బాధ్యతలను పంచుకోవడమంటే ఏంటి?

ప్రతీ పుట్టుకకీ ఒక ప్రయోజనం వుంది. మన నైపుణ్యాలనీ, శక్తి సామర్థ్యాలనీ అధికంగా ఉపయోగించుకుంటూ, బాధ్యతలను పంచుకుంటూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందకర జీవితాన్ని కొనసాగించాలి. ఇదే మనిషి జీవితంలో అందరికీ కావలసినది కూడా. కానీ మనుషులు కొంచెం ఆశ ఎక్కువ గలవారు. ఉన్నదాంతో తృప్తి పడరు. ఇంకా ఇంకా కావాలని అనుకుంటూ వుంటారు. 

అయితే మనుషులు జీవితంలో తమకు కావలసిన వాటిని గట్టిగా అడిగి మరీ సాధించుకుంటారు. వీటినే హక్కులు అని అంటారు. ప్రతీ మనిషి హక్కులతోబాటు బాధ్యతలను కూడా పంచుకోవటం నేర్చుకోవాలి. ఒక విద్యార్థిగా, ఉద్యోగిగా, భర్తగా, లేక భార్యగా సంఘంలో సభ్యుడిగా, ఒక అన్నగా, ప్రతి విషయంలోనూ బాధ్యతలను పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం బాధ్యతలను పంచుకోవటం ద్వారా మనకంటూ ఒక విలువ ఏర్పడుతుంది. విలువలు మనిషి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆ విలువలే మనిషిని ప్రత్యేకంగా నిలబెడతాయి. మనిషిలో నైతిక, సామాజిక, ధార్మిక విలువలు తప్పకుండా ఉండాలి. అవి ఉన్న వ్యక్తి లో గొప్ప వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది.

మనందరిలో వున్న బలహీనత ఏమిటంటే బాధ్యతల నుండి తప్పించుకోవటం, ఇక్కడ బాధ్యత అనే పదాన్ని బట్టే అది ఆ వ్యక్తి తప్పకుండా నిర్వహించాల్సిన పని అనే విషయం అర్థమవుతుంది. కానీ అందరూ ఏమి చేస్తారు?? ఆ పని ఎక్కడ చేయాల్సి వస్తుందో అనే బద్దకంతో ఏవో కుంటి సాకులు, అబద్ధాలు చెప్పి ఆ పని నుండి మెల్లగా దూరం వెళ్ళిపోతారు. కానీ అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే బాధ్యతలను స్వీకరించటం వల్ల మనకు ప్రతీ విషయంలోనూ అనుభవం అనేది ఏర్పడుతుంది. ఈ అనుభవం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే తెలివితేటలు మనకు లభ్యమవుతాయి. అనుభవమే గురువు, అనుభవాల సారమే జీవితం అని స్వామి వివేకానంద చెప్పిన విషయం అందరూ గుర్తుచేసుకోవాలి. 

 ఏ పనినైనా సరే తప్పించుకోవడానికి, సాకులు చెప్పడానికి ప్రయత్నించకూడదు. ఎప్పుడూ ఏదోసాకులు చెప్పడానికి ప్రయత్నించేవారు జీవితంలో ఏ పని చెయ్యడానికి కూడా ముందుకు రాలేరు. ఏ పనీ చేయలేరు, పనులు చేయకుండా తప్పించుకునేవారు పనులు చేయడం చేతకాకుండా నిస్సహాయుడిగా, చేతకానివాడిగా తయారవుతున్నాడని అర్థం. అంటే తనని తాను అలా మార్చుకుంటున్నాడు. అలాంటి వాడు  కొంచెం కూడా విలువలను కూడా దక్కించుకోలేరు. 

ఒక పనిని చేయకపోవడానికి వంద కారణాలు చెప్పవచ్చు. కానీ అదే పనిని చేయడానికి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత అసౌకర్యం ఉన్నా చెయ్యాలన్న మనస్సు ఒక్కటుంటే చాలు చేసేస్తారు. మనలో చెయ్యాలన్న తపన వుండాలి, మన మనస్సును మనమే ప్రోత్సహించుకోవాలి. చెయ్యగలమనే నమ్మకాన్ని మనసుకు ఇవ్వాలి. ఆ రకమైన మనస్తత్వాన్ని మనమే సృష్టించుకోవాలి. అప్పుడే మనం ఏ పనినైనా చెయ్యగలం. ఏ పనినైనా మనసుపెట్టి, బాధ్యతతో చేయగలం అన్న మనస్తత్వంతో చేయాలి. చేయగలమన్న నమ్మకమే మన చేత ఏ పనినైనా చేయిస్తుంది. బాధ్యత అనేది అభివృద్ధికి దారితీస్తుంది. ఈ విధంగా పని చేయాలనే నమ్మకం మనిషిలో బాధ్యతలను మెల్లిగా అభివృద్ధి చేస్తే ఆ బాధ్యతలను అందరూ పంచుకుని వాటిని సక్రమంగా నిర్వర్తిస్తే అప్పుడు ప్రతి కుటుంబం, సమాజం, నేటి వ్యవస్థ అంతా సవ్యంగా ఉంటుంది.

                                       ◆నిశ్శబ్ద.