నేటికాలం అనారోగ్యాలకు హేతువు ఇదే!
posted on Aug 9, 2024 9:30AM
డిప్రెషన్ అనేది ఒక మానసిక వ్యాధి. జీవితంలో చాలామందికి ఏదో ఒక తెలియని బాధ ఉంటుంది. ప్రపంచ జనాభాలో నూటికి 80% మంది ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్కు గురి అవుతుంటారు. ప్రపంచం అభివృద్ధి చెందేకొద్ది, మనుషులు అన్ని రకాల అవసరాలను చాలా సులభంగా తీర్చుకునే కొద్దీ మనుషులకు మానసిక వ్యాధులు ఎక్కువ అవుతూ ఉన్నాయి.
చాలామంది మానసిక సమస్యతో బాధపడుతున్నా సరే అది మానసిక వ్యాధి అని వారు గుర్తించరు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలలో దీన్ని గుర్తించేవారు లేరు. డిప్రెషన్ తో బాధపడే వారిని పొగరు మనుషులుగా ముద్ర వేస్తుంటారు చాలా మంది. డిప్రెషన్కు గురి అయినవారు ఏదో ఒక బాధతో, దుఃఖంతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి లక్షణాలు వున్నవారు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపిస్తారు. ఏదో చిరాకు, ఇష్టమైన వాటి మీద కూడా అయిష్టంగా వుంటారు. అంతేకాకుండా వారు చెయ్యగలిగిన వాటిని చెయ్యలేరు, నా వల్లకాదు అన్న ఆలోచనలు కలిగివుంటారు. అందుకే వారు ఏ పనికి ముందుకు రారు, చేయమని ఎవరైనా చెప్పినా కాదని చెబుతారు. ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్ కలిగి ఉంటారు. కానీ ఇదంతా వారి నాటకం అని, పని తప్పించుకోవడానికి వారు అలా చేస్తున్నారని చుట్టూ ఉన్నవారు చెబుతారు.
జీవితానికి అవసరం అయిన ఎన్నో విషయాలపై మనం ఇంట్రస్టును కోల్పోతుంటాము. మనకు ఆనందాన్నిచ్చే విషయాలపై ఆటలు, పాటలు, సినిమాలు, షికార్లు, పిక్నిక్ లు, మొదలైన వాటిపట్ల కూడా ఆసక్తి కోల్పోతారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి నిద్రపట్టకపోవడం, నిద్రపట్టినా కలతనిద్రే తప్ప సుఖనిద్ర లభించదు. అంతేకాకుండా నిద్రలో ఏదో భయంకరమైన కలలు రావటం జరుగుతుంది. మరణం గురించిన ఆలోచనలు తరుచుగా వస్తూ వుంటాయి. జీవితం మీద విరక్తి వస్తుంది. బతకటం కంటే చావటం మేలు అనుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. జీవితాన్ని భారంగా భావిస్తారు.
మార్పు అన్నది జీవితంలో అత్యంత సహజమైన విషయం. కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అయితే అందరూ ఆ మార్పులను తట్టుకోలేరు. జీవితంలో ఎప్పుడూ కూడా అన్ని రోజులు ఒకేలా ఉండవు. జీవితం అన్నాక సుఖదుఃఖాలు రెండూ వుంటాయి. దుఃఖం కలిగినప్పుడు తల్లడిల్లిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోకుండా జరిగిన అనుభవించిన సుఖాల గురించి, మంచిని గురించి ఆలోచించాలి. అప్పుడు మనం దుఃఖం గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళకుండా వుండేందుకు అవకాశం ఏర్పడుతుంది. మార్పులకు అనుగుణంగా మనం మారాలే తప్ప బాధ పడకూడదు. ఏ మార్పు జరిగినా అది మన మంచికే అన్న భావనను కలిగి ఉండాలి. అప్పుడే మానసికంగా ఎంతో కొంత ఓదార్పు లభిస్తుంది.
మనం మనకి సంబంధించిన వారు ఎవరైనా దూరమైపోతున్నప్పుడు చాలా బాధపడుతుంటాం. కొంతమంది ఈ చిన్న విషయానికి డిప్రెషన్ కు గురి కావటం జరుగుతుంది. మనుషులు దూరమైనంత మాత్రాన వారిలో మార్పు సంభవించదు, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎంతదూరంగా ఉంటే అంత ఎక్కువ ప్రేమ పెరుగుతుంది అన్న సత్యాన్ని ఆలోచించినట్లయితే డిప్రెషన్కు టాటా చెప్పవచ్చు.
◆నిశ్శబ్ద.