రైతులు, ప్రజల్లో మనోధైర్యం నింపేలా రజతోత్సవ సభ.. కేసీఆర్

చాలా రోజుల తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోరు విప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తనదైన స్టైల్లో విమర్శల వర్షం కురిపించారు. పనిలో పనిగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించినందుకు జనం ఇప్పుడు బాధపడుతున్నారని కూడా అన్నారు.  అయితే ఇదంతా కూడా తెలంగాణ భవన్ కు వచ్చో, ఏదో బహిరంగ సభలోనో చేసిన ప్రసంగం కాదు. తన తన ఫామ్ హౌస్ లో కూర్చునే చేసిన ఉపదేశం. 

ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరంగల్ జిల్లా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఈ నెల 24న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై వరంగల్ జిల్లా పార్టీ నేతలకు సూచలను ఇచ్చారు.  సభకు పెద్ద ఎత్తు జనం స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పిన కేసీఆర్.. ఆ వచ్చే జనాలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  తెలంగాణ ప్రజలకు మనో ధైర్యాన్ని ఇచ్చే విధంగా రజతోత్సవ సభ ఉండాలని అన్నారు. ఈ సభ తరువాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ కమిటీలు వేస్తానన్న కేసీఆర్.. పార్టీ క్యాడర్ కు, నేతలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక  ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్రంలో రేవంత్ నియంత పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకుని కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయన్నారు.

తెలంగాణ రైతులకు ఈ దుస్థితి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని విధాలుగా దగాపడి మనో ధైర్యాన్ని కోల్పోయిన రైతులు, వివిధ వర్గాల ప్రజలలో ధైర్యం నింపే విధంగా రజతోత్సవ సభ నిర్వహిద్దామని పిలుపు నిచ్చారు. కేసీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ నేతలు బుధవారం (ఏప్రిల్ 2) ఎల్కతుర్తిలోని సభా ప్రాంగణానికి భూమి పూజ నిర్వహించారు. కేసీఆర్ రజతోత్సవ సభకు సంబంధించి నేతలకు చేసిన దిశా నిర్దేశంతో.. రజతోత్సవ సభ వేదిక వరంగల్ నుంచి మేడ్చల్ కు మారుతుందన్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లైంది.