కేటీఆర్ అలా కమిట్ అవడం కరెక్టేనా?



ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రం దృష్టి మాత్రమే కాదు.. యావత్ దేశం దృష్టీ త్వరలో జరగబోతున్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక మీదే వుంది. ఈ ఉప ఎన్నిక చాలా కీలకమైన ఉప ఎన్నికగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏక ఛత్రాధిపత్యం వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ  భవిష్యత్తును ఈ ఉప ఎన్నిక ప్రతిఫలించే అవకాశం వుంది. గతంలో... అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎన్నో సందర్భాలలో తమ పదవులకు రాజీనామాలు చేసి, తిరిగి ఎన్నికలలో పోటీ చేసి విజయాలు సాధించారు. రాజకీయంగా తమ పార్టీ ప్రభావం తగ్గుతోందని భావించిన ప్రతి సారీ ఆ పార్టీ నాయకుడు కేసీఆర్ రాజీనామాలు, ఉప ఎన్నికలు అనే అస్త్రాలను ప్రయోగించి మళ్ళీ ఉద్యమ వేడి రగిల్చేవారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు వేరు. ఈ నేపథ్యంలో జరగబోతున్న వరంగల్ పార్లమెంట్ స్థాన ఉప ఎన్నిక చాలా కీలకమైనది.

ఉద్యమం జరిగినప్పుడు చేసిన రాజీనామాలు, ఉప ఎన్నికలు ప్రజల్లో ఆవేశాన్ని పెంచేవి... టీఆర్ఎస్‌కి మద్దతుగా నిలవాలన్న స్ఫూర్తిని రగిలించేవి. అయితే ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఎంపీ కడియం శ్రీహరి చేసిన రాజీనామా కేవలం సొంత పార్టీలోని రాజకీయ కారణాల వల్ల చేసినది. ఉప ముఖ్యమంత్రి రాజయ్య మీద అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఉద్వాసన పలికి, ఆయన స్థానంలో కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. అందువల్ల కడియం శ్రీహరి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అందువల్ల ఈ రాజీనామా అనేది ఊబుసుపోక చేయించిన రాజీనామా తప్ప తెలంగాణ ప్రజల కోసం చేయించిన రాజీనామా కాదనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో వుంది. అనేకమంది వరంగల్ ప్రజల్లో అయితే ఇది ప్రజాధనాన్ని ఖర్చు చేయించే ఉప ఎన్నిక అనే అభిప్రాయం కూడా వుంది. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఎన్ని తంటాలుపడి అయినా ఈ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకోవాలన్న కాంక్షతో టీఆర్ఎస్ వర్గాలు పనిచేస్తున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు ఈ ఉప ఎన్నిక విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ వరంగల్ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ స్థానంలో వచ్చే ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకున నిదర్శనంగా భావించవచ్చని మంత్రి గారు, ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ప్రకటించడం దుస్సాహసమే అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోందని, ఆ స్థానంలో టీఆర్ఎస్ విజయం అంత సులభం కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ తేడాతో ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో  కేటీఆర్ ఈ ఎన్నిక తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావించాలని కమిట్ అవడం ఆయనలోని మేకపోతు గాంభీర్యానికి ప్రతికగా భావించాల్సిందేనని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu