జీవితం మొత్తం ఫూల్స్ కావొద్దు..
posted on Apr 1, 2025 9:30AM

ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు.. చాలామందికి చిన్నతనంలో ఏప్రిల్ ఫూల్ అంటూ చేసిన సందడి గుర్తొస్తుంది. చిన్నతనంలో ఏదో ఒక తుంటరి సాకు చెప్పడం, ఎదుటివారిని భయపెట్టడం వారు భయపడటం లేదా అప్రమత్తం కావడం జరగగానే ఏప్రిల్ ఫూల్ అనడం చాలామంది ఎంజాయ్ చేసిన సంఘటనలే.. ఈ ఏప్రిల్ ఫూల్ అనేది ఒక సరదా రోజుగా అందరికి తెలుసు.. కానీ ఏప్రిల్ ఫూల్ రోజు జరిగే తమాషా సంఘటనలలో పూల్స్ అయినా పర్లేదు కానీ నిజ జీవితంలో ఫూల్స్ కాకండి అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. జీవితంలో చాలామంది తమకు తెలియకుండానే అమాయకంగా ఫూల్స్ అయిపోతుంటారు. నిన్న కాక మొన్నే తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ కొత్త ఏడాదిలో అయినా ఎవరైనా ఫూల్స్ కాకుండా సంతోషంగా ఉండాలంటే ఈ కింద చెప్పుకున్న విషయాలు గుర్తుంచుకోవాలి.
జీవితం, తమాషా..
రోజువారీ జీవితంలో సంతోషం, తమాషా అనేవి ఉండటం మంచిదే.. కానీ జీవితమే తమాషా కాకూడదు. ఇలా జీవితమే తమాషా అయితే ఆ తరువాత ఇతరులకు మన జీవితం ఒక ఆట వస్తువుగా లేక విలువ లేని చిత్తు కాగితంలా అనిపిస్తుంది. అందుకే జీవితంలో తమాషా ఉన్నా జీవితాన్ని తమాషా కానివ్వకూడదు. జీవితంలో లక్ష్యాల పట్ల,చేస్తున్న పని పట్ల స్పష్టత ఉండాలి. చెయ్యాల్సిన పనిని ఇతరుల కారణంగా ఎప్పుడూ వాయిదా వేయడం, చేయకుండా ఆపేయడం వంటివి చేయకూడదు. చేసే పని మంచిది అయినప్పుడు, ఉపయోగకరమైనది అయినప్పుడు ఏ విధంగానూ కాంప్రమైజ్ అయ్యి దాన్ని వదలకూడదు. ఎందుకంటే చేసే పని, పని చేసే విధానం ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తుంది.
మంచి, చెడు..
ప్రతి ఒక్కరిలో మంచి, చెడు అనేవి ఉంటాయి. కానీ మనిషి తన జీవితంలో జరిగే మంచి అయినా చెడు అయినా తాను కరెక్ట్ అనే ఆలోచనలో ఉంటాడు. ఇది చాలా వరకు తప్పు. అయితే మంచి, చెడు అనేవి వ్యక్తి ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపించే అవకాశం ఉంది. దీని వల్ల మంచి చెడుల విషయం తేల్చుకునే అవకాశం చాలా మందికి ఉండదు. అయితే ఏ పని అయినా ఇతరులకు అపకారం చేయకుండా నష్టం కలిగించకుండా మనకు మేలు చేసే విధంగా ఉన్నంత వరకు ఆ పని చేయడం ఎప్పుడూ తప్పు కాదు.
విలువలే.. వ్యక్తిత్వం..
ప్రతి మనిషి విలువలు కలిగి ఉండాలి. ఇలా విలువలు కలిగి ఉండటమే మనిషి జీవితానికి గొప్ప ఆస్తి. మనిషిలో ఉన్న విలువలు మనిషి వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తాయి. అందుకే విలువలను ఎప్పటికీ వదలకూడదు. ఇతరుల పట్ల మంచిగా ఉండటం, ఇతరులను గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం, ప్రేమ, జాలి, కరుణ, దయ వంటివి ఉండటం.. ఇవన్నీ కూడా తన వ్యక్తిత్వాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ ను పోగొట్టుకోకుండా పాటించినప్పుడు ఆ వ్యక్తి ఎంతో హుందాగా, గొప్పగా అనిపిస్తాడు. ఇతరులకు ఇచ్చే గౌరవం, మర్యాద మన గౌరవాన్ని పెంచుతాయి.
నమ్మకం, అపనమ్మకం..
మనిషి జీవితం నమ్మకానికి, అపనమ్మకానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. తరువాత నిమిషం ఖచ్చితంగా ఏం జరుగుతుందనేది కూడా చాలామందికి స్పష్టంగా తెలియదు. అలాంటప్పుడు మనుషులను, పరిస్థితులను నమ్మకం అనే ఒక తాడులో బంధించి ఆ తరువాత దాన్ని పట్టుకుని వేలాడుతూ ఎప్పుడు తెగిపోయినా దానిదే తప్పని, ఇతరులదే తప్పని అనడం ఆ వ్యక్తిదే నిజమైన తప్పు. కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా దానిని ఎదుర్కోవడానికి సంసిద్దంగా ఉండాలి. అంతేకానీ నమ్మకాలు పెట్టుకుని అనవసరంగా బాధలలోకి జారిపోకూడదు.
*రూపశ్రీ.