మైక్రో వెడ్డింగ్ పేరు విన్నారా? ట్రెండ్ అవుతున్న ఈ పెళ్లి ఏంటంటే..!
posted on Mar 27, 2025 9:30AM

భారతదేశంలో వివాహం అంటే ఒక పెద్ద పండుగ. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏ సంబరానికి ఖర్చు పెట్టనంత ఖర్చు పెడతారు. అమ్మాయి వైపు ఆలోచిస్తే.. ఒక తండ్రి తన జీవిత కాలంలో సంపాదించే సంపాదనలో దాదాపు పావు భాగం నుండి సగ భాగం వరకు కూతుళ్ల పెళ్లి కోసం ఖర్చు చేస్తారు. చాలా వరకు ఆడపిల్ల వైపే పెళ్లి ఖర్చు ఉంటుంది. మగ పెళ్ళివారిది కూడా ఖర్చు ఉంటుంది. కానీ ఆడపిల్ల వైపు జరిగేంత ఖర్చు మాత్రం కాదు. ఇకపోతే ఈ ఖర్చుల గురించి నేటి యువత చాలా సీరియస్ గానే ఆలోచించి పెళ్లిళ్లను ఆడంబరంగా చేసి డబ్బులు ఖర్చు చేయడం కంటే సింపుల్ గా చేసి డబ్బు ఆదా చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇలా ఘనంగా చేసే వైపు నుండి సింపుల్ గా పెళ్లి చేయడాన్ని మైక్రో వెడ్డింగ్ అంటున్నారు. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే..
మైక్రో వెఢ్డింగ్..
మైక్రో వెడ్డింగ్ అంటే వివాహాన్ని సూక్ష్మ పద్ధతిలో నిర్వహించడం అని అర్థం. దీని అర్థం మొత్తం ఇలా చెప్పడంలోనే ఉంది. మైక్రో వెడ్డింగ్ అంటే చాలా పెద్ద స్థాయిలో జరగని వివాహం. దీనికి ఎక్కువ ఖర్చు ఉండదు, జనాల హడావిడి కూడా ఎక్కువగా ఉండదు. ఈ వివాహంలో, వధూవరులతో పాటు చాలా సన్నిహిత కుటుంబ సభ్యులు, అతిథులు పాల్గొంటారు. వివాహాలు అతి తక్కువ మందితో జరుగుతాయి. వాటి సంఖ్య గరిష్టంగా 50-100, కనిష్టంగా 20-25 వరకు ఉండవచ్చు. ఇంత మంది సమక్షంలో కూడా ఒక గొప్ప వివాహం నిర్వహించబడుతుంది. ఇది అధికారికంగా చేయవచ్చు లేదా సాధారణంగా చేసేయవచ్చు. అయితే మైక్రో వెడ్డింగ్ లో జరిగే పెళ్లి తంతు హంగామాలు అన్ని సింపుల్ గా చేసేస్తారు.
మైక్రో వెడ్డింగ్ లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మైక్రో వెడ్డింగ్‌లో అతిథులు తక్కువగా ఉంటారు కాబట్టి ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. సాంప్రదాయ వివాహంతో పోలిస్తే మైక్రో వెడ్డింగ్‌ను చాలా తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. పెళ్లి కోసం జరిగే ఖర్చును ఆదా చేసి భవిష్యత్ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి అనుకునే వారు మైక్రో వెడ్డింగ్ వైపు దృష్టి సారిస్తున్నారు. కరోనా కాలంలో జనసమూహం గుమిగూడడంపై నిషేధం ఉంది. తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన వారు చాలా తక్కువ మంది అతిథులతో, ఎటువంటి ఆడంబరం లేకుండా వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి చూసిన వారందరికీ అది నచ్చింది. ఇదే మైక్రో వెడ్డింగ్ గా మారింది.
మైక్రో వెడ్డింగ్ ప్రయోజనాలు..
అప్పుల బాధ ఉండదు..
చాలామంది పరిమితులను మరచిపోయి పెళ్లికి చాలా ఖర్చు చేస్తారు. చివరికి వారు అప్పుల్లో కూరుకుపోతారు. మైక్రో వెడ్డింగ్ ఊహించని అప్పుల నుండి దూరంగా ఉంచుతుంది. ఇవి పూర్తిగా బడ్జెట్ అనుకూలమైనవి.
ఆత్మీయ పలకరింపులు..
సాంప్రదాయ వివాహంతో పోలిస్తే, మైక్రో వివాహంలో అతిథులను సంతోషంగా ఉంచవచ్చు. నిజానికి వివాహ వేడుకలో ప్రతి అతిథితో సమయం గడపడం సాధ్యం కాదు. దీనికి విరుద్ధంగా మైక్రో వివాహాలలో, తక్కువ మంది అతిథుల కారణంగా వధూవరులతో పాటు ఇతర అతిథులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటారు.
అలంకరణ..
సాంప్రదాయ వివాహాల మాదిరిగా కాకుండా మైక్రో వివాహాలకు చాలా పెద్ద వేదిక అవసరం లేదు. స్థలం చిన్నది కాబట్టి, అలంకరణకు పెద్దగా ఖర్చు ఉండదు. అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదికను అలంకరించవచ్చు.
ఆహార నాణ్యత..
మైక్రో వెడ్డింగ్‌లో తక్కువ మంది ఉంటారు. తక్కువ ఆహారం వండుతారు. తక్కువ ఆహారాన్ని వండినప్పుడు దాని నాణ్యత మెరుగుపడుతుంది. ఇది కాకుండా తక్కువ ధర కారణంగా మీరు చాలా వెరైటీని కూడా ఉంచుకోవచ్చు. అలాగే ఆహార వృధాను నివారించవచ్చు.
సమయం ఆదా..
సాంప్రదాయ వివాహాలలో చాలా రోజులు పట్టే వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయి. కానీ మైక్రో వివాహంలో, మెహందీ-సంగీత్ నుండి వివాహం వరకు అన్ని ఆచారాలు కనీసం 2-3 రోజుల్లో పూర్తవుతాయి. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. అందుకే మైక్రో వివాహాల వైపు ఆకర్షితులవుతున్నారు.
నష్టాలు..
ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే, సూక్ష్మ వివాహాలకు కూడా వాటి ప్రయోజనాలతో పాటు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. సూక్ష్మ వివాహాలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ రకమైన వివాహం వల్ల కలిగే కొన్ని ప్రతికూలతలు..
మైక్రో వెడ్డింగ్ అనేది ఒక చిన్న వివాహ వేడుక. ఎవరిని పిలవాలో, ఎవరిని వదిలేయాలో చాలా మందికి అర్థం కాదు. చాలాసార్లు ఎవరినైనా ఆహ్వానించాలని కోరుకుంటారు. కానీ మైక్రోో వివాహం యొక్క పరిమితుల కారణంగా, ఆహ్వానం నుండి చాలామంది పేర్లను తొలగించాల్సి వస్తుంది. మైక్రో వివాహం వల్ల సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉంది.
*రూపశ్రీ.