చాణక్యుడు చెప్పిన మాట.. ఇలాంటి వ్యక్తులను ఎప్పుడూ సమస్యలు చుట్టుముడతాయట..!

చాణక్యుడు చంద్రగుప్త చక్రవర్తికి దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా అందరికీ సుపరిచితుడు. ఈయన రాజనీతిలో మాత్రమే కాకుండా తాత్విక విషయాలను కూడా చాలా స్పష్టంగా, క్షుణ్ణంగా తన చాణక్య నీతి గ్రంథాలలో వివరించాడు.  ముఖ్యంగా మనిషి అలవాట్లను, మనిషి ప్రవర్తనను చాణక్యుడు చెప్పిన విధానం తెలుసుకుంటే మనుషుల జీవితాలు చాలా మారిపోతాయి.  జీవితంలో ఎప్పుడూ  సమస్యలతో చుట్టు ముట్టే వ్యక్తుల గురించి,  వ్యక్తి ప్రవర్తన గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు..

చాణక్యుడు చెప్పిన కొన్ని పద్యాలు, వాటి భావాలు తెలుసుకుంటే ఆయన చెప్పిన విషయాలు బాగా అర్థమవుతాయి.

వ్యవయనర్గతమాకారః శుచయతి|

ఒక వ్యక్తి మనసులో ఏముందో అది ఆ వ్యక్తి ముఖంలో స్పష్టంగా వ్యక్తమవుతుందట. అబద్దాలు చెప్పే వ్యక్తుల ముఖంలో కూడా అలాగే ఆ ఉద్దేశాలు వ్యక్తమవుతాయి.  అలాంటి వ్యక్తులు ఏదైనా దాచి పెట్టాలని చూసినా అందులో అర్థం లేదు.. అందరికీ అవి అలా అర్థమైపోతూ ఉంటాయి.  అబద్దం చెప్పే వ్యక్తులు తమ జీవితంలో ఇతరులను మోసం చేస్తున్నామని, ఇతరుల నుండి లాభపడుతున్నామని, కొన్ని సమస్యల నుండి తప్పించుకుంటున్నామని అనుకుంటారు. కానీ అందులో అర్థం లేదు.. ఇలాంటివి చేయడం వల్ల వారికి సమస్యలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు.

దాచిన పాపానాం సాక్షిణో మహాభూతాని|

రహస్యంగా చేసిన పాపాలకు ఇతరులు ఎవరూ సాక్షులు లేరని చాలామంది సంతోషపడుతుంటారు.  తమకు ఎలాంటి నష్టం జరగదని తమను ప్రశ్నించేవారు ఎవరూ ఉండరని అనుకుంటూ ఉంటారు.  కానీ అలా రహస్యంగా చేసిన పాపాలకు పంచభూతాలే సాక్ష్యాలు.. పంచభూతాలైన భూమి, నీరు,  కాంతి,  వాయువు,  ఆకాశం ఇవన్నీ ప్రతి వ్యక్తి కదలికకు, చేసే తప్పులకు, చేసే మంచి పనులకు కూడా సాక్ష్యులుగా ఉంటాయి.

ఆత్మః పాపాత్మైవ ప్రకాశయతి

పాపం చేసే వ్యక్తి మనసులో ఎప్పుడూ అశాంతి నెలకొని ఉంటుందట. తను చేసిన తప్పు ఎవరూ చూడకపోయినా, ఎవరికీ తెలియక పోయినా తప్పు చేశాను కదా అనే భావన మనసులో ఉంటుంది.  ఈ భావన అనేది ఎప్పుడూ మనసులో గుర్తుకువస్తూ మనశాంతి లేకుండా చేస్తుంది.  దీని వల్ల మనసు కూడా నిలకడగా ఉండదు.

ఎవరైనా తప్పుగా సాక్ష్యం చెబితే..

తప్పుగా సాక్ష్యం చెప్పేవారు ఉంటారు కొందరు. దానివల్ల వారికి కాస్తో కూస్తో లాభం చేకూరుతుందని అలా చేస్తారు. లేదా కొన్ని సార్లు తప్పు సాక్ష్యం చెప్పడం వల్ల తనకు కావలసిన వారు సమస్యల నుండి బయటపడతారని అనుకుంటారు.  కానీ ఇలా తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు నరకానికి వెళతారని ఆచార్య చాణక్యుడు చెప్పుకొచ్చాడు.  అలాంటి వ్యక్తులు అశాంతితో రగిలి పోవడమే కాకుండా.. వారిని ఎప్పుడూ సమస్యలు చుట్టు ముడతాయట. కాబట్టి అబద్దాలు చెప్పడం, తప్పుడు సాక్ష్యాలు చెప్పడం జీవితంలో వ్యక్తిని పతనానికి తీసుకెళుతుందని.


                                              *రూపశ్రీ.