మీ బడ్జెట్ మీ చేతుల్లో ఉందా?

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మొదటి తేదీ వచ్చిందంటే దేశం మొత్తం అసక్తిగానూ అంతకు మించి ఆందోళన, అసంతృప్తులతోనూ మూల్గుతుంది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టడమే.. ఈ బడ్జెట్ పుణ్యమా అని కొన్ని వస్తువుల ధరలు తగ్గితే.. మరికొన్ని వస్తువుల ధరలు రయ్యిమని పైకి ఎగిసిపడతాయి. ఇదంతా దేశానికి, ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినది అయితే ఈ సమాజంలో ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు ప్రతి నెలా బడ్జెట్ బేజార్… బాబోయ్.. అనిపించేలా ఉంటుంది. కారణం ఏమిటంటే మార్కెట్ లో పద్దులు మారిపోవడం. అనుకోకుండా పెరిగే ధరలు సగటు మధ్యతరగతి జీవికి కొరివితో వా తలు పెట్టిన చందంగా ఉంటుంది. అయితే కాస్త అవగాహన ఉండాలి ఎలాంటి పరిస్థితిలో అయినా మీకున్న సంపాదనతోనే మంచి ప్రణాళిక వేసుకుని హాయిగా కాలం వెళ్లదీయచ్చు. ఇంతకూ ఎలాంటి పద్దులు వేస్తే లెక్కల చిట్టా సద్దుమనుగుతుందంటే…


అవసరానికి అలవాటుకు తేడా తెలుసుకోవాలి!!


చాలా మందికి కొన్ని ఖర్చులు ఓ అలవాటుగా మారిపోయి ఉంటాయి. సాయంత్రం అలా బయటకు వెళ్లి టీ తాగడం, ఆదివారం అవ్వగానే స్నేహితులతో మందు కొట్టడం, వీధి అమ్మలక్కలు అందరూ కలసి కిట్టీ పార్టీ చేసుకోడం. మొహమాటం కొద్దీ లేని బరువులు నెత్తిన వేసుకోవడం వంటివి చేస్తుంటారు. అవన్నీ అవసరాలు కాదు కేవలం అలవాట్లు అనే విషయం గుర్తించాలి. ఇది లేకపోతే పని జరగదు, ఇది చేయకపోతే సమస్య పరిష్కారం కాదు అనేలా ఉండేవి అవసరాలు. అలాంటి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని సమయాన్ని, డబ్బును వృధా చేసే అలవాట్లను మానుకోవాలి.


తృప్తితోనే సంతోషం!!


తృప్తి పడటం నేర్చుకుంటే ఏమి లేకపోయినా సంతోషంగా ఉండవచ్చు. చాలామంది ఏదో లేదు అనుకుంటూ ఉన్న దాన్ని పట్టించుకోకుండా ఉన్న సుఖాన్ని అనుభవించి అనుభూతి చెందకుండా ఉంటారు. అలాంటి వాళ్లకు తృప్తి విలువ తెలియాలి. ఒక మనిషి వేల రూపాయలు పెట్టి బయట ఎంత ఎంజాయ్ చేసినా ఇంట్లో వారితో 100 రూపాయలతో సరదాగా గడిపే వ్యక్తి తృప్తి ముందు దిగదుడుపే.. కాబట్టి తృప్తి అనేది పెట్టె ఖర్చులో కాదు కలసి పంచుకోవడంలో ఉంటుంది.


పొదుపే.. రేపటి బంగారు భవిత!!


పొదుపు చేయడం కూడా ఒక విద్య అని చెప్పవచ్చు. ఈ విషయంలో చాలామంది ఆడవాళ్ళను ఉదాహరిస్తారు. కానీ పొదుపుకు జెండర్ తో సంబంధం లేదు. చక్కగా ప్రణాళికలు వేసి డబ్బు ఆదా చేసే మగవారు ఉన్నారు, పోపుల డబ్బా నుండి పాలసీలు వరకు ఎన్నో రూపాల్లో పొదుపు మార్గంలోకి పైసాలను మళ్లించే ఆడవారు ఉన్నారు. కావాల్సిందల్లా అవగాహన మాత్రమే. పైన చెప్పుకున్నట్టు అవసరమైనవి ఏవి అలవాట్లు ఏవి అనేది గుర్తిస్తే ఎంత డబ్బు ఆదా చేయవచ్చు. ఆ తరువాత దుబారా ఖర్చులు వదిలి తృప్తిగా బ్రతకడం తెలుసుకుంటే డబ్బు పోగేయడం ఇంత ఈసీ నా అని కూడా అనిపిస్తుంది. 


కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే..


మీ నెలసరి సంపాదన ఎంతైనా కావచ్చు. దానికి తగినట్టు మీ ఖర్చులు, పొదుపు, మదుపు ఉండేలా మీరే చక్కగా ప్రణాళికలు వేసుకోవచ్చు. అలా చేస్తే మీ బడ్జెట్ భలేగా హిట్టయ్యి టెన్షన్ లేని జీవితాన్ని మీకు అందిస్తుంది. మరి నిర్మలా సీతారామన్ కంటే మేటిగా, దేశ బడ్జెట్ కు ధీటుగా మీరూ వేయండి మీ ఇంటి కోసం బడ్జెట్ ప్లాన్..


                                    ◆నిశ్శబ్ద.