సంబరాల దసరాలో ఆసక్తికర విషయాలు!
posted on Sep 26, 2022 9:30AM
పండుగ అంటే పట్టలేనంత ఆనందం ప్రతి ఒక్కరికీ. కేవలం దేవతల పూజ, వారి కృపకు పాత్రులయ్యే సందర్భం మాత్రమే కాదు పండగ అంటే, ఇంటిల్లిపాదీ ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి కలసిమెలసి సంతోషంగా ఉంటూ జీవితంలో ఆనందాలు కలగాలని కోరుకునే రోజు కూడా. సంతోషం సగం బలం అని అంటారు పెద్దలు. ఆ సంతోషం వెంటబెట్టుకువచ్చేవి పండుగలు. ప్రస్తుతం దసరా మొదలయ్యింది. దుర్గా నవరాత్రులు తొమ్మిదిరోజులూ కన్నుల పండుగే. ఈ తొమ్మిది రోజుల్లో జరిగే విశేషాలు బోలెడు. ప్రతి ఇంట్లో ఆడవారు ఉద్యోగాలు, పరుగులతో ఎంత బిజీగా ఉన్నా పూజ విషయంలో మాత్రం రాజీ పడరు. దసరా నవరాత్రులలో జరిగే సంబరాలు ఏంటో తెలియని వారు కొందరుంటారు. వారు తప్పక తెలుసుకుని తీరాలి.
నైవేద్యాలు!
దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు జరిగితే ఆ తొమ్మిది రోజులూ ఇంట్లో ఘుమఘుమలే. రోజుకొక్క నైవేద్యం చేసి అమ్మవారికి పెడుతూ, ఇంటిల్లిపాదీ ఆరగించడం ఓ సంతోషం. నిజానికి సాధారణంగా చేసే వంటలకు, నైవేద్యం కోసం చేసే వాటికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా రుచి మొత్తం ప్రసాదానిదే అన్నట్టు ఉంటుంది. ఒకో అమ్మకు ఒకో రకమైన నైవేద్యం చాలా సింపుల్ గానే చేయచ్చు. ఇప్పట్లో ప్రతి ఒక్కటీ యూట్యూబ్ లో ఉంటాయి కాబట్టి వాటిని చూసి ఫాలో అయిపోవచ్చు వంట రాని వాళ్ళు కూడా.
బొమ్మల కొలువు!
దసరా బొమ్మల కొలువు నిజానికి కళ తగ్గిందనే చెప్పాలి. ఎక్కడో కొన్ని ఇళ్లలో తప్ప ఇది కనిపించదు. ఈ బొమ్మల కొలువుకు ఓ ప్రత్యేకత ఉంది. అదే ఈ సృష్టి గురించి నిగూడమైన అర్థం కూడా. బొమ్మల కొలువు అంతా ఈ ప్రపంచ మానవాళి, జీవులు అయితే వీటిని పాలిస్తూ, పోషిస్తూ ఆ అమ్మవారు ఉంటారని, అదే బొమ్మల కొలువులో నిజమైన అర్థమని చెబుతారు.
జమ్మి వృక్షం పూజ!
ఈ దసరా వెనుక ఒక పండుగకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా మరొక ముఖ్యమైన విషయం ఉంది. అదే జమ్మి చెట్టు పూజ. పాండవులు వనవాసం వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆయుధాలు అన్నీ స్మశానంలో ఉన్న జమ్మిచెట్టు మీద శవం ఆకారంలో పేర్చి వెళతారు. వనవాసం, అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత తిరిగి విజయ దశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి వృక్షం మీద నుండి తీసుకున్నారు. అప్పుడు జరిగిన యుద్ధంలో వారు విజయం సాధించారు కూడా. అందుకే జమ్మి వృక్షాన్ని పూజిస్తారు.
రావణ కాష్టం!
సీతమ్మను ఎత్తుకుపోయిన రావణాసుడి మీద రాముడు యుద్ధం చేసాడు. రామ, రావణ యుద్ధం తొమ్మిది రోజులు జరిగి, రావణ సంహారం పదవ రోజున జరిగిందని, ఆ రోజుని గుర్తు చేసుకుంటూ దసరా పండుగ రోజు పదితలల రావణుడి బొమ్మను దహనం చేస్తారు. దీనినే రావణకాష్ట అని కూడా అంటారు. చాలా చోట్ల ఇది జరుగుతుంది.
మహిషాసుర వధ!
అమ్మవారు ఈ లోక ప్రజలను కాపాడటం కోసం తొమ్మిది రోజులు మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి దసరా పండుగ రోజున మహిషాసురుడిని సంహరిస్తారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని చోట్ల మహిషాసుర వధ నిర్వహిస్తారు.
నవరాత్రుల ఆరాధన!
ముంబయి, కలకత్తా వంటి ప్రాంతాలలో నవరాత్రులు జరిగినన్ని రోజులూ అద్బుతమే. ఆ రోజులలో అమ్మవారిని ప్రతిష్టించి వినాయక నవరాత్రులలాగా జరుపుతారు. దసరా పండుగ పూర్తవగానే అమ్మను నిమజ్జనం చేస్తారు. ఇది ఆ ప్రాంతాలకే చెందిన ప్రత్యేకత.
బతుకమ్మ సంబరాలు!
తెలంగాణ ప్రాంత ప్రజల జీవనదృశ్యం బతుకమ్మ పండుగలో కనిపిస్తుంది. తెలంగాణ తమ రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించింది కూడా. బతుకమ్మను పేర్చడం కూడా గొప్ప కళ. ఉదయమంతా పూజలు, బతుకమ్మ పేర్చడం, నైవేద్యాలతో గడిచిపోతుంది. సాయంత్రం అవ్వగానే మహిళలందరూ ఒకచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ, చీకటి పడుతుండగా బతుకమ్మను నీళ్లలో వదులుతారు. ఇలా తొమ్మిది రోజులు అయ్యాక దసరా రోజు సంబరాలు జరుపుకుంటారు.
ఇలా దసరా పండుగ రోజులలో ఎన్నో ప్రత్యేకతలు ఆయా ప్రాంతాల విశిష్టత ఆధారంగా జరుగుతాయి.
◆నిశ్శబ్ద.