'జననాంగ వికృతీకరణ' సృష్టికి మూలాన్ని సమాధి చేస్తున్నారు!

ఈ ప్రపంచం సంగతి ఏమిటో కానీ.. ఈ దేశంలో మాత్రం స్త్రీకి సంబంధించిన కొన్ని విషయాలను మాట్లాడటానికి ఎంతో సంకోచిస్తారు. అలాంటి వాటిలో సెక్స్,స్త్రీ-పురుష జననేంద్రియాలు, వాటికి సంబంధించిన సమస్యలు. మనుషులను ఉద్రేకపరిచే కోరికలు మొదలైనవి ఎంతో ముఖ్యమైనవి. అయితే ఎన్నో వందల సంవత్సరాల నుండి స్త్రీ చాలా విషయాల్లో అణిచివేయబడుతోంది. ఈ సృష్టిలోకి ఓ మనిషి రావాలంటే స్త్రీ జననేంద్రియం దానికి కార్యక్షేత్రం. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ప్రపంచం ఇన్ని మార్పులకు లోనైనా ఎన్నోచోట్ల ఇప్పటికీ స్త్రీల పట్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి. వాటిలో స్త్రీ జననేంద్రియం మీద అధికారం, అణిచివేత కూడా ముఖ్యమైనది. 


స్త్రీ జననేంద్రియ వికృతీకరణకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6న జీరో టాలరెన్స్ ఫిమేల్ జెనెటల్ మ్యుటిలేషన్ ను అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు.  మనం 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ, ఓ హింసాత్మక సంప్రదాయం ఇప్పటికీ ఉనికిలో ఉండటం చాలా కలవరపెడుతోంది.  ఆఫ్రికా మరియు తూర్పు ఐరోపా నుండి అరబ్ దేశాలు, ఆసియా, లాటిన్ అమెరికా వరకు  స్త్రీల జననేంద్రియాల పట్ల  జరుగుతున్నవి చాలా దారుణమైనవి.  బాహ్య స్త్రీ జననేంద్రియాలను తొలగించడం వేల సంవత్సరాల లింగ అసమానతలో ముఖ్యమైనదిగా ఉంది.   ఇతరులు స్త్రీ యొక్క లైంగికత మరియు ఆనందాన్ని నియంత్రించడానికి దీనిని పాటిస్తారు.  దీని గురించి ప్రపంచానికి సరైన అవగాహన  కల్పించేందుకు  ఫిబ్రవరి 6వ తేదీని స్త్రీ జననేంద్రియ వికృతీకరణకు జీరో టాలరెన్స్ డేగా ప్రకటించింది.


అసలు ఏమిటీ సమస్య.. ఎక్కడుంది ఈ ఆచారం??


స్త్రీ జననేంద్రియ వికృతీకరణ అనేది స్త్రీ జననేంద్రియాలను పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించడం.  మహిళల యోని భాగంలో క్లిటోరిస్‌ను కుట్టడం, కత్తిరించడం చాలా దేశాలలో పాటించే అలవాటు. ఇది మహిళల పట్ల దారుణమైన చర్య కలిగి ఉంది. 


 ప్రపంచం  స్త్రీ జనాభా విషయంలో  విఫలమవుతూనే ఉంది, దాదాపు 200 మిలియన్ల మంది బాలికలు, మహిళలు ఇప్పటి వరకు జననేంద్రియ వికృతీకరణకు గురయ్యారు, ఈ సంఖ్య క్రమక్రమంగా  పెరుగుతూనే ఉండటం దిగ్భ్రాంతికి గురిచేసే విషయం. 


అయితే.. ఇది ఎక్కడ ఉద్భవించిందనే దానిపై చరిత్రకారులు స్పష్టత ఇవ్వనప్పటికీ  ఇది చాలా కాలంగా ఉండటమే కాదు, ప్రపంచంలోని అనేక జాతి, తెగ ప్రజలు ఇప్పటికీ దీనిని పాటిస్తున్నారు.  ఉప-సహారా, అరబ్ దేశాలలో స్త్రీ జననేంద్రియ వికృతీకరణ చేయడం చాలా సాధారణం.


దీని వల్ల కలుగుతున్న నష్టం ఏమిటి??


 స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కేవలం స్త్రీలను అణిచివేస్తున్న ఒక మార్గం మాత్రమే కాదు. ఇది చాలా పెద్ద అనారోగ్య సమస్యలు దారి తీస్తున్న అంశం.  స్త్రీలలో, బాలికలలో  లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.  జననేంద్రియ వికృతీకరణకు గురైన స్త్రీలు ప్రసవానంతర రక్తస్రావం, పిండం మరణం, ప్రసవానికి ఆటంకం మొదలైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువ ఉంది. ఇంకా మానసిక ప్రభావాలు చాలా దీర్ఘకాలం ఉంటాయి.  వాటి తాలూకూ గాయాలు పిల్లలలో ప్రవర్తనా సమస్యలకు దారితీస్తుంది, మానసిక స్టైర్యాన్ని బలహీనపరిచి ఆందోళన, ఒత్తిడి పెరగడానికి కారణం అవుతాయి.  


ఇన్నాళ్లు ఈ సమస్య ఇలా కొనసాగడానికి స్త్రీలలో భయమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయా విషయాలు  నోరు తెరచి మాట్లాడాలంటే స్త్రీలు  చాలా భయాందోళనకు గురవుతారు. సమాజం కూడా అలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదు అనే ఒకానొక కట్టుబాటును విధించారు. దీనివల్ల స్త్రీల సమస్యను పరిష్కరించడం కూడా సవాలుగా మారింది.

 2012  ఫిబ్రవరి 6న స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రకటించింది. దీని గురించి అవగాహన కల్పించడం, స్త్రీలలో చైతన్యం తీసుకురావడం, స్త్రీలు ఈ సమస్య వల్ల పడుతున్న ఇబ్బందులను సమాజానికి వినిపించడం. మొత్తంగా స్త్రీలకు ఈ సమస్య నుండి విముక్తి కలిగించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. 


                                      ◆నిశ్శబ్ద.