ఏపీలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

తెలుగు రాష్ట్రాలలో ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో ఐదు, తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. తెలంగాణలోని ఐదు స్థానాలకు గాను కాంగ్రెస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ నుంచి ఒకరు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నిక్యారు. ఆమేరకు కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, అలాగే కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం, ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్ లకు ఈసీ ధృవీకరణ పత్రం కూడా అంద జేసింది. 
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ఐదు స్థానాలలోనూ  తెలుగుదేశం కూటమి అభ్యర్థులే ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం ఈ ఐదింటిలో ఒక స్థానాన్ని జనసేనకు, ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకూ తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడ కూడా ఐదు స్థానాలకూ ఐదుగురే నామినేషన్లు దాఖలు చేయడంతో ఇక్కాడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది.  

దీంతో ఏపీలో తెలుగుదేశం కూటమి తరఫున ఎమ్మెల్సీలుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్, బీటీ నాయుడు, కొణిదల నాగేంద్రరావు (నాగబాబు), సోము వీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈసీ ప్రకటించి వారికి ధృవీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఈ ఐదుగురూ బుధవారం (ఏప్రిల్ 2)న ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.  వీరి చేత అసెంబ్లీ భవనంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.