క్యాన్సర్ మీద యుద్ధానికి అస్త్రాలు ఇవే!

క్యాన్సర్ ప్రపంచంలో అధికశాతం మందిని బలి తీసుకుంటున్న అనారోగ్య సమస్య. ఈ క్యాన్సర్ తొలినాళ్లలో బయటపడకుండా చివరివరకు మనిషిలో దాక్కుని మనిషిని మరణానికి చేరువగా నెట్టి నరకాన్ని చూపిస్తుంది. అందుకే క్యాన్సర్ మీద అవగాహన కల్పించేందుకు గానూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీన జరుపుకుంటూ వస్తున్నారు. ఇంతకూ ఈ క్యాన్సర్ డే ఎలా ఆవిర్భవించింది. ఆరోజున చేసే పనులు ఏమిటి?? క్యాన్సర్ అధిగమించడం ఎలా?? వంటి కొన్ని ముఖ్యమైన విషయాలు అందరికోసం…


ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ క్యాన్సర్ దినోత్సవం 2008 లో  ప్రకటించబడింది. క్యాన్సర్ సమస్య చాపకింద నీరులా శరీరంలో ప్రవేశించి మనిషిని మరణానికి చేరువగా తీసుకెళ్లేవరకు బయటపడదు. ఈ కారణంగా క్యాన్సర్ మీద అందరికీ అవగాహన కల్పించాలని, క్యాన్సర్ ను మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని, క్యాన్సర్ గురించి అందరూ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రపంఫమ్ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి.  యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) 1993లో జెనీవాలో స్థాపించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ నిర్మూలనకు, వైద్య పరిశోధనలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న సభ్యత్వ-ఆధారిత సంఘం.  దాని ఆధ్వర్యంలో, అదే సంవత్సరంలో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మొదటి అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకున్నారు.  అనేక ప్రసిద్ధ సంస్థలు, క్యాన్సర్ సంఘాలు, చికిత్సా కేంద్రాలు ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చాయి.


 2000లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రపంచ సదస్సులో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అధికారికంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పారిస్‌లో జరిగింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ సంస్థల సభ్యులు, ప్రముఖ ప్రభుత్వ నాయకులు ఈ సదస్సుకు  హాజరయ్యారు.  క్యాన్సర్ రోగుల జీవితం బాధాకరంగా మారకుండా, వారి జీవితం మెరుగ్గా గడిచిపోయేందుకు ప్రపంచం నిర్వర్తించాల్సిన బాధ్యతను వివరిస్తూ, 10 కథనాలతో కూడిన 'చార్టర్ ఆఫ్ ప్యారిస్ ఎగైనెస్ట్ క్యాన్సర్' పేరుతో ఒక పత్రంపై సంతకం చేయబడింది.  క్యాన్సర్‌ గురించి పరిశోధించడం, నివారించడం, దానికి చికిత్స చేయడంలో పురోగతి సాధించడం. పరిశోధనల కోసం పెట్టుబడి వంటి విషయాలు ప్రస్తావించబడ్డాయి.   ఈ చార్టర్‌లోని ఆర్టికల్ ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించింది.


 క్యాన్సర్ అనేక రకాలను కలిగి ఉంది, కాబట్టి నిర్దిష్ట రకం క్యాన్సర్‌ను గుర్తించడానికి మరియు దానితో పోరాడడాన్ని ప్రోత్సహించడానికి వివిధ రంగులు మరియు చిహ్నాలు ఉపయోగించబడతాయి.  ఉదాహరణకు, ఆరెంజ్ రిబ్బన్ అనేది పిల్లల్లో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం కోసం, పింక్ రిబ్బన్ ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనతో ముడిపడి ఉంది.  ప్రాణాలతో బయటపడిన వారి ఆశకు చిహ్నంగా, డాఫోడిల్ పువ్వును  ఉపయోగిస్తారు. 


క్యాన్సర్ డే రోజు ఏమి చేయవచ్చు??


 ఈ రోజున, ఆసుపత్రులు, పాఠశాలలు, వ్యాపారాలు, మార్కెట్‌లు, కమ్యూనిటీ హాళ్లు, ఉద్యానవనాలు మొదలైన వాటిలో వ్యక్తులు, సంఘాలు, సంస్థలను ఒకచోట చేర్చి ప్రచారం చేయడానికి, అవగాహన కల్పించడానికి, ఈవెంట్స్ ను నిర్వహిస్తారు. దీనికోసం విరాళాల సేకరణ కూడా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది.  క్యాన్సర్ బారిన పడిన వారు ఒంటరి కాదు, ఈ ప్రపంచం వారికి అండగా నిలబడుతుంది అనే భరోసా ఇవ్వడమే ఈ అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం.


క్యాన్సర్ ను మందులతోనే కాదు ప్రేమ, ఆప్యాయత, సహకారంతో కూడా తరిమికొట్టండి. అలాగే ప్రేమను, ఆప్యాయతను క్యాన్సర్ బాధితులకు మనఃపూర్వకంగా పంచండి.


                             ◆నిశ్శబ్ద.