ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

 


ఈ వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఇంటిని చల్లగా ఉంచుకోవడం రోజువారీ యుద్ధంలా అనిపిస్తుంది.  ముఖ్యంగా ఇంట్లో ఫ్యాన్, కూలర్, ఏసీ పెట్టుకోవాలంటే  విద్యుత్ బిల్లులను  చూసి భయపడుతుంటారు.  కానీ ఈ విద్యుత్ బిల్లులు తగ్గించుకుని పర్యావరణ అనుకూలంగా ఉండటానికి ప్రయత్నించాలని చాలా మంది అనుకుంటారు.  కానీ ఇల్లు చల్లగా ఉండటానికి ఏం చేయాలి?  అనే విషయం చాలా మందికి తెలియదు. ఎయిర్ కండిషనర్లు అప్పటికప్పుడు  వేడి నుండి  ఉపశమనాన్ని అందిస్తున్నప్పటికీ, అవి రోజు మొత్తం చల్లగా ఉండటంలో అస్సలు ఉపయోగపడవు.  అయితే ఇంట్లో ఏసీ లేకుండానే చల్లగా ఉంచుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి.  వీటిని ఫాలో అయితే వేసవి అంతా చల్లగా హాయిగా గడిచిపోతుంది.  

వెదురు కర్టెన్లు లేదా  వట్టివేరు మ్యాట్లకు మారాలి..

ఎక్కువ వేడిని తట్టుకుని వేడిని లోపలి పోకుండా చేసేందుకు సాధారణ కర్టెన్లు తొలగించి వెదురు బ్లైండ్లు లేదా వట్టివేరు చాపలను ఎంచుకోవాలి.   ఈ చాపలను కర్టెన్ లాగా ఉపయోగించుకోవచ్చు.  వట్టివేర్ చాపల మీద నీటిని చల్లితే   ఇంట్లోకి ప్రవేశించే గాలిని సహజంగా చల్లబరుస్తూ, రిఫ్రెషింగ్ మట్టి సువాసనను విడుదల చేస్తాయి. ఇది వేసవి వేడి నుండి చాలా గొప్ప ఉపశమనం ఇచ్చే చిట్కా.

మట్టి కుండలతో నేచురల్ కూలర్లు..

ఇంట్లో మట్టి కుండ పెట్టుకుని అందులో చల్లని నీరు తాగడం అందరికి తెలిసే ఉంటుంది.  అయితే చాలా మందికి తెలియని చిట్కా ఏంటంటే.. ఇంట్లో వేడి బాగా ఉన్న ప్రాంతాలలో మట్టి కుండలు ఉంచి ఆ మట్టి కుండలలో నీరు పోయాలి.  కుండలలో నీరు ఆవిరి అవుతూ ఉంటే కుండ చుట్టు పక్కల వాతావరణం చల్గగా ఉంటుంది.  మట్టి కుండలను ఇలా ఉంచడం వల్ల సహజంగా ఇల్లు ఎయిర్ కూలర్లు పెట్టినట్టు ఉంటుంది.

క్రాస్ వెంటిలేషన్..

ప్రకృతి ప్రసాదించిన శీతలీకరణ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలి.  ఉదయం,  సాయంత్రం వేళల్లో  కిటికీలను తెరిచి ఉంచాలి. తద్వారా తాజా గాలి లోపలికి ప్రవహిస్తుంది. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో వేడి గాలి లోపలికి రాకుండా వాటిని మూసి ఉంచండి. ముఖ్యంగా క్రాస్ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఇది చల్లని గాలిని లోపలికి,  వేడి గాలిని బయటకు వెళ్లేలా చేస్తుంది.  ఈ సులభమైన ఉపాయం చాలా తేడాను కలిగిస్తుంది.

రంగులు..

నలుపు రంగు క్లాసీగా ఉన్నప్పటికీ, లేత రంగు కాటన్ బెడ్‌షీట్లు, కుషన్ కవర్లు,  కర్టెన్లు వంటివి తక్కువ వేడిని శోషిస్తాయి. అందుకే ఇంట్లో లేత రంగు ఉండే కర్టెన్లు, దిండు కవర్లు, కార్పెట్లు వంటివి ఎంచుకోవాలి.  ఇవి వేడిని బంధించడానికి బదులుగా ప్రతిబింబిస్తాయి, మీ ఇంటిని తాజాగా,  చల్లని  గాలిలితో  ఉంచుతాయి.

ఇండోర్ మొక్కలు..

కలబంద, అరెకా పామ్స్, స్నేక్ ప్లాంట్స్,  మనీ ప్లాంట్స్ గాలిని శుద్ధి చేయడమే కాకుండా  అవి ఇండోర్ ఉష్ణోగ్రతలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కిటికీలు,  సీటింగ్ ప్రదేశాల దగ్గర వాటిని  ఉంచడం వల్ల సహజంగా చల్లటి వాతావరణం ఉండేలా చేస్తాయి.


                         *రూపశ్రీ