ఇష్టంతో పనిచేస్తే కష్టమంతా మరచిపోవచ్చు!

ఆఫీసులో పనిచేస్తున్న వారిలో పనిపట్ల శ్రద్ధలేకపోయినా, పని చేయడంలో విసుగు చిరాకు ప్రదర్శిస్తున్నా వారి సమస్య ఒత్తిడికాదు... పని ఒత్తిడి ఎక్కువైందని...!

పనితో అలసిపోతున్నామని చెప్పేవారి సమస్య ఏమిటంటే వారికి ఆ పనిపట్ల ఇష్టం లేకపోవడం. అందువల్ల పనిమీద శ్రద్ధ చూపించలేకపోయారు. దాని వలన వారు పని ఒత్తిడి ఎక్కువైందని భావిస్తారు. అయిష్టంతో పనిని చేయడం వలన ఏ వ్యక్తి అయినా, ఆ పనిని రెండుసార్లు చేస్తారు. ఎన్నిసార్లు చేసినా ఆ పనిలో వారు చురుకుదనంగా ఉండరు. ఆ పనిని అంత సమర్థవంతంగా చేయలేరు. ఆ పనిపట్ల అయిష్టతకు కారణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేక వేరే ఇంకేమైనా కావచ్చు. అందువల్ల ఆవ్యక్తి ఆ పని పట్ల ఆసక్తి చూపకపోవచ్చు. 

ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినపుడు, మనం మన  వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలి. ఆ ఫీల్డ్కి మనం ఇష్టంతో అంకితమవ్వాలి. అప్పుడు ఆ ఫీల్డ్కి మనం న్యాయం చేసినవారం అవుతాము. వ్యక్తిగత జీవితంలో ఎవరు హుషారుగా ఆనందంగా గడుపుతారో అటువంటివారే ఎంత ఒత్తిడినైనా తట్టుకుని, ఎంత పనైనా చేయగలుగుతారు. జీవితంలో తృప్తిగలవారికే పనిలోనూ తృప్తి లభిస్తుంది. జీవితాన్ని ఆనందించలేనివారు చిన్నచిన్న పనుల్లో కూడా చాలావరకు తప్పులనే చేస్తూ వుంటారు. "పనులు నువ్వు చేయడంలేదు. జరుగుతున్నాయ" అనే మాటను  గ్రహించి నిరహంకారంగా ఎవరి  కర్తవ్యం వారు నిర్వర్తించాలి.

ఈ పని తర్వాత ఇంకేం చెయ్యాలి అని ఆలోచించకూడదు కేవలం చరిస్తూ వెళ్ళాలి. అలా ఆచరిస్తూంటే, ఒకదానివెంట మరొకటి అవే వస్తుంటాయి. మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తయితే ఆ పనిపట్ల నీవు ఇష్టతను చూపించావు అని అర్థం. మొదలుపెట్టినపని అవలేదంటే నీవు ఆ పనిపట్ల అయిష్టతను చూపించావు అని అర్థం. కొంతమంది ఇష్టంతో చేసినా ఆ పని ఆపలేదంటే దానికి కారణం ఆ పనిని వాయిదా వేయడం. ఇలా వాయిదా వేయడం వలన క్రమేపీ ఆ పనిపట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. దీని వలన ఆ పనులు పూర్తికావు. అందువలన ఎప్పుడూ పనులను వాయిదా వేయకూడదు. కాబట్టి మనం ఏదైనా పనిని మొదలు పెట్టినపుడు ఆ పనిని ఇష్టంతో వాయిదా వేయకుండా ఆ పనిని త్వరగా పూర్తిచేసుకోవాలి.

ఎప్పుడైన ఒక పనిని ఇష్టంతో చేస్తే ఆ పని కష్టమనిపించదు ఆ పనిలో విజయాన్ని పొందుతారు. ఎప్పుడైనా ఒక పనిని కష్టపడి చేస్తే మనకి ఆ పని కష్టంగా వుంటుంది. ఆ పని విజయవంతం కాదు. ఓటమి, విఘ్నం, అనేవి బయటెక్కడో లేవు. నీలోనే వున్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు కొందరు, ఇంకేదో విషయంపై ఉత్సాహంతోనే పనులు మానేస్తారు మరికొందరు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనిని తలపెడితే ఆ పని అయ్యేవరకూ ఆ పనిపట్ల ఇష్టాన్ని చూపించాలి. అప్పుడే ఆ పనిలో ఆనందాన్ని పొందగలం. అలా చేస్తే ఇక విజయం మన  సొంతమవుతుంది.

ఒక సాకర్ ఆటలో ఆటగాళ్ళను మారుస్తూ, ఒకరు సరిగ్గా ఆడకపోతే వారికి బదులు ఇంకొకరిని అడటానికి పంపవచ్చు. కానీ - జీవితం అలాకాదు. ఒకసారి ఏదైనా తప్పుచేస్తే, దాన్ని వెనక్కి తీసుకుని, దానిస్థానే ఇంకోపని చెయ్యటం కుదరదు. మీ జీవితంలో సంభవించిన విషాద సంఘటనలని వెనక్కి తిప్పి సరిచూసుకోడానికి మీకు రెండో అవకాశం దొరకదు.

                                     ◆నిశ్శబ్ద.