహితమైన స్నేహితుల్లా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు అబ్బాయి నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా  తమ భావాలను, భయాలని వాళ్ళతో చెప్పుకోవచ్చు.  అక్కచెల్లెలు శ్రద్ధగా వినడమే కాకుండా నిజాయితీగల సలహా కూడా ఇస్తారు. ఇలా అక్కచెల్లెలుతో మాట్లాడటం అబ్బాయి మనసు భారాన్ని తగ్గించి, ఒంటరితనాన్ని తగ్గించగలదు. 

టీనేజ్ పిల్లల ఒంటరితనాన్ని ఎలా తగ్గించాలి? అనే విషయంలో నిపుణులు తెలియచేసిన కొన్ని సూచనలు: 

1.మీ పిల్లలు ఎటువంటి  భయం లేకుండా తమ భావాలను చెప్పుకునేలా తల్లిదండ్రులు ఒక స్నేహపూర్వక వాతావరణం కల్పించి, పిల్లలతో మంచి సంబంధాలు ఏర్పర్చుకోవాలి. 

2.మీ పిల్లలు మీ దగ్గరకు ఏదైనా చెప్పుకోవటానికి రాకముందే, వారి సామాజిక జీవితాన్ని  గమనించండి. వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి. 

3.సోషల్ మీడియాని వాళ్ళు ఉపయోగిస్తున్న విధానం మీద ఒక కన్ను వేసి ఉంచి, ఆరోగ్యకరమైన సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించండి.  స్క్రీన్ టైమ్‌ను తగినట్టు సర్దుబాటు చేసి,  వారి ఆరోగ్యం మీద ప్రభావం పడకుండా  చూడడి. 

4.పిల్లలకు చెడు సావాసాలకి దూరంగా ఉంటూ, మంచి సంబంధాలను ఏర్పర్చుకోవటం నేర్పించండి. అలాగే  ఒంటరిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, పరిస్థితులకి క్రుంగిపోకుండా  ఎలా నిలబడాలో నేర్పించండి.


                                               *రూపశ్రీ.